ఎమ్బీయస్‌: కాపులకు రిజర్వేషన్‌

ఉన్న ఉపద్రవాలు చాలనట్లు యిప్పుడు ఆంధ్రను కాపు ఉద్యమం సెగ తాకింది. నిజానికి యిది ఎప్పుడో అప్పుడు రగులుతుందనుకున్న అంశమే. ఎలాగైనా నెగ్గాలన్న తాపత్రయంలో చిత్తం వచ్చినట్లు యిచ్చేసిన నాయకుల వాగ్దానాలు నెరవేరనప్పుడు సంబంధిత…

ఉన్న ఉపద్రవాలు చాలనట్లు యిప్పుడు ఆంధ్రను కాపు ఉద్యమం సెగ తాకింది. నిజానికి యిది ఎప్పుడో అప్పుడు రగులుతుందనుకున్న అంశమే. ఎలాగైనా నెగ్గాలన్న తాపత్రయంలో చిత్తం వచ్చినట్లు యిచ్చేసిన నాయకుల వాగ్దానాలు నెరవేరనప్పుడు సంబంధిత వ్యక్తులు తిరగబడడం సహజం. ఋణమాఫీ సంగతి అలాగే అయింది. వ్యవసాయ ఋణాలన్నీ మాఫ్‌ చేస్తామన్న వాగ్దానాన్ని నీరు కార్చి, చివరకు లక్షన్నర వరకు మాత్రమే అని చెప్పి, మళ్లీ దానికి సవాలక్ష షరతులు పెట్టి, లొసుగులు లాగి యివ్వవలసిన భారాన్ని బాగా తగ్గించేసుకున్నారు. ఈ క్రమంలో బ్యాంకింగ్‌ వ్యవస్థలో లోపాలు, రైతులు దొంగ ఋణాలు సంపాదించే తీరుతెన్నులు అన్నీ బయటకు వచ్చి ప్రక్రియకు క్షాళన జరిగింది. వాగ్దానానికి, అమలుకు ఎంత వార వుంటుందో రైతులకు జ్ఞానోదయం అయింది. ఇప్పడు అలాటి జ్ఞానోదయం కాపులకు కూడా కలిగే సమయం వచ్చింది. 

ఇప్పుడు చంద్రబాబు అనేక విషయాలు బోధపరుస్తున్నారు. – 'రిజర్వేషన్లు అమలు జరగాలంటే కమిషన్‌ నివేదికలు లేకుండా అసాధ్యం. జీవో 30 ఏ మాత్రం ప్రయోజనం లేదు.' అని. 'ఆ ముక్క లెక్కెట్టుకోవడానికి ముందు చెప్పాల' అన్నట్టు యీ ముక్క ఎన్నికలకు ముందు చెప్పి వుంటే యీ అపోహలు, ఆశాభంగాలు వుండేవి కావు. కాపులను బిసిల్లో చేరిస్తే వాళ్లు అభ్యంతర పెడతారని, బిసిలు టిడిపికి అతి ముఖ్యమైన ఓటు బ్యాంకు అని అందరికీ అవగాహన వుంది. అందుకే యిది జరిగే పని కాదనే అనుమానంతో 'ఎన్నో దశాబ్దాలుగా ఎవరూ చేయలేని పనిని మీరెలా చేస్తారు?' అని అడిగారు. దానికి చంద్రబాబు 'బిసిలకు యిబ్బంది కలగకుండా చేస్తాం, అధికారానికి వచ్చిన ఆరునెలల్లో కమిషన్‌ ఏర్పాటు చేసి రిజర్వేషన్లు కల్పిస్తాం' అని స్పష్టమైన హామీ యిచ్చారు. అంటే రిజర్వేషన్లు యివ్వాలని వీళ్లు వేసిన కమిషన్‌ తీర్పు యిచ్చి తీరాలన్నమాట! ఇంక కమిషన్‌ వేయడం దేనికి? ఇలాటి సందేహాలెన్ని వున్నా, 2014 ఆంధ్ర ఎన్నికలలో టిడిపికి కాపుల ఓట్లు కీలకం కావడంతో, యీ హామీని ఏదో ఒక మేరకు అమలు చేసినా చేయవచ్చు అనుకున్నారు. 

