ఫిబ్రవరి 13న ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ సవతి సోదరుడు 45 ఏళ్ల కిమ్ జోంగ్ నామ్ మలేసియా రాజధాని కౌలాలంపూర్ ఎయిర్‌పోర్టులో మకావూకి వెళ్లే ఎయిర్ ఏసియా విమానం ఎక్కబోతూ వుండగా యిద్దరు మహిళలు అతని మొహానికి అతి భయంకరమైన విఎక్స్ విషం పూసి చంపివేశారని అందరికీ తెలుసు. చంపిన మహిళలలో ఒకరిది వియత్నాం కాగా, మరొకరిది ఇండోనేసియా. చంపించినది ఎవరు, హత్యాకారణమేమిటి అనేది యింకా స్పష్టంగా తెలియదు. ఉత్తర కొరియా పాలకుడు ఉన్ పరమ కిరాతకుడు కాబట్టి, అధికారంలోకి వచ్చిన ఐదేళ్లలో 140 మంది అత్యున్నత స్థాయి అధికారులతో 340 మందిని ఉరి తీయించాడు కాబట్టి, సమీప బంధువులను విదేశాల్లో కూడా వెంటాడి చంపించాడు కాబట్టి, హత్య వెనక అతనే వున్నాడని అనుకోవడం సులభం. అయితే ఇప్పటిదాకా అతను హత్యలు చేయించిన సందర్భాల్లో తన దేశస్తులనే వాడాడు తప్ప యిలా పరదేశపు మహిళలను వాడలేదు. 2010లో ఒక ఉత్తర కొరియా పౌరుణ్ని చైనా పంపి అక్కడ హిట్ అండ్ రన్ యాక్సిడెంట్లో నామ్‌ను చంపేయడానికి ఉన్ ప్రయత్నించాడని దక్షిణ కొరియా పోలీసులు 2012లో వెల్లడించారు.
ఇప్పుడీ మహిళలు హత్యల్లో ఆరితేరినవారు కారు. ఇదేదో 'జస్ట్ ఫర్ లాఫ్స్'లో వేసే ప్రాక్టికల్ జోక్ అని చెప్పి ఇండోనేసియాకు చెందిన పాతికేళ్ల సీతి ఐషా చేతిలో కొన్ని డాలర్లు పెట్టి విషం చల్లించారని ఇండోనేసియా పోలీసు చీఫ్ చెప్తున్నారు. ముందు ముగ్గురికి కళ్లు మూసి నీళ్లు చల్లించి తర్వాత నామ్‌పై విషం చల్లించారట. విషం చల్లాక ఆమె ఎయిర్‌పోర్టుకి దగ్గర్లోనే వున్న ఓ హోటల్ గదిలోనే బస చేసింది. పోలీసులకు సులభంగా దొరికిపోయింది. ఇంకో ఆమె విషం చల్లిన చోటికి మర్నాడు అదే డ్రెస్సుతో మళ్లీ వెళ్లి అరెస్టయింది. ఇంత ముఖ్యుడైన రాజబంధువు హత్యను ఉన్ యిలాటి ఎమెచ్యూర్స్ చేత ఎందుకు చేయిస్తాడు అన్నది సమాధానం దొరకని ప్రశ్న. మలేసియా ప్రభుత్వం మాత్రం హత్యను చాలా సీరియస్‌గా తీసుకుని శవాన్ని తనే పోస్టుమార్టమ్ చేయించి ఫలానా విషంతో మరణించాడని తేల్చింది. శవాన్ని అప్పగించమని ఉ.కొరియా ప్రభుత్వం కోరినా అప్పగించలేదు. మలేసియా తమ శత్రువులతో చేతులు కలిపి, అనేక విషయాలు దాస్తోంది కాబట్టి అది యిస్తన్న ఆటోప్సీ సమాచారాన్ని తాము నిరాకరిస్తున్నామని ఉత్తర కొరియా అంటోంది. మలేసియా ప్రస్తుతానికి సీతి ఐషా, డోవన్ థీ హువాంగ్ అనే ఆ యిద్దరు మహిళలపైన మాత్రమే కేసు పెట్టింది. వాళ్లు టీవీ షో కోసం అనుకున్నారన్న మాట మలేసియా పోలీసులు కొట్టి పారేశారు. గుడ్డపై విషం చల్లి ఎదుటివాడి మొహానికి పూయడంలో వాళ్లకు తర్ఫీదు యిచ్చి వున్నారని నామ్ మొహంపై పూసిన అమ్మాయి చేతులు కడుక్కోవడానికి బాత్ రూమ్‌వైపు వెళ్లడం సిసిటివిలో కనబడిందని, అంటే దాని అర్థం అది విషమని ఆమెకు తెలుసని వాళ్లు అంటున్నారు. హత్య జరిగిన రోజే దేశం విడిచి వెళ్లిపోయిన నలుగురు ఉత్తర కొరియన్లను కూడా వారు అనుమానిస్తున్నారు. ఒకతన్ని కస్టడీలో తీసుకున్నారు.
