సినిమా రివ్యూ: రైల్‌

రివ్యూ: రైల్‌ రేటింగ్‌: 1.5/5 బ్యానర్‌: సత్యజ్యోతి ఫిలింస్‌, ఆదిత్య మూవీ కార్పొరేషన్‌ తారాగణం: ధనుష్‌, కీర్తి సురేష్‌, గణేష్‌ వెంకట్రామన్‌, హరీష్‌ ఉత్తమన్‌, రాధా రవి, తంబిరామయ్య, కరుణాకరన్‌ తదితరులు సంగీతం: డి.…

రివ్యూ: రైల్‌
రేటింగ్‌: 1.5/5

బ్యానర్‌: సత్యజ్యోతి ఫిలింస్‌, ఆదిత్య మూవీ కార్పొరేషన్‌
తారాగణం: ధనుష్‌, కీర్తి సురేష్‌, గణేష్‌ వెంకట్రామన్‌, హరీష్‌ ఉత్తమన్‌, రాధా రవి, తంబిరామయ్య, కరుణాకరన్‌ తదితరులు
సంగీతం: డి. ఇమ్మాన్‌
కూర్పు: ఎల్‌.వి.కె. దాస్‌
ఛాయాగ్రహణం: వెట్రివేల్‌ మహేంద్రన్‌
నిర్మాత: టి.జి. త్యాగరాజన్‌
కథ, కథనం, దర్శకత్వం: ప్రభు సాలమన్‌
విడుదల తేదీ: సెప్టెంబరు 22, 2016

ఏడు వందల మందికి పైగా ప్రయాణిస్తోన్న రైలు డ్రైవర్‌ అకస్మాత్తుగా చనిపోయాడు. మితి మీరిన వేగంతో వెళుతోన్న ఆ రైలు బ్రేకులు కూడా ఫెయిలయ్యాయి. దానిని ఆపే మార్గమే కనిపించడం లేదు. ఈ సెటప్‌తో ఒక బిగి సడలని థ్రిల్లర్‌ తీయవచ్చు. హాలీవుడ్‌లో 'అన్‌స్టాపబుల్‌' అని ఓ సూపర్‌ థ్రిల్లర్‌ తీశారు కూడా. దర్శకుడు ప్రభు సాలమన్‌ ఆ చిత్రం ఆధారంగానే ఈ 'రైల్‌' తెరకెక్కించాడు. 'అన్‌స్టాపబుల్‌' ట్రెయిన్‌లో, ప్రయాణంలో పరిచయమై, అప్పటికప్పుడే పీకల్లోతు ప్రేమలో కూరుకుపోయిన 'టైటానిక్‌' మాదిరి ప్రేమజంట కథ ఇది. 

థ్రిల్లర్‌ని థ్రిల్లర్‌లా తీయకుండా దర్శకుడు ఇందులోకి తనకి తోచిన ఎలిమెంట్స్‌ అన్నిటినీ చొప్పించాలని చూసాడు. జరుగుతున్న సంఘటనతో సంబంధం లేకుండా అదే పనిగా కామెడీ సీన్లు ఇరికించాడు. అవి చాలదన్నట్టు పొలిటీషియన్లపై, పబ్లిక్‌, మీడియా, నేటితరం ట్రెండ్‌ల మీద సెటైర్లు వేస్తూ కూర్చున్నాడు. ఆగకుండా పరుగెడుతోన్న రైల్‌కి ఎలాంటి ప్రమాదం సంభవిస్తుందో, అందులోని వాళ్లకి ఏమవుతుందో అనే భావన కనీసం ఓసారి కూడా కలగదంటే అది సాలమన్‌ సామి స్క్రీన్‌ప్లే చలవే. ఆ రైల్‌ని దాని మానాన దానిని వదిలేసి టీవీ స్టూడియోల్లో చర్చా కార్యక్రమాలపై లెంగ్తీ సన్నివేశాలు తీసుకుంటూ పోయాడు. ఆ సీన్స్‌ అనే కాదు, ఏ సీన్‌ మొదలైనా ఒక పట్టాన ఆగదు… ఈ 'రైల్‌' మాదిరిగానే. 

అంత వేగంతో డ్రైవర్‌ లేకుండా పరిగెడుతున్న రైల్లో ఉన్నవాళ్లు కూడా కామెడీ చేసుకుంటూ ఉంటారే తప్ప ఎవరిలోను ఆందోళన కనిపించదు. రైల్‌ ప్రమాదంలో పడింది అనే విషయం తెలియజెప్పే సీన్‌తో ఇంటర్వెల్‌ వస్తుంది. అయితే అంతవరకు కథని ముందుకి నడిపించడానికి దర్శకుడు పెట్టిన తిప్పలు వర్ణనాతీతమంటే నమ్మండి. తంబి రామయ్య కామెడీ తమిళ వాళ్లకి నచ్చుతుందేమో కానీ అతడిని తట్టుకోవడం మన వల్ల కాదు. ఎన్‌ఎస్‌జి కమాండోగా అర్థం పర్ధం లేని సైకో క్యారెక్టర్‌లో హరీష్‌ ఉత్తమన్‌ ఏం చేస్తున్నాడో, ఎందుకు చేస్తున్నాడో కూడా అంతు చిక్కదు. అలా ఒకసారి చూసేసి కీర్తి సురేష్‌ని తన ప్రాణం అంటూ ధనుష్‌ డైలాగులు వల్లిస్తోంటే ఇదేమి ప్రేమకథరా బాబూ అనిపించక మానదు. 

