ధోనీ ఫామ్‌లోకొచ్చేసినట్లేనా.?

ఎన్నాళ్ళకెన్నాళ్ళకు.? టీమిండియా కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనీ ఫామ్‌లోకొచ్చేశాడు. వికెట్ల వెనకాల చురుగ్గా కదిలాడు.. మైదానంలో ఆటగాళ్ళతో యాక్టివ్‌గా కన్పించాడు. వ్యూహాలు రచించాడు. ప్రత్యర్థిని బోల్తా కొట్టించేశాడు. చకచకా ఫీల్డింగ్‌ వ్యూహాలు.. బౌలర్‌కి సలహాలు..…

ఎన్నాళ్ళకెన్నాళ్ళకు.? టీమిండియా కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనీ ఫామ్‌లోకొచ్చేశాడు. వికెట్ల వెనకాల చురుగ్గా కదిలాడు.. మైదానంలో ఆటగాళ్ళతో యాక్టివ్‌గా కన్పించాడు. వ్యూహాలు రచించాడు. ప్రత్యర్థిని బోల్తా కొట్టించేశాడు. చకచకా ఫీల్డింగ్‌ వ్యూహాలు.. బౌలర్‌కి సలహాలు.. గెలుపోటములు తర్వాత, ఇలా ధోనీని యాక్టివ్‌గా చూసి చాన్నాళ్ళే అయ్యింది. అంతేనా, బ్యాట్‌తోనూ ధోనీ యాక్టివ్‌గా కన్పించాడు. మునుపటి జోరు ధోనీలో కన్పించింది. ఇకనేం, టీ20 వరల్డ్‌ కప్‌ పోటీలకు ముందు భారత క్రికెట్‌ అభిమానుల్లో ధోనీ మళ్ళీ ఆశలు రేకెత్తించాడు. 

ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో టీమిండియా పేలవమైన ప్రదర్శన వెనుక ధోనీ వ్యూహాత్మక వైఫల్యాల్ని కాదనలేం. ఏడీ, వ్యూహాల ధోనీ ఎక్కడ.? వికెట్ల వెనకాల ధోనీలో స్పీడ్‌ కొరవడింది. ఆటగాళ్ళను నాయకుడిగా నడిపించగల నేర్పరితనం లేదు.. ఇలా రకరకాల కామెంట్స్‌ విన్పించాయి. అన్నీ నిజమే. ధోనీ వన్డే సిరీస్‌లో చాలా పేలవంగా కన్పించాడు. టీ20 సిరీస్‌కి వచ్చేసరికి సీన్‌ మారిపోయింది. 

బంతిని ధోనీ బలంగా బాదుతోంటే, 'అబ్బా.. ధోనీ ఏం కొట్టాడురా..' అని అభిమానులు సంబరపడిపోయారు. రోహిత్‌ చితక బాదేసినా, కోహ్లీ రెచ్చిపోయినా, శిఖర్‌ ధావన్‌ నిలదొక్కుకున్నా.. ధోనీ ఇచ్చిన 'కిక్‌' ముందు అవన్నీ అభిమానులకు పెద్దగా కనిపించలేదనడం అతిశయోక్తి కాదేమో. రెండు టీ20ల్లోనూ ధోనీ చేసింది కేవలం 25 పరుగులు మాత్రమే. అయితేనేం, చాలా ఆత్మవిశ్వాసంతో కన్పించాడు. అది చాలు అభిమానులకి. 

బ్యాటింగ్‌ ఆర్డర్‌ బలంగా వుండడంతో టీ20 వరల్డ్‌ కప్‌లో టీమిండియాపై అంచనాలు మళ్ళీ పెరిగిపోతున్నాయ్‌. ఇక, వరుసగా రెండు టీ20 మ్యాచ్‌లలో ఆస్ట్రేలియాపై గెలిచిన టీమిండియా సిరీస్‌ని కైవసం చేసుకుంది. వరల్డ్‌ కప్‌ టీ20కి ముందు ఇది సన్నాహక సిరీస్‌ మాత్రమే. ఆల్‌ ది బెస్ట్‌ టు టీమిండియా.