హత్య జరిగిన తీరు వింతగా వుంది. విషం చల్లిన అమ్మాయిలిద్దరూ టాక్సీ ఎక్కి తుర్రు మంటే నామ్ బాడీగార్డులు ఏం చేస్తున్నారన్న ప్రశ్న వస్తుంది. వాళ్లు నామ్‌ను ఆసుపత్రికి తరలించే హడావుడిలో వున్నారనుకున్నా, ఎయిర్‌పోర్టులో మలేసియా పోలీసులైనా పరుగులు పెట్టి వుండాలి కదా! హత్య చేయించిన వారెవరై వుంటారు అనే ప్రశ్నకు సమాధానంగా నామ్ జూదరి కాబట్టి అతనితో డబ్బు విషయంలో పేచీ వచ్చిన కొన్ని క్రిమినల్ సంస్థలై వుంటాయని కొందరంటున్నారు. ఆడవాళ్లతో వ్యవహారాలు ఎక్కువ కాబట్టి ఎవరో అసూయతోనో, కక్ష తోనో చేయించి వుంటారంటున్నారు. దక్షిణ కొరియాలో అభిశంసన ఎదుర్కోబోతున్న పార్క్ తనపై నుంచి దృష్టి మరల్చడానికి నామ్‌ను హత్య చేయించిందని అనేవాళ్లూ వున్నారు. ఇవేమీ కావు, ఉన్ చేయించి వుంటాడు అని గట్టిగా నమ్ముదామంటే ఎందుకు అనే ప్రశ్నకు సమాధానం చెప్పాలి. ఇన్నాళ్లూ నామ్ ఒక జులాయి బతుకు బతుకుతూ వున్నాడు తప్ప రాజకీయంగా ఉన్కి ఏ ప్రమాదమూ తెచ్చి పెట్టలేదు. ఉన్ పాలనకు వ్యతిరేకంగా ఉత్తర కొరియాలో విప్లవం లేవదీస్తున్నాడనుకున్నా, లేక దక్షిణ కొరియాతో చేతులు కలిపి అంతర్జాతీయంగా అల్లరి పెడుతున్నాడనుకున్నా అదీ లేదు. అప్పుడప్పుడు మీడియాను పిలిచి ఉన్ పాలనపై వ్యాఖ్యానాలు చేస్తూ వుంటాడంతే. కొరియాలో సంస్కరణలు రావాలని అంటూంటాడు. వాటికి ఉత్తర కొరియా ప్రజలు పెద్దగా స్పందించారనుకోవడానికి ఏమీ లేదు.
మరి ఎందుకు చంపించినట్లు అంటే చైనా కోణం ఒకటి చెప్తున్నారు. ఇన్నాళ్లూ ప్రపంచమంతా ఉన్ను తిడుతున్నా చైనా మాత్రం వెనకేసుకుని వస్తోంది. అతని ఆగడాలు పెచ్చుమీరడంతో యికపై అతన్ని సమర్థించలేమని అర్థం చేసుకుని, అతని స్థానంలో సౌమ్యుడైన నామ్‌ను కూర్చోబెడదామని అనుకుంటోంది. అది పసిగట్టిన ఉన్ చైనాకు ఆ మార్గం లేకుండా మూసేయడానికి నామ్‌ను పైకి పంపించేశాడు – ఇదీ ఆ వాదన. నిజంగా నామ్ చైనా దృష్టిని ఆకర్షించేటంత, చైనా ఎంపిక చేసేటంత ఘనుడా? లేక క్రిమినల్ సంస్థలకు కక్ష పెంచుకోదగినంత నీచుడా? వివరాలు తెలుసుకోవాలంటే అతని జీవితం గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలి. అప్పుడు కొంత వూహించుకోవడానికి అవకాశం వుంటుంది. ఎంతైనా అది వూహే, నిజానిజాలు ఎప్పటికి బయటకు వస్తాయో ఎవరికీ తెలియదు.
