ఒక సినిమా కోసం అనుకున్న టైటిల్‌ మరో సినిమాకు!

ఎమ్‌ఎల్‌ఏ.. మంచి లక్షణాలున్న అబ్బాయి. చాలా క్యాచీ టైటిల్‌. ఎమ్‌ఎల్‌ఏ అనే మాటతో అటు పాలిటిక్స్‌ను గుర్తు చేస్తూ అదే సమయంలో కొత్తదనంతో కూడుకున్న నిర్వచనం ద్వారా వైవిధ్యాన్ని పంచే టైటిల్‌ ఇది. ప్రస్తుతం…

ఎమ్‌ఎల్‌ఏ.. మంచి లక్షణాలున్న అబ్బాయి. చాలా క్యాచీ టైటిల్‌. ఎమ్‌ఎల్‌ఏ అనే మాటతో అటు పాలిటిక్స్‌ను గుర్తు చేస్తూ అదే సమయంలో కొత్తదనంతో కూడుకున్న నిర్వచనం ద్వారా వైవిధ్యాన్ని పంచే టైటిల్‌ ఇది. ప్రస్తుతం రూపొందుతున్న కల్యాణ్‌ రామ్‌ సినిమాకు ఈ టైటిల్‌ను ఫిక్స్‌ చేశారు.

మరి ఈ టైటిల్‌ పెట్టడం సినిమాపై కొత్త అంచనాలకు కారణం అవుతోంది. టైటిల్‌లో ఉన్న వైవిధ్యం సినిమాలోనూ ఉంటుందనే ఆశలను పెంచుతోంది. మరి ఈ టైటిల్‌ వెనుక కథ ఈ టైటిల్‌కు మించిన ఆసక్తికరమైన వ్యవహారం.

ఇంతకు ముందు కూడా ఈ టైటిల్‌ ఒకసారి వార్తల్లోకి వచ్చింది. మరో సినిమాకు ఈ టైటిల్‌ ఖరారు అయినట్టుగా వార్తలు వచ్చాయి. అది కూడా నందమూరి వారి సినిమాకే కావడం గమనార్హం.

హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో ఎన్టీఆర్‌ హీరోగా వచ్చిన 'రామయ్యా వస్తావయ్యా' సినిమాకు ముందుగా అనుకున్న టైటిల్‌ 'ఎమ్‌ఎల్‌ఏ'. ఫుల్‌ఫార్మ్‌లో చెప్పాలంటే మంచి లక్షణాలున్న అబ్బాయి. ఎమ్‌ఎల్‌ఏ టైటిల్‌కు ఆ ట్యాగ్‌లైన్‌తో అప్పట్లో వర్కింగ్‌ టైటిల్‌ అనుకున్నారు. చాన్నాళ్ల పాటు అదే ప్రచారం జరిగింది.

కానీ చివరకు టైటిల్‌ మార్చారు. ఎమ్‌ఎల్‌ఏ కాస్తా రామయ్యా వస్తావయ్య అయ్యింది. ఆ సినిమా అంత ఆకట్టుకునే ఫలితాన్ని పొందలేదు. ఫస్టాఫ్‌ చాలా బాగుందనే పేరును తెచ్చుకుని ద్వితీయార్థం బాగా నిరాశ పరచడంతో ఆ సినిమా సో.. సో.. అనిపించుకుంది.

అయితే ఆ సినిమా వచ్చి వెళ్లిపోయినా ఎంఎల్‌ఏ అనే టైటిల్‌ అలాగే మిగిలిపోయింది. ఇప్పుడు దాన్ని నందమూరి కల్యాణ్‌రామ్‌ సినిమా కోసం వాడుకుంటున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని పొందుతుందో చూడాల్సి ఉంది.

మరి ఇలా ఒక హీరో సినిమా కోసం అనుకున్న టైటిల్‌ మరో హీరో చేతికి రావడం, ఒక హీరో సినిమాకు వర్కింగ్‌ టైటిల్‌గా వాడిన టైటిల్‌ మరో సినిమాకు వాడుకోవడం కొత్తేమీ కాదు. బాగా పాపులర్‌ సినిమాల కోసం కూడా అలాంటి వాడకాలు జరిగాయి. అందుకు మరో ఉదాహరణ 'కంత్రి'.

