మొదట్లో దానిపేరు సోషల్ మీడియా. తరువాత కొద్ది రోజులు అది సెక్స్ మీడియాగా మారింది. బూతు మాటలు వీడియోలతో ఒక ఆట ఆడుకున్నారందరూ.
దాంతో ఫేస్బుక్ వాళ్లు పెద్ద ఎత్తున ఆశ్చర్యం నటించారు. వాట్? లోక కల్యాణం కోసం మేము ఇంత గొప్ప మీడియాని కనిపెడితే దుర్వినియోగం చేస్తున్నారా? అంటూ ఆ న్యూసెన్స్‌ని కొంతవరకూ కంట్రోల్ చేసారు.
ఆ తరువాత ఆ మీడియాని వాడుకోడానికి బిజినెస్ వాళ్లందరూ రంగంలోకి దిగారు.
బిజినెస్ వాళ్లు వాడుకోగా లేంది మేమెందుకు వాడుకో కూడదు అంటూ మోడీ దాని సెంటర్లో గురిచూసి కొట్టాడు.
మోడీ సక్సెస్ అయేసరికి ఇక చిల్లర్ పార్టీలన్నీ కూడా రాత్రిబగళ్లు అందులోనే స్విమ్మింగ్ మొదలు పెట్టాయ్. దాంతో వాళ్ల చిల్లర్ ఫైటింగ్స్‌తో ఇప్పుడది చిల్లర్ మీడియాగా మారింది.
మాపార్టీ లీడర్ సత్య హరిశ్చంద్రుడు.. మా వ్యతిరేక పార్టీ లీడర్ లాంటి చిల్లర్గాడు కాదు.. అవినీతికి ఆమడ దూరంలో ఉంటాడు.. అని ఒక పార్టీ వాళ్లు పోస్ట్ చేయగానే ఆపార్టీకి వ్యతిరేక పార్టీ వాళ్లు పగలబడి నవ్వి వాళ్లకి వ్యతిరేకంగా ఇంకో పోస్ట్ పెడతారు.
ఆ నాకొడుకా సత్య హరిశ్చంద్రుడు? తెల్లారిలేస్తే ఆడు మాట్లాడేవన్నీపచ్చి అబద్ధాలే.. దూ.. నీ యవ్వ.. ఫలానా ప్రాజెక్ట్‌లో కోట్లు తినేసాడు..
అక్కడినుంచీ రెండు పార్టీల వాళ్లూ బూతులు తిట్టుకోవటం మొదలు పెడతారు.
రియల్ సోషల్ మీడియా లవర్స్ ఆ బూతులు చూసి షాక్ అయిపోతారు. ఈలోగా మూడో పార్టీ వాడు ఆ రెండు పార్టీలను తిడుతూ తమ పార్టీకి పబ్లిసిటీ మొదలు పెడతారు.
హలో.. ఫ్రెండ్స్.. చూసారుకదా.. ఆ రెండు పార్టీలూ ఎంత అవినీతి పరులో.. ఇద్దరికిద్దరే పరమ లుచ్చా గాళ్లు.. మా పార్టీ ఒక్కటే నీతీ నిజాయితీ గల పార్టీ..
ఇప్పుడు మూడు పార్టీల వాళ్లూ వీధి కుక్కల్లాగా బూతులు తిట్టుకుంటంటే సోషల్ మీడియా లవర్స్ భరించలేక ఎకౌంట్ క్లోజ్ చేసుకుని పారిపోతారు.
ఆ పార్టీల వాళ్లు ఇలా సోషల్ మీడియాని రొచ్చు గుంటగా మార్చేస్తూంటే చివరకు మామూలు ప్రజలు కొంతమందే మిగులుతారు. వాళ్లు ఫేస్బుక్ అంటేనే బెదిరిపోయి వారానికో నెలకో ఒకసారి ఓపెన్ చేసి భయం భయంగా చూస్తూంటారు.
ఇది గమనించి కొట్టుకునే చిల్లర్ పార్టీ గాళ్లు కులం గాలం వేస్తారు. ఇండియా అంతా కులాల రొచ్చులో ఎక్స్పర్ట్స్ గనుక మొత్తం మూడు పార్టీలూ కుల పోరాటాలు మొదలు పెడతారు.
