ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన ప్రధాన ప్రత్యర్థి చంద్రబాబునాయుడిని గిల్లారు. ఇప్పుడు చంద్రబాబు కూడా నువ్వు నేర్పిన విద్యే అంటూ అదే పని చేస్తున్నారు. ఏపీ రాజకీయాలను జగన్కు ముందు, ఆ తర్వాత అని మాట్లాడుకోవాలి. గతంలో అధికార, ప్రధాన ప్రతిపక్ష నాయకులు ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గాలపై రాజకీయ దృష్టి కేంద్రీకరించే వారు కాదు. ఏదో మొక్కుబడిగా అభ్యర్థులను నిలిపేవారు.
చంద్రబాబు ప్రాతినిథ్యం వహించే కుప్పంపై వైఎస్ రాజశేఖరరెడ్డి పెద్దగా దృష్టి పెట్టలేదు. అలాగే చంద్రబాబు కూడా పులివెందులను పట్టించుకునే వారు కాదు. కానీ జగన్ మాత్రం తాను సంప్రదాయ రాజకీయాలకు భిన్నమైన నాయకుడినని తన చర్యల ద్వారా చాటుకున్నారు. ఏకంగా చంద్రబాబు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పాన్నే జగన్ టార్గెట్ చేయడం విశేషం. వై నాట్ 175 నినాదంతో ఆయన రాజకీయ రచ్చ చేస్తున్నారు.
కుప్పంలో స్థానిక సంస్థల్లో వైసీపీ తిరుగులేని విజయాల్ని సొంతం చేసుకుంది. ఈ ప్రేరణతో చంద్రబాబును ఎందుకు ఓడించలేమని జగన్ పదేపదే అంటున్నారు. బాబును ఓడించేందుకు జగన్ సర్వశక్తులు ఒడ్డుతున్నారు. మంత్రి పెద్దిరెడ్డికి చంద్రబాబును ఓడించే బాధ్యతల్ని అప్పగించారు. కుప్పంలో పెద్దిరెడ్డి తరచూ పర్యటిస్తూ, టీడీపీని బలహీనపరిచేందుకు ప్రయత్నిస్తున్నారు. కుప్పంలో తన పట్టు కోల్పోకుండా చంద్రబాబు సైతం జాగ్రత్తలు తీసుకున్నారు.
ఈ నేపథ్యంలో తనను ఇరిటేట్ చేస్తున్న జగన్ ఆట కట్టించాలని చంద్రబాబు వ్యూహం రచిస్తున్నారు. వై నాట్ పులివెందుల అంటూ చంద్రబాబు తన శ్రేణుల్ని ఉసిగొల్పుతున్నారు. ఇందులో భాగంగా పులివెందులలో బుధవారం సాయంత్రం బహిరంగ సభ నిర్వహించేందుకు చంద్రబాబు నిర్ణయించుకోవడం సర్వత్రా చర్చనీయాంశమైంది. గతంలో చంద్రబాబు ఇలా పులివెందులపై పెద్దగా దృష్టి పెట్టకపోవడాన్ని టీడీపీ శ్రేణులు గుర్తు చేస్తున్నాయి.
రాయలసీమ ప్రాజెక్టుల సందర్శనకు చంద్రబాబు శ్రీకారం చుట్టారు. ఈ నెల 2న చంద్రబాబునాయుడు వైఎస్సార్ జిల్లాలోని గండికోట, చిత్రావతి ప్రాజెక్టుల ఎత్తిపోతల పథకాలను పరిశీలిస్తారు. అనంతరం ఆయన పులివెందులకు వెళ్లి నాలుగు రోడ్ల కూడలిలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారని ఆ జిల్లా పార్టీ నాయకులు ప్రకటించారు. తనను సీఎం జగన్ రెచ్చగొట్టడం వల్లే చంద్రబాబు కూడా దూకుడు ప్రదర్శించాల్సి వస్తోందని టీడీపీ నేతలు అంటున్నారు. లేదంటే పులివెందులపై చంద్రబాబు కన్నెత్తి చూసేవారు కాదని చెబుతున్నారు.
పులివెందుల నాలుగు రోడ్ల కూడలిలో చంద్రబాబు బహిరంగ సభ నిర్వహించడానికి జగన్ రెచ్చగొట్టే చర్యలే కారణమని టీడీపీ నేతలు అంటున్నారు. అధికార, ప్రధాన ప్రతిపక్ష నేతలిద్దరూ పరస్పరం కంచుకోటల్ని బద్ధలు కొట్టేందుకు సరికొత్త రాజకీయానికి తెరలేపారనే చర్చకు తెరలేచింది.