ఎన్టీఆర్‌ హీరోగా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. జస్ట్‌ యావరేజ్‌ అనిపించుకుంది. కంత్రి అనే టైటిల్‌ ఎన్టీఆర్‌కు ఏ మాత్రం సూటబుల్‌ అయ్యిందో కానీ.. అంతకన్నా ముందే ఈ టైటిల్‌ మరో సినిమా విషయంలో వినిపించింది. అది పూరీజగన్నాథ్‌ సినిమా.. విషయంలో.. అది కూడా మెగాస్టార్‌ తనయుడు రామ్‌చరణ్‌ తేజ పరిచయం అయిన సినిమాకు!

అదేంటీ చరణ్‌ సినిమా ఇంట్రడ్యూస్‌ అయిన సినిమా పేరు 'చిరుత' కదా అనొచ్చు.. అయితే ఆ సినిమాకు ఈ టైటిల్‌ను ఫిక్స్‌ చేయకముందు 'కంత్రి' అనే టైటిల్‌ను కూడా పరిశీలించారు. అప్పటికే పూరిజగన్నాథ్‌ ఇడియట్‌, పోకిరి, దేశముదురు వంటి తిట్లను టైటిల్స్‌గా పెట్టి హిట్లు కొట్టాడు.

దీంతో చరణ్‌ ఇంట్రడక్షన్‌ సినిమాకు కంత్రి అనే టైటిల్‌ను పరిశీలించారు. కానీ.. తొలి సినిమాకు అలాంటి టైటిల్‌ మంచిది కాదని మెగా ఫ్యామిలీ భావించింది. చరణ్‌కు కంత్రీ అనే ముద్ర ఎక్కడ పడుతుందో అని భయపడి.. మరో టైటిల్‌ కోసం అన్వేషించగా 'చిరుత' అనే టైటిల్‌ దొరికింది.

చిరు తనయుడి సినిమాకు చిరుత అనే టైటిల్‌ బాగా యాప్ట్‌ అయ్యిందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకు కంత్రి టైటిల్‌ను వాడేశారు. చరణ్‌కు సొంతం కావాల్సిన టైటిల్‌ ఎన్టీఆర్‌కు ఉపయోగపడింది.

వెంకటేష్‌ సినిమా టైటిల్‌ శర్వానంద్‌కు దక్కింది…

'రాధ' కొన్నాళ్ల కిందట వెంకటేష్‌ హీరోగా దాసరి మారుతి దర్శకత్వంలో అనౌన్స్‌ అయిన సినిమా పేరు. ఆ సినిమాలో వెంకటేష్‌ హోం మినిస్టర్‌గా నటిస్తున్నాడని, మంత్రి హోదాలోని వ్యక్తి ప్రేమలో పడితే ఎలా ఉంటుందో అనే కాన్సెప్ట్‌ మీద హ్యూమరస్‌ సినిమాను రూపొందిస్తున్నామని దానికి రాధ అనే టైటిల్‌ను పెట్టామని దాసరి మారుతి అనౌన్స్‌ చేశాడు.

వెంకీకి లేడీస్‌ టైటిల్‌లు బాగా అచ్చొచ్చాయి. లక్ష్మీ అని అమ్మాయి పేరును టైటిల్‌గా పెట్టి సినిమా తీస్తే అది సూపర్‌ హిట్‌ అయ్యింది. దీంతో రాధ కూడా సెంటిమెంట్‌ అవుతుందని అంతా అనుకున్నారు.

అయితే రాధ విషయంలో కథ అనూహ్యంగా అడ్డం తిరిగింది. ఆ సినిమా వివాదంలో పడింది. కాపీ రైట్స్‌ వివాదంలో చిక్కుకుని చివరకు ఆగిపోయింది. డ్యామేజ్‌ కంట్రోల్‌ కోసం మారుతి ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. రాధ అనే టైటిల్‌ అలాగే మిగిలిపోయింది. మరి అదంతా శర్వానంద్‌ కోసమే జరిగినట్టుంది. 