కానీ ఒకసారి పదవి దక్కాక బాబుకు ధైర్యం వచ్చేసింది. వచ్చీ రాగానే కమిషన్‌ వేయలేదు. ఆర్నెల్లు కాదు, ఏడాదయినా కదలిక లేదు. ఏడాదయ్యాక ముద్రగడ పద్మనాభం గుర్తు చేశారు. చివరకు 18 నెలల తర్వాత 2016 జనవరిలో మంజునాథ కమిషన్‌ వేశాం, దాని రిపోర్టు వచ్చేందుకు 9 నెలలు పడుతుంది ఆగండన్నారు. (మంజునాథగారిపై అక్రమాస్తుల ఆరోపణలున్నాయి. ఆయన నిష్పక్షపాతంగా రిపోర్టు యిస్తాడో లేదో తెలియని పరిస్థితి) కాపుల రిజర్వేషన్‌పై గతంలోనే హై కోర్టు ఆదేశాల మేరకు వేసిన పుట్టుస్వామి కమిషన్‌ రిపోర్టు బయటపెట్టలేదు. దాని ఆధారంగా ఏమైనా చేసినా సరిపోయేది. కొత్త కమీషన్‌ వేసి చక్రాన్ని మళ్లీ కనిపెట్టడం దేనికి? పుట్టుస్వామి రిపోర్టును అప్‌డేట్‌ చేసి దాని ఆధారంగా సిఫార్సులు యిచ్చేయండి అని మంజునాథ కమిషన్‌కి చెప్తే సరిపోతుంది. అలా చెప్పలేదు. ఆయన వాయిదాలు వేయకుండా నిజంగా 9 నెలలకు యిచ్చేసినా బాబు అధికారంలోకి వచ్చిన 27 నెలలకు రిపోర్టు వస్తుంది. దానిపై తర్జనభర్జనలయ్యేసరికి మూడేళ్ల కాలం ముగుస్తుంది. అప్పటికి మరో సమస్య ముందుకు వస్తే యిది వెనకపడుతుంది. నిజానికి నిర్ణయాలు వాయిదా వేయడానికి కమిటీలు, కమిషన్లు కానీ, తీసుకోవడానికి కాదని అనేకసార్లు రుజువైంది. రాష్ట్రాన్ని విభజించే ముందు శ్రీకృష్ణ కమిటీ నివేదికను సోనియా పరిగణనలోకి తీసుకున్నారా? విభజన తర్వాత రాజధాని ఎక్కడో నిర్ణయించడానికి కేంద్రం వేసిన శివరామకృష్ణన్‌ కమిటీని బాబు పట్టించుకున్నారా? తనే వేసిన కమిటీ రిపోర్టు రాకుండానే అమరావతి పరిసర ప్రాంతాల్లోనే రాజధాని అని ప్రకటించలేదా? అయినా కమిషన్‌ దేని ఆధారంగా యింత శాతం యిమ్మనమని చెప్తుంది? కులాల వారీ జనగణన జరగలేదు. తక్కిన కులాల విషయం వేరు. కాపులంటే జనాభాలో అధికశాతంలో వున్నారు. రాయలసీమ రెడ్లు కూడా కాపులే. కాపుల్లో ఎన్నో తెగలు, కొందరు అగ్రవర్ణాలుగా వుంటే, కొందరి పరిస్థితి తక్కువగా వుంది. అందరినీ ఒకే గాట కట్టలేరు. వారిలో ఎవరికి బిసి స్టేటస్‌ యివ్వాలి, ఎవరికి యివ్వక్కరలేదు, ఎవరు జనాభాలో ఎంత శాతం వున్నారు – యిలాటి విషయాలు తేల్చాలంటే తాజా సమాచారం వుండాలి. అవన్నీ యిప్పటికిప్పుడు తేలతాయా? ఏదైనా అవకతవకగా జరిగితే యిది అశాస్త్రీయంగా జరిగిందంటూ ఎవరో ఒకరు కోర్టు కెళ్లి ఆపించరా?

