ఎమ్బీయస్‌: చంద్రబాబు ఇమేజి – 2/2

ఎన్టీయార్‌ పాలించే రోజుల్లో అనేక ఎన్నికలు జరిగినప్పుడు, వాటిల్లో బోల్డంత హంగామా జరిగినప్పుడు ఆ కాలంలో అస్సలు అవినీతి లేదని ఎలా అంటాం? 'పెద్దాయనకు యిష్టం లేదు, పుచ్చుకోడు. అలాటి 'డర్టీవర్క్‌' బాబు హేండిల్‌…

ఎన్టీయార్‌ పాలించే రోజుల్లో అనేక ఎన్నికలు జరిగినప్పుడు, వాటిల్లో బోల్డంత హంగామా జరిగినప్పుడు ఆ కాలంలో అస్సలు అవినీతి లేదని ఎలా అంటాం? 'పెద్దాయనకు యిష్టం లేదు, పుచ్చుకోడు. అలాటి 'డర్టీవర్క్‌' బాబు హేండిల్‌ చేసేవారు' అని ప్రతీతి. ఆ రకంగా బాబు ఎమ్మెల్యేలందరి ప్రయోజనాలు కాపాడే లౌక్యుడు, ఆచరణవాది, సిద్ధాంతాలు పట్టించుకోకుండా లోకరీతి ప్రకారం పోయేవాడు అనే పేరుపడ్డారు. అదే ఎన్టీయార్‌ను దించడానికి వుపయోగపడింది. అనామకులైన తమను నాయకులను చేసిన ఎన్టీయార్‌ను ధిక్కరించి, ఎమ్మెల్యేలు బాబు వెంట నడిచారంటే యిది తప్ప వేరే కారణం లేదు. లక్ష్మీపార్వతి కారణంగా ధిక్కరించాం తప్ప మాకు పెద్దాయనపై అపారమైన గౌరవం అని వాళ్లంతా యిప్పుడు చెప్పుకుంటారు. ధిక్కరించి, యింట్లో కూర్చుని వుంటే, రాజకీయాల్లోంచి తప్పుకుని వుంటే అప్పుడు ఆ మాటలు నమ్మవచ్చు. కానీ వీళ్లంతా పదవులు సంపాదించుకున్నారు. 1983 నాటికి, యిప్పటికి వాళ్ల ఆస్తులు బేరీజు వేసి చూస్తే తెలుస్తుంది – ఎంతెంత ఆర్జించారో! లక్ష్మీపార్వతి చుట్టూ భజనపరులు చేరి కానుకలతో ముంచెత్తి పనులు జరిపించేసుకుంటున్నారన్న దుగ్ధ మాట నిజమే, ఆమెను రాజకీయాల్లోంచి తప్పించమని ఎన్టీయార్‌తో మొత్తుకున్నా ఆయన వినకపోవడమూ నిజమే. కానీ ఒక దశలో ఎన్టీయార్‌ దిగి వచ్చి ఆమెను పక్కకు పెడతానని అన్నా, ఒక్క అవకాశమూ యివ్వకుండా అత్యంత అవమానకరంగా తీసి అవతలపడేయడానికి బలమైన కారణం – అవినీతి పట్ల ఎన్టీయార్‌కున్న వ్యక్తిగత విముఖతే! 

