రివ్యూ: మనమంతా
రేటింగ్: 3.5/5
బ్యానర్: వారాహి చలనచిత్రం
తారాగణం: మోహన్‌లాల్, గౌతమి, రైనా రావు, విశ్వాంత్, అనీషా ఆంబ్రోస్, గొల్లపూడి మారుతిరావు, చంద్రమోహన్, హర్షవర్ధన్, పరుచూరి వెంకటేశ్వరరావు, నాజర్, వెన్నెల కిషోర్, ధన్‌రాజ్, ప్రవీణ్, అయ్యప్ప పి. శర్మ, నందమూరి తారకరత్న (అతిథి పాత్రలో) తదితరులు
మాటలు: రవిచంద్రతేజ
సంగీతం: మహేష్ శంకర్
కూర్పు: జి.వి. చంద్రశేఖర్
ఛాయాగ్రహణం: రాహుల్ శ్రీవాస్తవ్
నిర్మాత: రజని కొర్రపాటి
కథ, కథనం, దర్శకత్వం: చంద్రశేఖర్ ఏలేటి
విడుదల తేదీ: ఆగస్టు 5, 2016
'తెలుగు సినిమాకి పాటలు రాయడం ఆయన దురదృష్టం… మనందరి అదృష్టం' – 'సిరివెన్నెల' సీతారామశాస్త్రి గురించి త్రివిక్రమ్ చెప్పిన మాటలివి. ఇవి దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటికి కూడా వర్తిస్తాయి. కేవలం తెలుగు సినిమాలకి పరిమితం కావడం వల్ల ఆయన మేథస్సుకి, తపనకి, ప్రతిభకి తగిన గుర్తింపు రాలేదేమో అనిపిస్తుంది. ఐతే, అనుకోకుండా ఒక రోజు లాంటి అద్భుతమైన చిత్రాలని తీర్చిదిద్దిన ఏలేటి ఈపాటికి తెలుగు సినిమాని 'ఏలేటి' దర్శకుల్లో ఒకడైపోయి ఉండాలి. కానీ ఆ సినిమాలు తీసిన నిర్మాతని అడిగితే పేరే తప్ప డబ్బులు రాలేదంటారు. ఇవే సినిమాలు పర భాషల్లో తీసి ఉన్నట్టయితే ఏలేటికి ఏ స్థాయి గుర్తింపు వచ్చేదో, ఎంతటి విజయం దక్కేదో మరి! తెలుగు ప్రేక్షకులకి అభిరుచి లేదని కాదు… ఒక్కోసారి ఇలాంటి ఆణిముత్యాలని గుర్తించే ఓపిక చేసుకోరు. పైపై హంగులకి ఇచ్చే విలువ, వాటిని చూడ్డానికి చూపించే చొరవ… ఇటువంటి రత్నాల విషయంలో చూపించరు.
నిజానికి ఏలేటిలాంటి దర్శకుడి సినిమా వస్తుందంటే… ఆ పేరుకి విలువ ఇచ్చి అయినా, ఆయన క్రెడిబిలిటీ మీద నమ్మకం ఉంచి అయినా… మొదటి రోజే చూడ్డానికి బారులు తీరాలి. దురదృష్టం కొద్దీ కనీసం మల్టీప్లెక్సుల్లో కూడా 'మనమంతా' చిత్రానికి చెప్పుకోతగ్గ ఆడియన్స్ లేకపోవడం విచారకరం. సినిమా ఎలా ఉందీ, ఏమిటీ అనేది తర్వాతి విషయం. ఏలేటిలాంటి దర్శకుడికి అది మనమిచ్చి తీరాల్సిన కనీస గౌరవం. కమర్షియల్ హంగులు ఉంటేనే సినిమా చూస్తారని అర్థం చేసుకున్నప్పుడు కూడా 'ఒక్కడున్నాడు' లాంటి డిఫరెంట్ కథనే ఆలోచించగలిగాడు కానీ మూస ధోరణి వైపు అడుగులు వేయలేదతను. సమీక్షలో ఈ ఉపోద్ఘాతమంతా తగదు కానీ 'మనమంతా'లాంటి సినిమాకి థియేటర్లో కనీసం ఇరవై శాతం ఆడియన్స్ లేకపోవడం చూసి చివుక్కుమనిపించడంతో రాయక తప్పలేదు.