ఇవన్నీ తెలియనట్లే జగన్‌ రాజ్యాంగసవరణ చేసి యిచ్చేయచ్చుంటున్నారు. అది అంత సులువైతే వైకాపా మానిఫెస్టోలో రిజర్వేషన్లు యిచ్చేస్తామని పెట్టి వుండాలిగా. కమిషన్‌ వేస్తాం అని వూరుకోవడం దేనికి? ఇప్పుడు ఆ మాట బాబు గుర్తు చేస్తున్నారు. మీరు కమిషన్‌ వేస్తామని మాత్రమే అన్నారు, కానీ మేం రిజర్వేషన్‌ యిచ్చి తీరతామని ఢంకా బజాయించి చెప్పాం అని. అలా చెప్పి ఓట్లడిగారు, సంపాదించారు. దాని అమలులో అవరోధాలేమిటో ఇప్పుడు గుర్తుకు వస్తున్నాయి. వ్యవసాయ ఋణాలన్నీ మాఫీ చేస్తామని ఎన్నికల మానిఫెస్టోలో చెప్పినమాట మర్చిపోయారు లాగుంది, యీ మధ్య ఒక విలేఖరి గుర్తు చేస్తే 'అలా అని నీకు కల్లోకి వచ్చి చెప్పానా?' అని దబాయించారు. లక్షన్నరే మాఫీ అన్నది తర్వాత తర్వాత తేల్చిన అంకె. అలాగే కాపులకు రిజర్వేషన్‌ అనలేదు, రిజర్వేషన్ల కోసం కమిషన్‌ వేస్తామన్నాం, వేశాం, వచ్చే ఎన్నికల్లో కూడా గెలిపిస్తే అప్పుడు కమిషన్‌ రిపోర్టు అమలు చేస్తాం అనవచ్చు. మహామహా జాట్‌లు, గుజ్జర్లు, పటేళ్ల ఆందోళనే సఫలం కాలేదు. ఇవాళ కాపులంటే రేపు కమ్మలంటారు. గతంలో కాపులను బిసిలుగా ఆంగ్లేయులు చూపించారని గుర్తు చేస్తున్నారు. ఆ లిస్టులో కమ్మలు కూడా వున్నారని ఆంధ్రజ్యోతి వేసింది. అందువలన కాపుల రిజర్వేషన్‌ జరిగేదాకా నమ్మడానికి లేదు. 

ఉన్న కోటాలోనే కాపులకు యిస్తే వూరుకోమని బిసిలు అంటున్నారు. కాపుల కోసం 15-20% అదనపు రిజర్వేషన్‌ పెంచితే అప్పుడు జనరల్‌ వర్గాలకు నష్టం కలుగుతుంది.  అందువలన కాపుల రిజర్వేషన్‌ గురించి కాపులు ఒక్కరితోనే చర్చిస్తే చాలదు. బిసి, ఎఫ్‌సి నాయకులతో కూడా కలిపి చర్చించాలి. వీళ్లందరూ ఏకాభిప్రాయానికి రావడం జరిగే పనేనా? మరి పరిష్కారం ఏమిటి? అనేక రకాలుగా వెనకబాటుతనాన్ని నిర్ణయించాలని నేను క్రీమీ లేయర్‌ వ్యాసంలో మొదట్లో రాశాను. ఆ అంశాలన్నిటికీ వెయిటేజి యివ్వకుండా కేవలం కులానికి మాత్రమే యివ్వడం వలన అన్ని సమస్యలూ వస్తున్నాయని రాశాను. సోషల్‌ సైంటిస్టు, సెఫాలజిస్టు, ఒకప్పటి ఆప్‌ నాయకుడు అయిన యోగేంద్ర యాదవ్‌ నేను ప్రస్తావించిన గ్రామీణ వాతావరణం, కుటుంబ ఆర్థికస్థితి, తలితండ్రుల నిరక్షరాస్యత యిత్యాది అంశాలు ఒక్కోదానికి వెయిటేజి యిస్తూ వెనకబాటు తనాన్ని ఎలా నిర్వచించాలో ఒక ఫార్ములా ఎప్పుడో తయారుచేశారట. దానిలో కులం యొక్క సామాజిక హోదా కూడా ఒక ఫ్యాక్టరేట. 50% రిజర్వేషన్‌లోనే యీ కాపులను కూడా పెట్టి యిలాటి ఫార్ములా అప్లయి చేస్తే యీ కులాలలోని డబ్బున్నవాళ్లు ఆటోమెటిక్‌గా ఎలిమినేట్‌ అయిపోతారు. కానీ యిలా చేస్తామని చెప్పడానికి సాహసం వుండాలి.