బాబు అధికారంలోకి వచ్చాక జరిగిన ఎన్నికలలో ధారాళంగా డబ్బు ఖర్చు పెట్టేవారు. ఆంధ్రలో ఎన్నికల ఖర్చు యితర రాష్ట్రాలతో పోలిస్తే ఎన్నో రెట్లు ఎక్కువన్న సంగతి జాతీయస్థాయిలోనే తెలుసు. దాన్ని ఆ స్థాయికి తెచ్చిన ఘనత బాబుదే. ఆ డబ్బు ఆయన ఎలా ఖర్చుపెట్టారు? ఇంట్లోంచి తెచ్చా? ఖర్చు పెట్టినదాన్ని ఎలా రాబట్టారు? ఏ మాత్రం కామన్‌సెన్స్‌ వున్నా యీ పాయింటుకి ఆన్సరు తడుతుంది. అయినా తెలుగు ప్రజల్లో చాలామంది బాబు అవినీతి పట్ల దివాంధుల్లా ప్రవర్తిస్తారు. వైయస్‌తోనే అవినీతి పుట్టి, కాంగ్రెసు నాయకులందరకూ పాకి, జగన్‌కు వారసత్వంగా వచ్చి అక్కడితో ఆగిపోయిందనుకుంటారు. ప్రస్తుతం కాంగ్రెసు అధికారంలో లేదు, జగన్‌ లేడు, మరి ఆంధ్రలో అవినీతి అస్సలు లేదా!? వైయస్‌తో అవినీతి ప్రారంభం కాలేదు, అంతం కాలేదు. పదవి లేదు కాబట్టి జగన్‌ది సాంకేతికంగా అవినీతి అనడానికి లేదు. పదవి అడ్డం పెట్టుకుని సంపాదించడానికి, తన కొడుకు కంపెనీల్లో పెట్టుబడులు పెట్టడానికి క్విడ్‌ప్రోకో మార్గం వుపయోగించడానికి అవకాశం వున్నది వైయస్‌కు మాత్రమే. కాంగ్రెసు వైయస్‌ను యిరికించకుండా జగన్‌పైనే కేసులు మోపాలని చూడడం చేతనే కేసులు తేలకుండా వున్నాయి. ఇలా ఎన్నిసార్లు రాసినా, ఎంతమందితో వాదించినా అదేమిటో తెలుగువాళ్లలో చాలామంది జగన్‌ అనగానే 'అవినీతి' అంటారు. 2014 ఎన్నికల ఫలితాలు వెలువడేందుకు కాస్త ముందు యూరోప్‌ యాత్రలో వున్నాం. స్విజర్లండ్‌లో తిరుగుతూండగా బస్సులో అందరూ 'జగన్‌ బ్యాంకు', 'జగన్‌ బ్యాంకు' అని అరిచారు. అందరూ స్టేటుబ్యాంకు అధికారులే. ఆర్థిక అక్రమాలు ఎలా జరుగుతాయో బాగా తెలిసినవారే. అయినా నల్లధనం జగన్‌ వద్ద మాత్రమే వుంటుందని, వేరే ఎవరి దగ్గరా వుండదని ఎలా అనుకున్నారో తెలియదు. 

బాబు పాలనలో లోపాల గురించి మాట్లాడితే వెంటనే 'బాబుని విమర్శిస్తున్నావంటే నువ్వు జగన్‌ ఆరాధకుడివి' అనేస్తారు, మోదీని విమర్శిస్తే అయితే మొద్దబ్బాయి రాహుల్‌ ప్రధాని కావాలా? అంటారు. ఇద్దరిలోనూ నాకు లోపాలు కనబడుతున్నాయంటే అర్థం చేసుకోలేరు. ఇదెక్కడి మూర్ఖత్వమో నాకు అర్థం కాదు.  బాబు సమర్థుడు, మరో హైదరాబాదు మనకి కట్టి యివ్వగలడు, జగనైతే అంతా తినేస్తాడు అనే నమ్మకం ప్రబలడం చేతనే టిడిపి గెలిచింది. రాష్ట్రం విడిపోవడానికి బాబు కూడా కారకుడని తెలిసినా దాన్ని పట్టించుకోకుండా ఓట్లేయడానికి కారణమది. టిడిపి, వైకాపాల మధ్య తేడా ఐదు లక్షలే అనే మాట నిజమే అయినా వైకాపా కొన్ని జిల్లాలలోనే తన సత్తా చూపగలిగిందని, అనేక జిల్లాలలో దారుణంగా దెబ్బ తిందని గమనించాలి. పవన్‌ కళ్యాణ్‌, మోదీ మ్యాజిక్‌, ఋణమాఫీ హామీ, కాపుల మద్దతు.. వగైరా కారణాలన్నీ కలిసి రావడం చేతనే టిడిపికి అధికారం చిక్కినమాట వాస్తవమే కానీ బేసిక్‌గా బాబుకున్న మంచి యిమేజే ఆయన్ను అధికారంలో కూర్చోబెట్టింది. ఆ యిమేజి కలిగించినదెవరు? మీడియా, బాబు! ఆయన నేను నిప్పు అని చెప్పుకుంటూ వుంటాడు. ఆయనపై కేసులు చాలా వున్నాయి. కానీ అవి రుజువు కాలేదు. కాకుండా ఆయన జాగ్రత్తలు పడ్డాడు. సిబిఐ, కోర్టులు అన్నీ ఆయనకు అనుకూలంగా వ్యవహరిస్తూ వచ్చాయి. 

