ఓ మహిళ ఆవేదన ఇది. ఓరోజు సాయంత్రం తన జీవితాన్ని మార్చేసిందనీ, కలలో కూడా ఊహించని విధంగా ఆ రాత్రి తనను భార్య హోదా నుంచి విధవరాలిగా మార్చేసిందనీ ఆవేదన వ్యక్తం చేస్తోంటే.. కళ్ళు చెమర్చకుండా వుండవు ఎవరికైనా.!
ఆ మహిళ ఎవరో కాదు, అమెరికాలో ఇటీవల మృతి చెందిన కూచిబొట్ల శ్రీనివాస్ సతీమణి సునయన. భర్త అంటే, ఏ భార్యకైనా సర్వస్వం. ఆ భర్త లేకపోతే, ఇక జీవితమే లేదనే భావన సగటు భారతీయ మహిళలో వుండడం సహజమే. ఆ భర్తే తన జీవితానికి మార్గదర్శి అయినప్పుడు, ఆ భర్తే తనకు మంచి స్నేహితుడు కూడా అయినప్పుడు, ఆ భర్తే తనలో ధైర్యం నూరిపోసిన వ్యక్తి అయినప్పుడు.. ఆ భర్త దూరమయ్యాక ఆమె పరిస్థితి ఎంత దయనీయంగా తయారైపోతుందో ఊహించుకోవడమే కష్టం.
శ్రీనివాస్ గురించి సునయన ఆవేదన వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో చేసిన పోస్టింగ్, మనసున్న ప్రతి ఒక్కరినీ కదిలించేస్తోంది. ఎన్నో ఆశలతో అమెరికా వెళ్ళిన ఓ భారతీయుడు, అందునా ఓ తెలుగు వ్యక్తి.. అక్కడి జాత్యహంకారానికి బలైపోవడం అత్యంత దారుణమైన విషయం. 'అమెరికా కేవలం అమెరికన్లది మాత్రమే..' అంటూ ఎన్నికల్లో గెలుపు కోసం డోనాల్డ్ ట్రంప్ చేసిన నినాదం కూచిబొట్ల ఆనంద్‌ని బలి తీసుకుంది.
'నువ్వెవడివి అమెరికాలో వుండడానికి.. మీ దేశానికి పోతావా.? చంపెయ్యాలా.?' అంటూ జాత్యహంకారి ఒకడు శ్రీనివాస్ కూచిబొట్ల ప్రాణం తీసేశాడు. ఆ వార్త తొలిసారి విన్నప్పుడు దాన్ని సునయన నమ్మలేదట. 'మీరు మాట్లాడుతున్నది ఎవరి గురించి.?' అంటూ ఆవేదనతోనే ఆ వార్త తీసుకొచ్చిన వారిని ప్రశ్నించిందట. ఇవన్నీ ఆమె సోషల్ మీడియాలో చేసిన పోస్టింగ్‌లో పేర్కొంది. శ్రీనివాస్ ఎలా తనకు పరిచయమయ్యిందీ, తమ మధ్య ప్రేమ చిగురించి అది పెళ్ళిగా ఎలా వికసించిందీ ఆమె ప్రస్తావించారు.
కష్టకాలంలో తనకు అండగా వున్న ప్రతి ఒక్కరికీ ఆమె పేరు పేరునా కృతజ్ఞతలు తెలిపారు. శ్రీనివాస్ నింపిన స్ఫూర్తితో తాను ముందడుగు వేస్తానన్నారు. అయినాసరే, జీవితంలో శ్రీనివాస్ లేని లోటు మాత్రం ఎప్పటికీ అలాగే వుంటుందన్నారు సునయన. మృత్యువు.. జాత్యహంకారం అనే రాక్షసత్వం రూపంలో శ్రీనివాస్‌ని చిదిమేసింది. అమెరికన్ కాంగ్రెస్‌లో శ్రీనివాస్ మృతికి నివాళులర్పించడం కాదు, అమెరికాలో ఇంకోసారి ఇలాంటి దాడి ఇంకెవరిపైనా జరగకుండా చర్యలు తీసుకోవాలి. అదే శ్రీనివాస్‌కి అసలైన నివాళి.
ఒక్కటి మాత్రం చెబుతున్నా.. నిన్ను ఎప్పటికీ ఓడిపోనివ్వను.. అంటూ భర్త శ్రీనివాస్ కూచిబొట్లను ఉద్దేశించి ఆమె పేర్కొన్న తీరు.. ఆయన ఆమెలో నింపిన ధైర్యానికి ప్రతీక. ఆమెలో ఆ ధైర్యం సన్నగిల్లకూడదని కోరుకుందాం.