ఇది చాలా మతలబులతో కూడిన వ్యవహారం కాబట్టి ఏమీ చేయలేదు అనుకున్నా కార్పోరేషన్‌ పెట్టి ఏటా వెయ్యి కోట్ల డబ్బు యివ్వడానికేం కష్టం వచ్చింది? దానికి యిబ్బంది ఏముంది? రాజ్యాంగ సవరణ అక్కరలేదు. తక్కిన కులాలవారిని నొప్పించనక్కరలేదు. ఆ కార్పోరేషన్ల ద్వారా కాపు పేదలకు ఆర్థిక సహాయం, విద్యార్థులకు స్కాలర్‌షిప్పులు, చిన్న వ్యాపారస్తులకు ఋణాలు.. యిస్తే వారి అసంతృప్తి తగ్గేది కదా, అదెందుకు చేయలేదు? దానికి ఎవరైనా అడ్డుపడ్డారా? లేదే! అది చేయకపోవడం మాత్రం నిర్లక్ష్యం. చేయకపోయినా ఏమీ కాదులే అనే తూష్ణీంభావం. గట్టిగా అడిగితే వంద కోట్లు విదిలించారు. అది కాపులను రగిలించింది. ముద్రగడ పద్మనాభం దాన్ని క్యాప్చర్‌ చేశారు. ఆయన కొత్తగా పుట్టుకుని వచ్చిన నాయకుడు కాదు, కాపుల గురించి ఎప్పణ్నుంచో పోరాడుతున్నవాడు. ఎప్పుడూ విజయం సాధించి ఎరగకపోయినా, కాపుల్లో ఆయనంటే గౌరవం వుంది. ఎందుకంటే కాపుల పేరు చెప్పి పాలకుల దగ్గర్నుంచి ఏమీ దండుకోలేదు. ఆయన తునిలో కాపుగర్జన సభ పెట్టాడు. హఠాత్తుగా ఆందోళన కార్యక్రమం ప్రకటించాడు. విధ్వంసం జరిగింది. ఇక మొత్తమంతా రాజకీయం అయిపోయింది. కాపు గర్జన సందర్భంగా జరిగిన విధ్వంసం కాబట్టి ముఖ్యమంత్రి కార్యక్రమ నిర్వాహకులనే నిందించాలి, అసలే కాపులకు అన్యాయం చేసి పైగా కేసులు కూడా పెడితే మరీ రగిలిపోతారు. అందుకని పాపాల భైరవుడు జగన్‌పై నెట్టేశారు. వైకాపావాళ్లే చేశారు అన్నారు కానీ యిప్పటిదాకా ఆధారాలు చూపలేదు. మీడియా తీసిన కెమెరాల ఫుటేజి తీసుకుని అప్పుడు మాట్లాడాలి. ఈ లోగా 'స్వతహాగా నిదానస్తులైన కాపులకు చెడ్డపేరు తేవడానికి జగన్‌ తరఫున గూండాలు రైలు తగలబెట్టారు, వాహనాలు ఆపేశారు' అని అడక్కుండానే కాపులకు ఓ సర్టిఫికెట్టు యిచ్చేశారు. 

