ఆసీస్ పొగరుపై.. టీమిండియా పవర్ పంచ్ పడ్డట్టే!

స్లెడ్జింగ్.. క్రికెట్ లో ఆస్ట్రేలియాకు బాగా ఒంటబట్టిన విద్య. తమ మాట తీరుతో.. ప్రత్యర్థి ఆటగాళ్ల ఏకగ్రాతను దెబ్బతీయడం దశాబ్దాలుగా ఆ జట్టుకు అలవాటు. ఈ విషయంలో ఆసీస్ తీరు గురించి టీమిండియా అభిమానులకు…

స్లెడ్జింగ్.. క్రికెట్ లో ఆస్ట్రేలియాకు బాగా ఒంటబట్టిన విద్య. తమ మాట తీరుతో.. ప్రత్యర్థి ఆటగాళ్ల ఏకగ్రాతను దెబ్బతీయడం దశాబ్దాలుగా ఆ జట్టుకు అలవాటు. ఈ విషయంలో ఆసీస్ తీరు గురించి టీమిండియా అభిమానులకు కొత్తగా వివరించాల్సిన అవసరం లేదు. అది ఎప్పటికప్పుడు అందరికీ అర్థం అవుతూనే ఉంది. అలాంటి ఆసీస్ కు ప్రపంచ క్రికెట్ నుంచి గట్టి సమాధానం ఇచ్చే ఆటగాళ్లలో టీమిండియా క్రికెటర్లు కొంతమంది కనిపిస్తారు. ఆసీస్ ఆటగాళ్ల దూకుడుకు ఆట విషయంలోనే గాక.. మాటల విషయంలో కూడా మనోళ్లు ధీటుగానే సమాధానం ఇచ్చిన సందర్భాలు అనేకం కనిపిస్తాయి.

టీమిండియా నుంచి ఈ తరహా దూకుడు కనిపిస్తున్నా.. మాటల యుద్ధాన్ని మొదట మొదలుపెట్టేది మాత్రం ఆసీస్ ఆటగాళ్లే. మాజీలు, తాజాలు అనే తేడాలు లేకుండా.. ప్రతి సారీ ఇండియన్ టీమ్ ఆసీస్ లో అడుగుపెట్టగానే ఉమ్మడిగా అంతా మొదలు పెడతారు. భారత టీమ్ స్థైర్యం దెబ్బతీయడానికి వారంతా ఉమ్మడి గా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలాంటి యత్నాల్లోనే భాగంగా ఇటీవల ఆస్ట్రేలియన్ ఆటగాడు మ్యాక్స్ వెల్ నోరు తూలాడు. ఏకంగా భారత క్రికెటర్ల ఆట తీరు మీదే తీవ్రమైన వ్యాఖ్య చేశాడు.

ఇది వరకూ ఎంతోమంది ఆసీస్ మాజీలు టీమిండియన్ క్రికెటర్ల తీరుపై విమర్శలు చేసిన దాఖలాలున్నాయి… మనోళ్ల స్థైర్యాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నించిన దాఖలాలూ ఉన్నాయి. అయితే… అతడు మాత్రం అతిగా మాట్లాడాడు. హద్దులు దాటుతూ.. 'భారత క్రికెటర్లు వ్యక్తిగత రికార్డుల కోసమే ఆడతారు.. జట్టుగా వారు రాణించడం కష్టం..'' అంటూ మాట్లాడాడు అతడు. ఇది కచ్చితంగా హద్దు మీరడమే అని వేరే చెప్పనక్కర్లేదు. గత కొంత కాలంలోనే వన్డే, టీ 20 ఫార్మాట్ లలో ప్రపంచ చాంఫియన్ గా నిలవడంతో పాటు, మినీ ప్రపంచకప్ గా వ్యవహరించే ఛాంపియన్స్ ట్రోఫీని కూడా గెలుచుకున్న టీమ్ ను ఆసీస్ ఆటగాడు ఇలా విమర్శించి హద్దు మీరాడు.

మరి ఆయన అలా అతి చేశాడో లేదో.. ఇలా టీమిండియా ఆసీస్ కు గట్టి సమాధానమే ఇచ్చింది. టీ 20 సీరిస్ లో ఆసీస్ ను ఓడించి.. టీమ్ సత్తా ఏమిటో భారత ఆటగాళ్లు నిరూపించారు. వన్డే సీరిస్ లో ఇండియాపై గెలిచే సరికి  తమకు మించిన టీమ్ లేదని.. పలికిన ఆసీస్ పొగరు ఇప్పుడు ఎక్కడ తలదాచుకొంటోందో!