ఇక 'మనమంతా' విషయానికి వస్తే, ఇది సినిమా కాదు జీవితం. మధ్య తరగతికి చెందిన నలుగురు వ్యక్తుల కథలని చంద్రశేఖర్ ఏలేటి తనకి మాత్రమే సాధ్యమైన రీతిలో వెండితెరపై ఒక దృశ్యకావ్యాన్ని ఆవిష్కరించాడు. తెరపై నటులు కాకుండా పాత్రలే కనిపిస్తూ ఉంటే, ఆ పాత్రల తాలూకు భావోద్వేగాలకి మన శరీరాలు స్పందిస్తోంటే, ఆ పాత్రలకి అంతా మంచే జరగాలంటూ తెలీకుండానే మన మనసులు ఆ దేవుడ్ని వేడుకుంటూ ఉంటే… ఇక అది సినిమా ఎలా అవుతుంది? జీవితాన్ని వెండితెరపై చూపించడం… సంతోషానికి అసలు అర్థాన్ని చెప్పడం… మనిషితనపు లోతుల్ని కొలవడం… హృదయాంతరాలని స్పృశించడం… అసలో సినిమా వల్ల ఎలా అవుతుంది? కానీ 'మనమంతా' దానిని సాధ్యం చేసి చూపించింది.
ఇందులోని పాత్రలు, వాటి ఆలోచనలే కాదు, సన్నివేశాలు, సంభాషణలు ఎంత సహజంగా ఉంటాయంటే, సినిమా మొదలైన కాసేపటికే తెరపై జరుగుతున్నది ఒక సినిమా అని, వాళ్లంతా డబ్బులు తీసుకుని నటిస్తోన్న నటీనటులనే నిజం మసకబారిపోయి, ఆ కథలో(ల్లో) లీనమైపోతాం. ఆ పాత్రలతో పాటు ప్రయాణిస్తూ వారి కోసం తపించిపోతాం. తప్పనిసరి పరిస్థితుల్లో తన కొలీగ్‌ని కొంత సేపు షాప్‌కి రాకుండా చేయాలనుకున్న మోహన్‌లాల్‌కి అతను కిడ్నాప్ అయ్యాడని తెలిసినప్పుడు.. 'అయ్యో' అనిపిస్తుంది. ఎలాగైనా అతనికి తప్పు దిద్దుకునే అవకాశం రావాలనిపిస్తుంది. గోల్డ్ షాప్‌లో గౌతమి ఉంగరం దొంగతనం చేసిందనే అభియోగం మోపినప్పుడు… కొద్ది క్షణాల పాటే అయినా ఆమె అమాయకత్వం రుజువు కావాలనే కోరిక మనల్ని పట్టి కుదిపేస్తుంది. తప్పిపోయిన చిట్టి స్నేహితుడు చచ్చిపోయి ఉంటాడంటూ పోలీసులు ఒక ఫోటో తెచ్చి ఇచ్చినప్పుడు, ఆ ఫోటోని తిప్పి చూసే ధైర్యం చేయలేక కన్నీటి పర్యంతమవుతోన్న పాప రైనా రావుని చూసి కళ్లు తడవకుండా ఆపడం కష్టమవుతుంది. ప్రేయసి కాదన్నదని ప్రాణాలు తీసుకోవడానికి వెళ్లిన విశ్వాంత్‌ని ఎవరు ఆపుతారు, ఎలా ఆపుతారు అంటూ గుండె వేగంగా కొట్టుకుంటుంది. తెర మీది పాత్రలను చూసి ఇన్ని భావోద్వేగాలకి గురైనప్పుడు అది 'ఒట్టి' సినిమా ఎందుకవుతుంది?
పాడైపోయిన కూరగాయలు ఇంటికి తీసుకెళ్లవచ్చు కనుక వాటి కోసం జిత్తులు వేసే సూపర్ మార్కెట్ వర్కర్లనీ, ఎక్కడో డిస్కౌంట్ ఇస్తున్నారరటే నెల సరుకుల మీద నాలుగు వందలు మిగులుతాయనే ఆశతో మైళ్ల కొద్దీ దూరం వెళ్లే ఆడవాళ్లనీ చూస్తే ఇదో సినిమాలా కాకుండా మన ఎదురుగా జరుగుతోన్న సంఘటనలా అనిపించకపోదు. 'నీకు ఎప్పుడూ చిరునవ్వు ఇచ్చేదొకటి ఎంత ఖరీదైనది అయినా కొనిస్తా' అంటూ ఒక మధ్య తరగతి మహిళకి వరమిస్తే… ఏమి ఉంటే తనకి సంతోషమో తెలియక సతమతమవుతూ ఆమె తర్జన భర్జనలు పడే సన్నివేశాలు రాయడం జీవితాన్ని ఎంతో లోతుగా చదివేసిన వారి వల్ల తప్ప మరొకరి తరం కాదు.