ఏ కులం గురించైనా అంత గ్రాస్‌ జనరలైజేషన్‌ చేయడం ఎవరికైనా రిస్కే. కానీ బాబు తరహాలోనే నేనూ గ్రాస్‌గా జనరలైజ్‌ చేసి చెపుతున్నాను – దీనికి మినహాయింపులు, సవరింపులు తప్పక వుంటాయి – కాపులకున్న వర్చ్యూస్‌లో నిదానం మాత్రం లేదు. నాకు తెలిసి వాళ్లు అచ్చమైన తెలుగువాళ్లు. కష్టపడే స్వభావంతో బాటు ఆవేశం, అనైక్యత రెండూ పుష్కలంగా వున్నాయి. అవే తక్కినవారంతగా వారు ఎదగలేకపోడానికి అవరోధాలుగా వున్నాయి. కాపులు ఐక్యంగా వుండి వుంటే, మంచి నాయకుడు వుండి వుంటే యీ సరికి  కనీసం ఒక్క కాపు ముఖ్యమంత్రయినా వుండి వుండేవారు. రాజకీయాల్లో లౌక్యం, ఓర్పు ముఖ్యం. అవి లేకనే ముద్రగడ అక్కడే ఆగిపోయారు. ఆయనను టిపికల్‌ కాపు అనవచ్చు. మంచివాడు, నిజాయితీ పరుడే కానీ తిక్కమనిషి, నాయకలక్షణాలు లేవు, పట్టువిడుపులు లేవు, ఏదో చిన్న విషయంపై అలిగి మధ్యలో మానివేయవచ్చు. ఇప్పుడీ తుని సభ రసాభాస అయింది. హింసాత్మకం కావడంతో కాపులు డిఫెన్స్‌లో పడ్డారు. మూకలను అదుపు చేయలేనివారు సభెందుకు పెట్టారని పదవిలో వున్న బాబు అడగలేరు. అందుకే జగన్‌పైకి నెట్టేశారు. జగన్‌ నువ్వే క్రిమినల్‌ అంటూ రంగా హత్య నాటి సంఘటనలు తవ్వి కోడెల విషయాలు ఎత్తారు. కోడెల సంయమనం కోల్పోయి రౌడీయిజానికి పాంటు, చొక్కా వేస్తే జగన్‌ అనేశారు. స్పీకరై వుండి అలా మాట్లాడినవారు నాకెవరూ గుర్తు రావటం లేదు. ఆయన బదులు వేరెవరైనా ఆ పాయింట్లు చెప్పి వుండాల్సింది. 

బాబు జగన్‌ను నిందిస్తూ పులివెందుల, కడప సంస్కృతి అంటూ మాట్లాడడం సరికాదు. అవేమీ పాకిస్తాన్‌లో లేవు కదా! ఆ జిల్లాలో పరిశ్రమలు పెడదామనుకున్న వారెవరైనా వుంటే వెనక్కి తగ్గరా? పరిటాల రవి హత్య జరిగినప్పుడు అనంతపురం సంస్కృతి ఏమైంది? రవి హత్య జరగ్గానే రాష్ట్రమంతా టిడిపి వారు చేయించిన దహనకాండ సంగతేమిటి? రాయలసీమను రక్తసీమగా సినిమాలు ఎలాగూ ముద్ర కొట్టాయి. ముఖ్యమంత్రి కూడా అలా మాట్లాడితే ఎలా? వాటిని నీచంగా చూపడానికి గోదావరి జిల్లాలు శాంతికి నిలయాలంటూ ఆకాశానికి ఎత్తేయడం దేనికి? అంత శాంతియుతమైనవైతే పోలీసు స్టేషన్లు మూసేసి డబ్బు మిగిల్చి కాపుల కార్పోరేషన్‌కు యిచ్చేయవచ్చు కదా! నిజానికి తునిలో గొడవ కాగానే విజయవాడలో ఎలర్టయ్యారు, అక్కడ అగ్గి అంటుకుంటే యిప్పట్లో ఆరదు. ఇదీ కోస్తాల శాంతియుత జీవనం! కరక్టుగా చెప్పాలంటే కడపలో ఫ్యాక్షనిజం కొందరినే ఎఫెక్ట్‌ చేస్తే అయితే విజయవాడలో రౌడీయిజం అందర్నీ ఎఫెక్ట్‌ చేస్తుంది. జగన్‌ ఆశ పెట్టుకున్నంత మాత్రాన అమరావతికి చెడ్డపేరు రాదు. పాలకుల నిర్వాకమే దానికి ఆ పేరు తెస్తుంది. అలా రాకూడదనే పట్టుదల బాబుకి వుంటే నాగార్జున యూనివర్శిటీలో చనిపోయిన రిషితేశ్వరి కేసు త్వరగా విచారించాలి. విజయవాడలో కాల్‌మనీ-కాల్‌గర్ల్‌ రాకెట్‌ దోషులను, కల్తీ సారా దోషులను త్వరగా శిక్షించాలి. అంతేకాదు, గోదావరి జిల్లాలు శాంతికి నిలయాలు అని ఎవరో చెపితే నమ్మేసి లక్షలాది జనం పోగడినపుడు కూడా పోలీసు బందోబస్తు చేయకుండా కూర్చోకూడదు. తుని సభలో వేదిక దగ్గర పోలీసులు ఎవరూ లేరట. జనాలను అదుపు చేయండని నిర్వాహకులు ఎన్నోసార్లు విజ్ఞప్తి చేసినా లాభం లేకపోయిందట. ఇంత గొడవ జరుగుతుందని ఇంటెలిజెన్సు వర్గాలు వూహించలేకపోయాయా? వాళ్లు చెప్పలేదా? మీరు చూసుకోలేదా? కాపులు, తూగోజిల్లా ప్రజలు మీకు ఆప్తులు కదా, శంకుస్థాపన సభల వంట పెద్ద పెద్ద యీవెంట్స్‌ ఆర్గనైజ్‌ చేసిన మీకు ఆ సభ బాగా జరిగేట్లా చూడలేకపోయారా? రాయలసీమ జిల్లాల నుంచి రౌడీలు వచ్చారంటే సరిపోదు, ఆధారాలు చూపించి గబగబా వారిని అరెస్టు చేయాలి. అప్పుడే రాష్ట్రంలో శాంతిభద్రతలున్నాయని పెట్టుబడిదారులకు నమ్మకం చిక్కుతుంది. 