ఇటీవలే శర్వ హీరోగా రాధ అనే సినిమా వచ్చి వెళ్లింది. అంతగా ఆకట్టుకోలేకపోయిన ఈ సినిమా అలా వచ్చి ఇలా వెళ్లిపోయింది. ఇందులో శర్వా రాధ అనే పోలీసాఫీసర్‌గా నటించాడు. అయితే శర్వా నుంచి తాము ఇలాంటి సినిమాలను ఆశించడం లేదని ప్రేక్షకులు స్పష్టమైన తీర్పునిచ్చారు. ఆ విధంగా 'రాధ' అనే టైటిల్‌ కలిసి రాలేదని స్పష్టమైంది.

అల్లు అర్జున్‌కు అనుకున్న టైటిల్‌ ఎక్కడికో వెళ్లింది…

'వారధి' ఈ టైటిల్‌ను అల్లు అర్జున్‌ సినిమా ఒకదానికి అనుకున్నారు. అదే సినిమాకు అని ఫజిల్‌లా అడిగితే సమాధానం కష్టమే. బొమ్మరిల్లు భాస్కర్‌ దర్శకత్వంలో దిల్‌రాజు నిర్మాణంలో రూపొందిన 'పరుగు' సినిమాకు 'వారధి' అనే టైటిల్‌ను పరిశీలించారు. దాదాపు అదే టైటిల్‌ను కన్ఫర్మ్‌ చేసుకున్నారు.

సినిమా కథానుసారం ప్రేమికులకు వారధిగా వ్యవహరిస్తాడు హీరో. అందుకే ఆ సినిమాకు వారధి అని టైటిల్‌ పెట్టుకున్నట్టుగా ఉన్నారు. అయితే.. ఎందుకో అభిప్రాయాన్ని మార్చుకున్నారు. 'పరుగు' అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేసుకున్నారు.

అయితే అప్పటికే పరుగు అనే టైటిల్‌ వర్మ కంపెనీ రిజిస్టర్‌ చేయించింది. హిందీ సినిమా 'దౌడ్‌'ను 'పరుగు' పేరుతో డబ్‌ చేసినట్టున్నారు. దీంతో ఆ టైటిల్‌ హక్కులు వర్మ కంపెనీ దగ్గర ఉండినాయి.

ఎలాగూ ఆ డబ్బింగ్‌ సినిమాను మనోళ్లు పట్టించుకోలేదు కాబట్టి.. ఆ టైటిల్‌ కావాలని దిల్‌రాజు వర్మను సంప్రదించగా, దానికి సానుకూల స్పందన వచ్చింది. పరుగు టైటిల్‌ అల్లు అర్జున్‌ సినిమాకు ఫిక్స్‌ చేశారు. ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.

ఆ తర్వాత చాలా యేళ్లకు 'వారధి' అనే సినిమా ఒకటి వచ్చింది. 'ఘోస్ట్స్‌ టౌన్‌' వంటి హాలీవుడ్‌ సినిమాను కాపీ కొట్టి తీసిన సినిమా ఒకటి తెలుగులో ఉంది. దాని పేరు 'వారధి'. అయితే ఈ సినిమా వచ్చిందని కూడా చాలా మందికి తెలియదు.

'త్రిపుర' 'గీతాంజలి' అయ్యింది..

ఆ మధ్య కోన వెంకట్‌ సమర్పణలో అంజలి ప్రధాన పాత్రలో 'గీతాంజలి' అనే సినిమా ఒకటి వచ్చింది. ముందుగా అది వేరే బ్యానర్‌పై రూపొందాల్సిన సినిమా. పీవీపీ వాళ్లు ఆ సినిమాను రూపొందించాల్సింది. ఆసమయంలో దానికి త్రిపుర అనే టైటిల్‌ను అనుకున్నారు.

చాలా వరకూ వర్క్‌ జరిగింది. అయితే ఎందుకో పీవీపీ ఆ సినిమాను నిర్మించలేదు. అది కోన వెంకట్‌ వద్దకు చేరింది అక్కడ కోన దానికి 'త్రిపుర' అనే టైటిల్‌ను మార్చి 'గీతాంజలి' అనే టైటిల్‌ను కన్ఫర్మ్‌ చేశారు. ఆ సినిమా హిట్టైంది. ఆ తర్వాత 'త్రిపుర' పేరుతో థ్రిల్లర్‌ జోనర్‌లోనే ఇంకో సినిమా వెను వెంటనే వచ్చింది.

పవన్‌కు టైటిల్‌ అరువిచ్చిన సప్తగిరి..

'కాటమరాయుడు' ఈ టైటిల్‌ను ముందుగా రిజిస్టర్‌ చేయించుకుంది కమెడియన్‌ సప్తగిరి అండ్‌ బ్యాచ్‌. కమెడియన్‌గా సక్సెస్‌ ఫుల్‌గా ఉన్న దశలో హీరో అవతారం ఎత్తుతూ కాటమరాయుడు అనే టైటిల్‌ను రిజస్టర్‌ చేయించుకున్నాడతను. అది పేరడీ టైటిలే. అత్తారింటికి దారేదీ సినిమాలో కాటమరాయుడా పాట బాగా పాపులర్‌ కావడంతో దాన్ని టైటిల్‌గా మార్చుకున్నాడు.

అయితే.. అద టైటిల్‌తో పవన్‌ కల్యాణ్‌కే పని పడింది, వీరమ్‌ రీమేక్‌కు మరో టైటిల్‌ లేకపోవడంతో సప్తగిరి సినిమా వాళ్లను సంప్రదించి ఆ టైటిల్‌ తీసుకున్నారు. పవన్‌ కల్యాణే అడిగేసరికి వారు కాదనలేకపోయారు. తమ సినిమాకు సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌ అనే టైటిల్‌ను పెట్టుకుని.. కాటమరాయుడుని పవన్‌కల్యాణ్‌కు అరువిచ్చారు.

ఇలాంటి సర్దుబాట్లకు కొదవలేదు..

ఒక ప్రొడక్షన్‌ హౌస్‌ వాళ్లు రిజిస్టర్‌ చేయించిన టైటిళ్లను మరో నిర్మాణ సంస్థ అరువు తీసుకోవడం. అడిగి తీసుకోవడం కొత్తేమీ కాదు, ఈ విషయాల్లో సర్దుబాట్టు జరుగుతూనే ఉన్నాయి. అలాంటి ఉదాహరణలు బోలెడన్ని ఉంటాయి.

ఇబ్బందులూ తప్పడం లేదు..

టైటిళ్ల రిజిస్ట్రేషన్‌ విషయంలో ఇబ్బందులు తప్పడం లేదు. కొంతమంది ఏవో టైటిళ్లను రిజిస్టర్‌ చేయింది సగం వరకూ సినిమాలు తీసి వదిలేస్తూ ఉంటారు. దీంతో వివిధ సందర్భాల్లో టాలీవుడ్‌లో పెద్ద హీరోలు ఇబ్బందులను ఎదుర్కొన్నారు.

రవితేజ హీరో మలయాళీ 'ఆటోగ్రాఫ్‌'ను రీమేక్‌ చేసిన సమయంలో తెలుగు వెర్షన్‌కు అదే టైటిల్‌ను అనుకున్నారు. అయితే అప్పటికే తమ సినిమాకు ఆ టైటిల్‌ను రిజిస్టర్‌ చేయించామని ఒక చోటా సినిమా వాళ్లు గొడవ పెట్టారు. ఆ సినిమా కూడా దాదాపు అదే సమయంలో వచ్చింది. అయితే ఎవరికీ పట్టని చిన్న సినిమా.

అందుకే రవితేజ సినిమాకు ఆటోగ్రాఫ్‌ అనే టైటిల్‌ను అలాగే ఉంచి.. మై స్వీట్‌ మెమొరీస్‌ అనే ట్యాగ్‌లైన్‌ యాడ్‌ చేసి దాన్నంతా సినిమా టైటిల్‌గానే పేర్కొన్నారు. ఇక కల్యాణ్‌రామ్‌- కత్తి, మహేశ్‌ -ఖలేజా కూడా ఆ బాపతే, ఈ టైటిల్స్‌ను ఆ సమయంలోనే మరెవరో రిజిస్టర్‌ చేయించుకోవడంతో.. ఆయా సినిమాల హీరోల పేర్లను టైటిల్‌కు యాడ్‌ చేసి ఇబ్బందులను తొలగించుకున్నారు.