సోవియత్ రష్యా రెండవ ప్రపంచ యుద్ధంలో జపాన్ను ఓడించి వారి అధీనంలో వున్న కొరియా ఉత్తరభాగానికి నామ్ తాత కిమ్ ఇల్ సుంగ్‌ను 1948లో అధినేతగా కూర్చోబెట్టింది. అతనికి యిద్దరు భార్యలు. చెరో భార్య ద్వారా ముగ్గురేసి పిల్లలు. అతని మొదటి భార్య పెద్ద కొడుకు – అతని తర్వాత 1994లో అధికారంలోకి వచ్చిన కిమ్ జోంగ్ ఇల్. అతను భార్య వుండగానే తన తండ్రికి తెలియకుండా వివాహితురాలు, ఒక బిడ్డకు తల్లి ఐన కొరియన్ సినిమా స్టార్ సుంగ్ హే రిమ్‌తో 1970 నుంచి సంబంధం పెట్టుకున్నాడు. వాళ్లిద్దరికీ 1971లో పుట్టినవాడు నామ్. అతన్ని రహస్యంగా పెంచాడు. జోంగ్ ఇల్కు అధికారికంగా రెండు పెళ్లిళ్లు అయ్యాయి. ముగ్గురు ఉంపుడుకత్తెలున్నారు. మొత్తం మీద ముగ్గురు కొడుకులు, యిద్దరు కూతుళ్లు. రెండవ ఉంపుడుకత్తె జపాన్‌లో పుట్టిన కొరియన్ యువతి, డాన్సర్. కాన్సర్‌తో బాధపడి 2004లో చనిపోయింది. ఆమెకు పుట్టినవాడు ఉన్. తండ్రి చనిపోయిన తర్వాత 1994లో అధికారంలోకి వచ్చిన కిమ్ జోంగ్ ఇల్ 2011 వరకు పాలించి మరణించాడు. వయసు రీత్యా నామ్ పెద్దవాడైనా ఉన్నే తన వారసుడిగా 2003లోనే ఎంపిక చేశాడు. ఉన్ 2011లో అధికారంలోకి వచ్చి పాలిస్తున్నాడు. నామ్ ఎందుకు రాలేకపోయాడంటే అతని చరిత్ర అలాటిది.
చిన్నప్పటినుంచి ఎవరి కంటా పడకుండా వుండడానికి అతన్ని రాజధాని ప్యాన్గ్యాంగ్లో 100 మంది పనివాళ్లు, 500 మంది బాడీగార్డులు, 8 మంది వంటవాళ్లు వున్న పెద్ద భవంతిలో యిద్దరు కజిన్స్‌తో బాటు పెంచారు. వీళ్లు భవంతి ప్రహారీ గోడ దాటి వెళ్లడానికి వీల్లేదు. బయట తిరిగే స్వేచ్ఛ యివ్వలేకపోయిన తండ్రి అతన్ని బహుమతులతో ముంచెత్తాడు. వజ్రాలు పొదిగిన వాచీలు, బొమ్మ తుపాకీలు ఏవి కావాలంటే వాటితో 10 వేల చ.అ.ల ఆటగదిలో ఆడుకోవచ్చు. అతన్ని ఓ సారి డెంటిస్టు వద్దకు తీసుకెళ్లాల్సి వచ్చింది. క్యాడిలాక్ కొనిస్తే దాన్లో వెళతాను, లేకపోతే వెళ్లనని మొండికేస్తే అలాగే అని తండ్రి కొనిచ్చాడు. విదేశాలలో చదివిస్తే అతనిపై ప్రజల దృష్టి పడదని లెక్కవేసి విదేశాలకు పంపాడు. మాస్కోలో స్కూలుకి పంపితే అక్కడ టాయిలెట్స్ బాగా లేవంటూ తిరిగి వచ్చేశాడు. చివరకు స్విజర్లండ్‌లో చదివాడు. అక్కడి వాతావరణం చూసి ముగ్ధుడయ్యాడు. తన 19 వ ఏట తండ్రితో సహా ఉత్తర కొరియాకు వచ్చి అక్కడి గ్రామీణ ప్రాంతాలు చూసి యూరోపియన్ గ్రామాలతో పోల్చి చూసి యివి యింత ఘోరంగా వున్నాయేమిటి అని నిర్ఘాంతపోయాడు. యూరోప్‌లో స్వేచ్ఛగా బతకడానికి అలవాటు పడిన అతను స్వదేశానికి వచ్చాక తండ్రి ఆంక్షల మధ్య బతకలేక తిరగబడసాగాడు. మద్యానికి, మదవతులకు అలవాటు పడ్డాడు. తన చిత్తం వచ్చినట్లు తిరగసాగాడు. ఓ సారి నాలుగు స్టార్ల మిలటరీ డ్రస్ వేసుకుని వూరంతా మార్చ్ చేశాడు, మరో సారి తప్పతాగి, తన కాంపౌండులో టాక్సీ కనబడితే అది నడుపుకుంటూ ఓ పెద్ద హోటల్లో లాబీలోకి దూసుకుపోయాడు. ఇంకోసారి ఓ నైట్ క్లబ్బులో తుపాకీతో కాల్పులు కాల్చాడు. ఇవన్నీ చూసి 1995లో తండ్రి అతన్ని చైనాకు పంపేశాడు. బీజింగ్ శివార్లలో ఓ బంగళాలో నివాసముండేవాడు.
అతను తన తండ్రి అక్రమ సంపాదనకు ఏజంటుగా పనిచేసేవాడు. జపాన్, జర్మనీ వంటి యితర దేశ వ్యాపారులు అతని తండ్రికి లంచాలు యివ్వాలంటే యితని ద్వారా యిచ్చేవారు. ప్రపంచమంతా తిరుగుతూ ఆ యా దేశాలకు వెళ్లి తండ్రి తరఫున వాళ్లతో బేరసారాలు ఆడేవాడు. మధ్యమధ్యలో రష్యా వెళ్లి అక్కడ మానసిక చికిత్స పొందుతున్న తల్లిని చూసేవాడు. ఓ సారి 2001లో జపాన్ దేశపు వ్యాపారస్తులతో మంతనాలు ఆడడానికి జపాన్ వెళితే అక్కడ కస్టమ్ అధికారులు అతన్ని పట్టుకున్నారు. అతని వద్ద డొమినికా దేశపు దొంగ పాస్‌పోర్టు వుంది. తోడుగా యిద్దరు ఆడవాళ్లు, ఓ నాలుగేళ్ల కుర్రవాడు వున్నారు. ఎందుకిలా వచ్చావు అంటే 'డిస్నీలాండ్ చూడడానికి' అన్నాడు. వాళ్లు అరెస్టు చేయడంతో, ఇతను ఫలానా అని తెలియడంతో అది పెద్ద అంతర్జాతీయ వార్త అయింది. అతని తండ్రికి తల కొట్టేసినట్లయింది. వాళ్లిద్దరి మధ్య దూరం మరింత పెరిగింది. మాతృదేశానికి వెళ్లే బదులు చైనాకు దక్షిణాన వున్న స్వయంపాలిత మకావూలో కాపురం పెట్టాడు. అది లాస్ వేగస్ కంటె పెద్ద గాంబ్లింగు సెంటర్. దాని రాజైన స్టేన్లీ హో తొలి దశలో చైనాకు సరుకులు స్మగుల్ చేసేవాడు. ఆ తర్వాత ఉత్తర కొరియా పాలకులతో కూడా సంబంధాలు పెంచుకున్నాడు. వారి రాజధానిలో ఓ కాసినో తెరిచాడు. అందువలన ఉత్తర కొరియా వాసులు తమ అక్రమార్జనను మకావూ బ్యాంకుల్లో దాచుకుంటూ వుంటారు. నామ్ అక్కడే మకాం వేసి వాళ్లకు సాయపడుతూ వుండేవాడు. అతనితో స్నేహం హోకు లాభదాయకంగా తోచింది. అందుకే తన గ్రాండ్ లాపా హోటల్లో ఏళ్ల తరబడి ఉచితంగా ఉండనిచ్చాడు.