కాపులు తిరగబడరన్న గట్టి నమ్మకంతో యిన్నాళ్లూ వున్న బాబు కంగు తిన్నట్టున్నారు. ఏ ముఖ్యమంత్రి అడగనట్లు – జీవో అమలు చేసే బాధ్యత మీరు తీసుకుంటారా? అని ఛాలెంజ్‌ చేస్తున్నారు. అదొక్కటే ఏం కర్మ, అన్నీ అమలు చేస్తాం, మీ సింహాసనం యిచ్చేస్తే.. అంటారు ప్రతిపక్షలు. రిజర్వేషన్లు అమలు చేద్దామంటే కాపు నాయకులే వచ్చి యిప్పుడిప్పుడే వద్దని, కమిషన్‌ రిపోర్టు రానివ్వమని చెప్పారని బాబు చెప్తున్నారు. అలా చెప్పిన ఆ పుణ్యాత్ములెవరో పేరు చెప్తే బాగుంటుంది. అప్పుడు మీడియా వెళ్లి ఎందుకలా చెప్పారు? వెయ్యి కోట్లు అక్కరలేదని కూడా మీరే చెప్పారా? అని అడుగుతారు. టిడిపి, వైకాపా బ్లేమ్‌ గేమ్‌ ప్రతీదానికీ సాగుతూనే వుంటుంది. బాబు జగన్‌ను ఎన్ని తిట్టినా ప్రజలకు పట్టదు. 'అందుకే కదా, అతన్ని ఓడించి మీకు పట్టం కట్టాం, నేరం చేశాడని కచ్చితంగా తెలిస్తే కేసులు పెట్టి జైల్లో పెట్టండి, కానీ ముందు మా సంగతి తేల్చండి' అని అడుగుతారు. ఇక చేయవలసినదేమిటి? మొదటగా బాబు అలవికాని హామీలు యివ్వడం ఆకాశంలో పేకమేడలు కట్టడం మానేయాలి. మీకింత వరకే చేయగలం అని ప్రజలకు చెప్పి వారిని నేలమీద వుంచాలి, గాల్లోకి ఎగరేసి కింద పడేయకూడదు. తక్కిన పార్టీలను విశ్వాసంలో తీసుకోవాలి. ఎన్నో దశాబ్దాలగా పెండింగులో వున్న కాపుల రిజర్వేషన్‌ గొడవకు ఒక పరిష్కారం కనుగొనగలిగితే అది యితర రాష్ట్రాలకు కూడా మార్గదర్శకం అవుతుంది. బిసిల కున్న 50% లోనే కాపులను కూడా ఎజస్ట్‌ చేసి యోగేంద్ర యాదవ్‌ ఫార్ములాతో ఆర్థిక పరిమితి, యితర పరిమితులు విధిస్తే, సమాజంలో యితర వర్గాలను ఒప్పించడం కష్టం కాదు. కానీ దీనికి బిసి నాయకులు మాత్రం అడ్డుపడతారు. కాపులు చేరడం, ప్లస్‌ క్రీమీ లేయర్‌ అంటే వారికి బాధగానే వుంటుంది. కానీ ఆ నాయకులను పట్టించుకోకుండా ఆ విధానంలోని మేళ్లను చెప్పి సామాన్య బిసి ఓటర్లను ఒప్పించగలిగితే యీ సమస్యకు పరిష్కారం దొరికినట్లే.

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (ఫిబ్రవరి 2016)

[email protected]