దానికి కాంట్రాస్టుగా వున్నది జగన్‌. అతను పదవీదుర్వినియోగం చేసి సంపాదించాడనడానికి వీల్లేదు. కానీ వైయస్‌ పాలనలో జరిగిన అవినీతికి అతనే కారకుడంటూ అతని నెత్తిన రుద్దారు. (రేపు బాబు పాలనలో అవినీతి రుజువైతే దానికి కారణం లోకేశ్‌ అంటే ఒప్పుతుందా? లోకేశ్‌ ఒత్తిడి తేవచ్చు కానీ దానికి లొంగిన తప్పు బాబుదే అవుతుంది. అలాగే జగన్‌-వైయస్‌ విషయం కూడా!) జగన్‌ వైయస్‌ నామజపం వదిలిపెట్టకపోవడమే దానికి కారణం. ఒడిశాలో బిజూ పట్నాయక్‌కు సమర్థపాలకుడిగానూ పేరుంది, అవినీతిపరుడిగానూ పేరుంది. అతని కుమారుడు నవీన్‌ పట్నాయక్‌ రాజకీయాల్లోకి వచ్చాక తండ్రి పేరు పార్టీకి పెట్టాడు తప్ప నిత్యం తండ్రిని గుర్తు చేయడు. తనకంటూ ఒక మంచి యిమేజి సృష్టించుకుని సమర్థంగా పాలిస్తూ పేరు తెచ్చుకుంటున్నాడు. వైయస్‌ సంక్షేమపథకాలే తనకు పెట్టుబడి, వాటి పేరు చెప్తే ఓట్లు రాల్తాయి అనుకున్న జగన్‌ మాటిమాటికీ వాటినే ప్రస్తావిస్తారు. వాటి వలన యింప్రెస్‌ అయినవాళ్లు కొన్ని ప్రాంతాల్లోనే వున్నారని, వైయస్‌ అవినీతిపరుడి యిమేజిని గుర్తుంచుకున్నవాళ్లు ఎక్కువ జిల్లాల్లో వున్నారని 2014 ఎన్నికలలో రుజువైంది. అందుకే 'వైయస్‌ పాలన మళ్లీ తెస్తామని జగన్‌ వాగ్దానం చేస్తే జనాలు హడిలిపోయి వద్దులే అనేశారు' అని రాశాను.

సాధారణంగా అవినీతి ఎన్నికలలో ప్రధానమైన పాత్ర పోషించదు. కానీ ఒక్కోప్పుడు బలమైన ఫ్యాక్టర్‌ అవుతుంది. ప్రబలమైన సెంటిమెంటు వీచిన సందర్భాల్లో తప్ప ప్రతి ఎన్నిక ఫలితం అనేక కారణాల సమ్మిళితఫలం. 2009 ఎన్నికలలో వైయస్‌ గెలిచారంటే దాని అర్థం ఆయన పాలనలో అవినీతి లేదని కాదు. కొన్ని సంక్షేమ పథకాలు, ప్రతిపక్షాల అనైక్యత వగైరా గెలిపించాయి. అలా అయినా పాస్‌మార్కులే పడ్డాయని వైయస్సే చెప్పుకున్నారు.  ఏ జాతీయపార్టీ ముఖ్యమంత్రయినా సరే, పోగేసినదానిలో 10% మాత్రమే వుంచుకోగలడు. 90% హై కమాండ్‌కు పంపవలసినదే. వైయస్‌ పాలించే రోజుల్లో దేశంలో ఎక్కడో అక్కడ ఎన్నికలు జరుగుతూనే వున్నాయి. అనేక పెద్ద రాష్ట్రాలలో కాంగ్రెసు అధికారంలో లేదు. అందువలన ఆంధ్రప్రదేశ్‌పై భారం భారీగానే పడేది. వైయస్‌పై కేసులు లాజికల్‌ ఎండ్‌దాకా తీసుకుని వస్తే తమకే దెబ్బ తగులుతుందన్న భయంతోనే కాబోలు కాంగ్రెసు ప్రభుత్వం జగన్‌పై కేసుల్లో వైయస్‌ పేరు పెట్టడానికి తటపటాయించింది. ఇక టిడిపికి వస్తే హై కమాండ్‌ బాబే! సొంతానికి ఆయనకు ఏమీ అక్కరలేదనుకున్నా పార్టీ నడపడానికైనా తీసుకోవాలి. తనకు మద్దతిచ్చిన పెట్టుబడిదారులకు మేలు చేకూర్చాలి. ఇది ఎవరైనా వూహించగలిగినదే అయినా మీడియా ఆయన నిప్పులా బతుకుతున్నాడని మనకు నచ్చచెపుతూ వుంటుంది. మధ్యతరగతి ప్రజల్లో చాలామందికి మీడియా చెప్పినది వేదం కాబట్టి నమ్మేస్తూ వుంటారు.

