భారతదేశానికి ఎనలేని గుర్తింపు తెచ్చిన వాటిలో యోగా కూడా ఒకటి. ఉఛ్వాస – నిశ్వాసలపై ఇది ఆధారపడి ఉంటుంది. ఏదో తింటూనో, మరేదో తాగుతూ యోగా చేయరు. కానీ పాశ్చాత్య దేశాలకు వెళ్లిన తర్వాత యోగా రకరకాలుగా మారిపోయింది. పవర్ యోగా, వన్-మినిట్ యోగా, హైపర్ యోగా పేరుతో యోగాను ఖూనీ చేస్తున్నారు. ఇప్పుడీ విచ్చలవిడితనం “బీర్ యోగా”తో పీక్స్ కు చేరింది. అవును.. మందు కొడుతూ యోగా చేయడం ఒక కళ అంటున్నారు కొందరు ప్రబుద్ధులు.
చేతులు ఇటు నుంచి అటు తిప్పండి, ఒక సిప్ లాగించేయండి. కాళ్లు పైనుంచి కిందకు మెల్లగా దించండి మరో సిప్ లాగించేయండి. ఇలా సాగుతుంది బీర్ యోగా. ఇలా గంటలో కొన్ని యోగాసనాలు వేయించి మనతో బీర్ తాగించి, బిల్లు వాయించి పంపుతారు. మొన్నటివరకు విదేశాల్లోనే ఉన్న ఈ పాడు యోగా ఇప్పుడు ఇండియాకు కూడా వచ్చేసింది.
ముంబయిలో మిట్ట మధ్యాహ్నం యోగా క్లాసులు పెడుతున్నారు. ఎండలు మండిపోతున్నా జనాలు ఎగబడుతున్నారు. కారణం అక్కడ యోగాతో పాటు బీర్ ఫ్రీ.. లేదంటే బీర్ తో పాటు యోగా ఫ్రీ. ఇలా ఉన్నాయి అక్కడి యోగా సెంటర్ లో ఆఫర్లు. అమ్మాయిలు, అబ్బాయిలు తేడా లేకుండా చల్లగా బీర్ కొడుతూ యోగాసనాలు వేస్తున్నారు.
2014లో అమెరికాలోని నెవెడా రాష్ట్రంలో జరిగిన మ్యూజిక్ ఫెస్డివల్ లో ఈ బీర్ యోగాను కనిబెట్టారని అంటారు. తర్వాత ఇది మెల్లమెల్లగా బీర్ కు ప్రసిద్ధికెక్కిన జర్మనీ, స్కాట్లాండ్ లాంటి దేశాలతో పాటు ఆస్ట్రేలియాకు కూడా వ్యాపించింది. ఇప్పుడు ఇండియాలోకి కూడా వచ్చేసింది. ఇప్పటికే యోగాకు చెదలు పట్టించారు చాలామంది. రకరకాల పేర్లతో సెంటర్లు తెరిచి, ఆరోగ్యం పేరుతో పిచ్చిపిచ్చి వేషాలు వేయిస్తున్నారు. ఈ “బీర్ యోగా” మత్తు తలకెక్కితే ఇంకెన్ని వేషాలు చూడాల్సి వస్తుందో.