మకావూ విలాసాల నగరం కాబట్టి నామ్‌కి అనువుగా వుంది. పైగా చైనా పరిరక్షణలో వుంది కాబట్టి ఉత్తర కొరియా పాలకుడైన ఉన్ అతని జోలికి రాలేడు. బీజింగులో అయితే అందరి దృష్టీ అతనిపై వుండేది. మకావూ ఒకప్పుడు పోర్చుగీసు వారి వలస ప్రదేశం కాబట్టి అక్కడ యూరోపియన్ సంస్కృతి కూడా వుంది. అందువలన కూడా నామ్‌కు నచ్చింది. తన పిల్లల్ని అక్కడ స్కూళ్లల్లో, కాలేజీల్లో చేర్పించాడు. మకావూ అనేక రకాల క్రైమ్ ముఠాలు ఆపరేట్ చేసే స్థలం కాబట్టి నామ్‌కు వారితో స్నేహాలు, తగవులు కూడా ఏర్పడి వుండాలి. అందుకే అతని హత్యలో క్రిమినల్ ముఠాల హస్తం వుందాన్న సందేహం కలుగుతోంది. మకావూ నుంచి అతను మలేసియా వచ్చి వెళుతూండేవాడు. వచ్చినపుడు అతనితో పాటు అమ్మాయిలు వుండేవారు. అప్పుడప్పుడు విదేశీ మీడియాతో మాట్లాడుతూ చైనాలో వచ్చిన మార్పు ఉత్తర కొరియాలో కూడా రావాలని, లేకపోతే వైఫల్యం తప్పదని అనేవాడు. కుటుంబపాలనను నిరసించేవాడు. అందుచేత తన సవతి తమ్ముడి స్థానంలో అతను రావాలనుకోవడం సరి కాదు. కానీ ఉన్ భయాలు ఉన్‌కు వుండవచ్చని నామ్ అనుకున్నాడు. తనపై హత్యాప్రయత్నం జరిగిందన్న అనుమానం వచ్చినపుడు ప్రాణభిక్ష కోరుతూ ఉన్‌కు ఉత్తరం రాశాడు. మలేసియాకు, ఉత్తర కొరియాకు మధ్య సరిహద్దు ఆంక్షలు పెద్దగా లేవు. వీసా లేకుండా 30 రోజుల పాటు వుండవచ్చు. అందువలన ఎంతోమంది ఉత్తర కొరియావాసులు వచ్చిపోతూ వుంటారు.
ఇప్పుడు నామ్‌ను హత్య చేసినవారు కూడా ఉత్తర కొరియా వాళ్లే అని దక్షిణ కొరియా పోలీసులు అంటున్నారు. ఎనిమిది మంది ఉత్తర కొరియావారు రెండు ముఠాలుగా ఏర్పడ్డారని, వారిలో ఒకరు ఎయిర్ కోర్యో ఉద్యోగి అని, మరొకరు యునైటెడ్ నేషన్స్ ఆంక్షలు ఎదుర్కుంటున్న సింగ్వాంగ్ ట్రేడింగ్ కార్పోరేషన్ ఉద్యోగి అని అంటున్నారు. ఉత్తర కొరియా ప్రభుత్వ సెక్యూరిటీ అధికారి ఒకడు ఇండోనేసియన్ యువతికి తర్ఫీదు యిచ్చి విషం చల్లించాడని, విదేశాంగ శాఖ ఉద్యోగి మరో అమ్మాయికి తర్ఫీదు యిచ్చాడని అంటున్నారు. ఈ ఎనిమిది మంది ఆ రోజు ఎయిర్‌పోర్టులో వున్నారని అంటున్నారు. విఎక్స్ వంటి భయంకరమైన రసాయనిక ఆయుధాన్ని మలేసియా అధికారులు ఎయిర్‌పోర్టులోకి ఎలా అనుమతించారో యింకా తేలలేదు. –
ఎమ్బీయస్ ప్రసాద్
[email protected]