ఈ నమ్మకాన్ని చెదరగొడితే తప్ప జగన్‌కు ఆంధ్ర రాజకీయాల్లో స్థానం లేదు. తన ఆర్థిక నేరాల కేసుల్లోంచి ఆయన బయటపడడానికి చాలాకాలం పడుతుంది. ఎంతోకొంత శిక్ష లేదా జరిమానా చెల్లించకుండా బయటపడడం కష్టమని అనుకుంటున్నాను. ఈ లోపున బురద కడుక్కోవడం కష్టం కాబట్టి ఆ బురదను బాబుకు పూద్దామని చూస్తున్నాడు. ఉదాహరణకి అమరావతి భూముల కథనాలలో  ఫలానావాళ్లు వందల ఎకరాలు, వేల ఎకరాలు కొన్నారని రాశారు. మరి భూపరిమితి చట్టం వుండదా అన్న సందేహం వస్తుంది. ఎన్నారైలు కొన్నారంటారు, విదేశీయులు పెట్టుబడి పెట్టడానికి కొన్ని షరతులు వుంటాయి కదాన్న అనుమానం వస్తుంది. వాళ్ల కుటుంబసభ్యుల పేర కొన్నారు అని అంటారు, ఆ విషయం డాక్యుమెంటులో వుంటుందా? ఇన్‌కమ్‌టాక్స్‌ రిటర్న్‌లో సోర్సు ఎలా చూపిస్తారు? ఇవన్నీ ఒక్కోటి చెపుతూ పోతే నమ్మడానికి వీలుండేదేమో! అదేమీ లేకుండా యివాళ్టి పేపర్లో బాబు అవినీతి 1.35 లక్షల కోట్లు అని వేసేశారు. ఇక అసెంబ్లీలో టిడిపి వారు 'లక్ష కోట్లు' అని స్లోగన్‌ యివ్వగానే 'లక్షా ముప్ఫయిఐదు' అని వైకాపావాళ్లు కౌంటర్‌ స్లోగన్‌ యిస్తారేమో! తనను 'లక్ష కోట్లు' అంటున్నారు కాబట్టి ఆయన తనకంటె ఎక్కువ అనాలన్న తాపత్రయమా? అమరావతి భూముల కుంభకోణంలో లక్ష కోట్ల దోపిడీ అట.  ఒక కోటి ఎక్కువ కాదు, తక్కువ కాదు. సరిగ్ఘా లక్ష కోట్లు. పేపర్లో యిప్పటిదాకా చదివిన ప్రకారం అమరావతి భూముల విషయంలో బాబుది ఆశ్రితపక్షపాతం, బంధుప్రీతి, ఇన్‌సైడర్‌ ట్రేడింగు తరహాలో ముందుగానే రహస్యసమాచారం తనవాళ్లకు అందించి వాళ్లు లాభపడేట్లు చూడడం. దీనిలో ఆయన లక్ష కోట్లు ప్రజాధనం దోపిడీ చేశాడని ఎలా చెప్పగలరు? అక్కడ పెరుగుతుందన్న ఆశతో ఆయన ఆప్తులు కొందరు బోల్డంత రేటు పెట్టి భూములు కొన్నారు. చెప్పిన స్థాయిలో రాజధాని అవతరించకపోతే నష్టపోయేది వారే, పోయేది వాళ్ల బ్లాక్‌మనీయే. అక్కడ రాజధాని రాకపోతే భూములిచ్చిన రైతులకు నష్టం,  వాళ్లను దగా చేసినట్లు లెక్క. దాన్ని ఆ కోణంలో చూపాలి తప్ప లక్ష చిల్లర కోట్ల దోపిడీ అంటూ అంకెలు వేయడం దేనికి? డబ్బు తప్ప వేరేవి అంశాలు కావనుకోవడం పొరబాటు. – (సమాప్తం)

-ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (మార్చి 2016) 

[email protected]

Click Here For Part- 1