కథలోకి ప్రవేశించే ప్రతి పాత్రకీ ఒక పర్పస్ ఉంటుంది. ప్రతి సన్నివేశంలోను లైఫ్ ఉంటుంది. ఆయా పాత్రలకి మంచే జరగాలని పడిన తపనకి తగ్గ ముగింపు వస్తే, మనమే గెలిచినంత సంబరంగా ఉంటుంది. వారి సంతోషంలో మనం భాగమైపోవాలనిపిస్తుంది. సినిమా అయిపోయి టైటిల్స్ రోల్ అయిపోతున్నా, ఇకనుంచి వారి జీవితం ఎలా ఉంటుందో చూడాలనిపిస్తుంది. దర్శకుడిగా ఏలేటి తన స్థాయిని మరెన్నో మెట్లు పెంచుకున్న చిత్రమిది. ఎందుకంటే సినిమాలు చాలా మంది తీస్తారు… కానీ ఇలాంటి అరుదైన అద్భుతాలని ఏలేటి లాంటి కొందరు మాత్రమే ఆవిష్కరించగలరు.
మోహన్‌లాల్ నటన గురించి మాటల్లో చెప్పలేం. సాయిరామ్ అనే పాత్ర తప్ప మనకి మోహన్‌లాల్ కనిపించకపోవడం ఆయన గొప్పతనానికి నిదర్శనం. గౌతమి కూడా సహజ నటనతో అబ్బురపరిచింది. ఆమె స్నేహితురాలిగా ఊర్వశి మన పక్కింటి ఆంటీని గుర్తు చేస్తుంది. బేబీ రైనా రావు నటన అత్యద్భుతంగా ఉంది. విశ్వాంత్, అనీషా ఆంబ్రోస్‌ల ట్రాక్‌లో మిగిలిన వాటికున్న డెప్త్ లేకపోయినా, చివరకు ఆ పాత్రలని కూడా సింపథైజ్ చేస్తామంటే అది దర్శకుడి గ్రేట్‌నెస్. ముందే చెప్పినట్టు సహ నటీనటులు కూడా పూర్తిగా లీనమై ఇది మరపురాని సినిమా అవడంలో తమవంతు పాత్ర పోషించారు.
ఈ చిత్రానికి ఇంతటి నేచురల్ ఫీల్ రావడంలో ఆర్ట్ డిపార్ట్‌మెంట్, సినిమాటోగ్రాఫర్ కృషి చాలా ఉంది. అలాగే వ్యాపార విలువల గురించి లెక్క చేయకుండా ఇలాంటి సినిమాని నిర్మించడానికి ముందుకొచ్చిన నిర్మాత అభిరుచిని మెచ్చుకుని తీరాలి. పాటలు పెద్దగా లేకపోయినా నేపథ్య సంగీతం కదిలిస్తుంది. తన ఆలోచనలకి తగ్గ ఫలితాన్ని ఇవ్వకుండా ప్రేక్షకులు ఎన్నిసార్లు నిరుత్సాహ పరుస్తున్నా కానీ తన పద్ధతి మార్చుకోకుండా, నిత్యం కొత్త ఆలోచనలతో, శక్తి వంచన లేకుండా తనదైన పంథాలోనే సాగుతోన్న ఏలేటిని ఎంత కొనియాడినా తక్కువే అనాలి.
ఎంతమంది చూస్తారో, చూసిన వాళ్లలో ఎంతమంది ఇష్టపడతారో తెలీదు కానీ 'మనమంతా' తప్పక చూసి తీరాల్సిన చిత్రమిది. ఇప్పటికైనా ఏలేటి తపనని, కష్టాన్ని గుర్తించి 'మనమంతా'కి డిజర్వింగ్ సక్సెస్ అందించినట్టయితే బాగుంటుంది.
బోటమ్ లైన్: హేట్సాఫ్ టు ఏలేటి!
– గణేష్ రావూరి