వేగంగా వెళుతోన్న ట్రెయిన్‌ తాలూకు ఎఫెక్ట్‌ తెలిస్తే కానీ ఈ కథ రక్తి కట్టదు. కానీ విజువల్‌ ఎఫెక్ట్స్‌ చాలా నాసిరకంగా ఉండడంతో ట్రెయిన్‌ పైన తీసిన సీన్స్‌ ఏమాత్రం మెప్పించలేదు. గ్రీన్‌ మ్యాట్‌లో ట్రెయిన్‌ సెట్‌ వేసి తీసిన సంగతి స్పష్టంగా తెలిసిపోతూ ఉండడం వల్ల థ్రిల్‌ కలిగించాల్సిన సన్నివేశాలు సైతం తేలిపోయాయి. ఇక అన్నిటికంటే పెద్ద కామెడీ ఏమిటంటే… ఒకవైపు అంతటి ప్రమాదం పొంచి ఉంటే, రైల్‌ ఎక్కి పాట పాడుతూ ధనుష్‌ డాన్స్‌ చేస్తాడు. ఈ అన్‌ఇంటెన్షనల్‌ కామెడీకి థియేటర్లో నవ్వులు పూసాయి. ఆ నెక్స్‌ట్‌ సీన్‌లోనే మనమిప్పుడు ఫైట్‌ చేసుకుంటే ఆడియన్స్‌ నవ్వుతారని విలన్‌తో హీరో అంటాడు. ఫైట్‌ చేస్తే నవ్వుకుంటారని తెలిసిన దర్శకుడికి ఆ సమయంలో డాన్స్‌ చేస్తే నవ్వుకుంటారని అనిపించకపోవడమే విడ్డూరం. ఇద్దరు ప్రేమికులు చనిపోతారేమో అనే క్వశ్చన్‌ మార్క్‌ ఉన్నప్పుడు వారిద్దరూ ఏమైపోతారోననే ఉత్కంఠ అనుక్షణం అనిపించాలి. కానీ ఆ పాత్రలని తీర్చిదిద్దిన తీరు వల్ల అవి ఎలా పోయినా ఫరక్‌ పడదు అన్నట్టుంటుంది. హీరో హీరోయిన్ల పాత్రలనే సరిగా మలచని దర్శకుడు ఇక సైడ్‌ క్యారెక్టర్లకి మాత్రం సవ్యమైన క్యారెక్టరైజేషన్లు ఏం రాస్తాడు? 

ప్రతి ఒక్కరూ ఓవరాక్షన్‌ చేస్తూనే గడిపేసారు. మామూలుగా డీసెంట్‌ యాక్టర్లయిన హరీష్‌ ఉత్తమన్‌, గణేష్‌ వెంకట్రామన్‌ ఇందులో రూపాయికి పది రూపాయల యాక్షన్‌తో నలిపేసారు. కథల ఎంపిక విషయంలో ధనుష్‌కి ఉన్న అభిరుచిని దృష్టిలో ఉంచుకుని బ్లయిండ్‌గా 'రైల్‌' ఎక్కితే యాక్సిడెంట్‌ తథ్యం. సినిమా అంతటా మనల్ని వేధించే ఒకే ఒక్క ప్రశ్న… అసలు ధనుష్‌ ఏముందని ఈ సినిమా ఓకే చేసాడా అని! నేషనల్‌ అవార్డ్‌ గెలుచుకున్న నటుడు కూడా చేష్టలుడిగి చూడడం మినహా ఏమీ చేయలేకపోయాడిందులో. కీర్తి సురేష్‌దీ అదే పరిస్థితి. 

సాధారణంగా తమిళ సినిమాలు సాంకేతికంగా ఉన్నతంగా ఉంటాయి. కానీ ఈ చిత్రానికి సాంకేతిక పరంగా చెప్పుకోతగ్గ పాయింట్‌ ఒక్కటీ లేదు. సినిమాటోగ్రఫీ చాలా సాధారణంగా ఉంది. విజువల్‌ ఎఫెక్ట్స్‌ మరీ చీప్‌గా అనిపిస్తాయి. నేపథ్య సంగీతం కూడా తేలిపోయింది. దాదాపు మూడు గంటల పాటు సుదీర్ఘంగా సాగే రైల్‌ ప్రయాణం అడుగడుగునా అసహనం కలిగిస్తూ ఈ రైలెక్కినందుకు పదే పదే చింతించేట్టు చేస్తుంది. 

బోటమ్‌ లైన్‌: పట్టాలు తప్పింది!

– గణేష్‌ రావూరి

http://twitter.com/ganeshravuri