యుద్ధానికే మొగ్గు చూపుతున్న పాకిస్తాన్‌

'ఏదైతే అది జరుగుతుంది.. యుద్ధమే మాక్కావాలి..' అంటోంది పాకిస్తాన్‌. ఇండియాతో యుద్ధానికి పాకిస్తాన్‌ అత్యుత్సాహం ప్రదర్శించడం ఇదే మొదటిసారి కాదు. పలుమార్లు పాకిస్తాన్‌ కయ్యానికి కాలు దువ్వడం, చేతులు కాల్చుకోవడం తెల్సిన విషయాలే. అయినాసరే,…

'ఏదైతే అది జరుగుతుంది.. యుద్ధమే మాక్కావాలి..' అంటోంది పాకిస్తాన్‌. ఇండియాతో యుద్ధానికి పాకిస్తాన్‌ అత్యుత్సాహం ప్రదర్శించడం ఇదే మొదటిసారి కాదు. పలుమార్లు పాకిస్తాన్‌ కయ్యానికి కాలు దువ్వడం, చేతులు కాల్చుకోవడం తెల్సిన విషయాలే. అయినాసరే, చైనాతో కలిసి భారత్‌పై దండెత్తి మరోసారి 'పిఓకె'ని ఆక్రమించినట్లుగా, కాశ్మీర్‌ని పూర్తిగా సొంతం చేసుకోవాలన్నది పాకిస్తాన్‌ కుయుక్తి. 

యురీ సెక్టార్‌లో తీవ్రవాదుల్ని జొప్పించడం, ఈ క్రమంలో పాకిస్తాన్‌ సైన్యం, భారత్‌పై సరిహద్దుల్లో కాల్పులు జరపడం, సముద్ర మార్గం గుండా తీవ్రవాదల్ని భారత్‌లోకి పంపిస్తుండడం.. ఇదంతా పక్కా ప్లాన్‌తోనే జరుగుతోంది. ఇంతా జరుగుతున్నా భారత్‌ తరఫున 'శాంతి మంత్రమే' కన్పిస్తోంది. ఒకప్పుడు, గుజరాత్‌ ముఖ్యమంత్రిగా వున్న సమయంలో, పాకిస్తాన్‌తో భారత్‌ మెతక వైఖరి సరికాదనీ, తాను గనుక ప్రధానమంత్రినైతే పాకిస్తాన్‌పై యుద్ధానికే మొగ్గు చూపేవాడినని అప్పట్లో నినదించిన నరేంద్రమోడీ, ఇప్పుడు ప్రధాని హోదాలో భారత్‌ మార్కు సంయమనానికే పరిమితయ్యారు. 

తప్పదు మరి, శతృవు సరదా పడటం కన్నా, ఆ యుద్ధం ద్వారా కలిగే నష్టాలపైనే ముందుగా అవగాహనకు రావాలి. కీడెంచి మేలెంచక తప్పదు కదా. అయినాసరే, శతృవు పదే పదే కవ్విస్తోంటే, చూస్తూ ఎలా ఊరుకోగలం.? తాజాగా పాకిస్తాన్‌, తన వాయు సేన సత్తాని భారత్‌కి చూపించేందుకు సరిహద్దుల్లోని ఎయిర్‌ బేస్‌లలో యుద్ధ విమానాలతో హంగామా మొదలు పెట్టింది. పాకిస్తాన్‌లోని పలు ప్రాంతాల్లో అక్కడి జాతీయ రహదార్లపై యుద్ధ విమానాల ల్యాండింగ్‌ ప్రాక్టీస్‌ని ముమ్మరం చేసింది పాకిస్తాన్‌ వాయుసేన. 

'ఇదంతా మామూలుగా జరిగే ప్రాక్టీస్‌ మాత్రమే..' అని చెబుతూనే, 'భారత్‌తో తలెత్తిన ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో మేం సర్వసన్నద్ధంగా వుండాలి కదా..' అంటూ పాకిస్తాన్‌ అసలు విషయాన్ని బయటపెట్టేసింది. జాతీయ రహదార్లపై యుద్ధ విమానాల్ని ల్యాండింగ్‌ చేయడం అన్నది అత్యంత కీలకమైన సందర్భాల్లోనే చేస్తుంటారు. యుద్ధమంటూ జరిగితే తమ ఎయిర్‌ బేస్‌లకు భద్రత లేదన్న విషయం పాకిస్తాన్‌కి బాగా తెలుసు. అందుకే, ముందస్తు సన్నాహాల్లో వుందన్నమాట. 

మరోపక్క, భారత్‌ తరఫున నేవీ, ఎయిర్‌పోర్స్‌, మిలిటరీ.. ఇలా అన్ని విభాగాలూ సర్వసన్నద్ధంగానే వున్నా, రాజకీయ నిర్ణయం అనేది ముఖ్యమిక్కడ. ప్రభుత్వం నిర్ణయం తీసుకోకుండా పాకిస్తాన్‌లోలా ఆర్మీ అయినా మిలిటరీ అయినా నేవీ అయినా స్వతంత్రంగా వ్యవహరించే ప్రశ్నే లేదు భారతదేశంలో. 

మొత్తమ్మీద, యుద్ధం విషయంలో పాకిస్తాన్‌ మాత్రం తెగ ముచ్చటడిపోతోంది. ఆ ముచ్చట తీరే రోజు అంటూ వస్తే, భారత్‌కీ నష్టం తప్పదుగానీ, పాకిస్తాన్‌ మాత్రం ప్రపంచ పటం నుంచి మాయమైపోవడం ఖాయం.