అంటే ఇండియాని ఈ సోషల్ మీడియా మళ్లీ వందేళ్లు వెనక్కి లాక్కెళ్లి పోతుంది.
ఈ లోగా యూపీలో కొంతమంది గౌ రాక్షసులు హత్యలు చేస్తారు. అది సోషల్ మీడియాలో నాలుగు చక్కర్లు కొట్టేసరికి దేశమంతా అరాచకం మొదలవుతుంది.
మరోపక్క మానసిక రుగ్మత ఉన్న మెంటల్ గాల్లందరూ ఈ మీడియాలోకి వచ్చేస్తారు.
ఈ సోషల్ మీడియా అసలు మనకోసం వచ్చింది. అందుకని మనం దీన్ని సద్వినియోగం చేసుకోవాలి అని డిసైడ్ చేసుకుని మెంటల్ పోస్టింగ్స్ పోస్ట్ చేయటం మొదలు పెడతారు.
ఇవాళ రాత్రికి భూకంపం వస్తుంది.. అందుకని అందరూ రోడ్లమీద పడుకోండి అని ఒకడూ,
ఎల్లుండి పండగ రోజున జరగ బోయేవూరేగిన్పులో మత కల్లోలాలు జరుగబోతున్నాయ్.. అని ఇంకోడూ..
అల్లకల్లోలం సృష్టించడానికి ప్రయత్నిస్తారు.
ఇంకో మెంటల్‌గాడు మరో అడుగు ముందుకేసి ఒక మతం వాళ్లను టార్గెట్ చేస్తూ, వాళ్ల మత విశ్వాసాలను కించ పరుస్తూ పోస్టింగ్ పెడతాడు. ఆ విషయం పోలీసులకు తప్ప మిగతా జనాభా అందరకూ తెలుస్తుంది.
వెంటనే ఆ ప్రాంతంలో మతకలహాలు మొదలవుతాయ్.. పోలీసులు వచ్చేలోగానే జరగాల్సింది జరిగి పోతుంది. ఆ పోస్టింగ్ పెట్టిన వాడిని పట్టుకోడానికి పోలీసులు వెళ్తే అసలు అలాంటి వాడెవడూ లేడని తెలుస్తుంది. అంతే కాదు.. ఆ మీడియాలో సగం మంది బోగస్ ఫోటోలూ, బోగస్ పేర్లూ, బోగస్ అడ్రెస్ గాళ్లని తెలుస్తుంది.
ఇలాంటి వాటిని సోషల్ మీడియా పెంచి పోషించగలదే గాని కంట్రోల్ చేయలేదు.
ఈ న్యూసెన్స్ ఇలా ఉంటే వ్యాపారం న్యూసెన్స్ ఇంకోరకంగా చీల్చి చెండాడటం మొదలు పెడుతుంది.
ఫలానా సినిమా ఇంతవరకూ భూమ్యాకాశాలలో ఎవ్వరూ తీయలేదు.. తీయలేరు.. అంటూ ఆ సినిమా ప్రొడ్యూసర్స్ దగ్గర జీతాలు తీసుకునే బాచ్ ఒకటి టాగ్ చేయటం మొదలు పెడుతుంది.
మళ్లీ అందులో కూడా కులాల యుద్ధం మొదలు పెడతారు. వీళ్లకు తోడు బోగస్ ఫోటోలూ, మార్ఫింగ్ చేసిన ఫోటోలూ, బోగస్ న్యూస్ ఐటమ్స్ పోస్ట్ చేసే గాంగ్ ఇంకోటి..
ఈ న్యూసెన్స్ భరించలేక చాలామంది ఒక గ్రూప్ తయారు చేసుకుని ఈ చిల్లర్ బాచ్ అందులో జొరబడకుండా తంటాలు పడుతూంటారు.
ఏదొక రోజు ఈ సోషల్ మీడియా వల్ల మనదేశం చావుదెబ్బ తినే అవకాశం ఉంది.
-యర్రంశెట్టి సాయి