ఇటీవలి కాలంలో రాహుల్ గాంధీ చురుగ్గా వుంటున్నారు. అరుణాచల్ ప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన విధించినప్పుడు ఆక్షేపణ తెలపడం వంటి రాజకీయ స్పందనలు ఎలాగూ తప్పవు. కొన్ని వర్గాలను అనుకూలంగా మార్చుకునే అదనపు ప్రయత్నం చేస్తున్నట్లు కనబడుతోంది. రోహిత్ ఆత్మహత్య వార్త తెలియగానే వాలిపోయి తను దళితపక్షపాతిని అని చూపించుకునే ప్రయత్నం చేశారు. తమిళనాడు కాంగ్రెసు మహిళా విభాగంలో రాష్ట్ర అధ్యక్షుడు ఇలంగోవన్‌తో పేచీ పెట్టుకున్న విజయధరిణిని తొలగించి ఆమె స్థానంలో దళిత నేత ఝాన్సీ రాణిని నియమించారు. ఆమె ఎమ్మెల్యేగా కూడా లేదు. ఏడుసార్లు ఎమ్మెల్యే అయిన పొణ్ణమ్మాళ్‌కు మనుమరాలు మాత్రమే. ప్రస్తుతం ఒక జిల్లాకు అధ్యక్షురాలు. దళితుల్లాగానే రైతులూ నాకు కావలసినవారే అని చూపడానికి కాబోలు బుందేల్‌ఖండ్‌లో పాదయాత్ర నిర్వహించారు. పేదల కోసం కూడా నిలిచాను అని చూపడానికి వచ్చేవారం అనంతపురం జిల్లాలోని బండ్ల గ్రామానికి రాబోతున్నారు. సందర్భం ఏమిటంటే ఉపాధిహామీ పథకం – నరేగా- (మహాత్మాగాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్‌మెంట్ గ్యారంటీ స్కీము) పెట్టి పదేళ్లయిందట! వచ్చి, అది తమ హయాంలోనే ప్రవేశపెట్టబడిందని జనాలకు గుర్తు చేస్తారట. రాష్ట్రవిభజన జరిగిన చాన్నాళ్లు రాహుల్ యిటు తొంగి చూడలేదు. ఆంధ్రలో ఓటమి ఎలాగూ తప్పదు, తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షంగా వుంది కదా, అక్కడైనా పార్టీని నిలపెడదామని ఉపయెన్నికలో, హైదరాబాదు కార్పోరేషన్ ఎన్నికలలో విస్తారంగా తిరిగి ప్రచారమూ చేయటం లేదు. రాజకీయలబ్ధి లేకుండా ఉత్తిపుణ్యానికి యింత చురుకుదనం దేనికి అని ఆలోచిస్తే ఒక విషయం తడుతోంది. నేషనల్ హెరాల్డ్ కేసులో జైలుకి వెళ్లే ప్రమాదం!
బెయిల్ సందర్భంగా సోనియా అన్నమాటలు గుర్తు చేసుకోండి – ''నేను ఇందిరా గాంధీ కోడల్ని, పోరాడతాను'' అందామె. జనతా పార్టీ అధికారంలో వుండగా హోం మంత్రి చరణ్ సింగ్ జీపుల కేసులో ఇందిరా గాంధీని అరెస్టు చేయించాడు. ఆ సందర్భంగా ఇందిర ప్రభుత్వాన్ని చాలా యాగీ చేసింది. మార్గమధ్యంలో వాహనం దిగడానికి అనుమతి అడిగి, అనుమతి యిచ్చాక మళ్లీ ఎక్కనని మొరాయించి పోలీసులను ముప్పుతిప్పలు పెట్టింది. చరణ్ సింగ్ అసమర్థత కారణంగా కేసు సరిగ్గా నడవలేదు. ఇక ఇందిర తను వెళ్లిన చోట ప్రతీ చోటా నన్ను జైల్లో పెట్టారు అంటూ కన్నీరు కురిపించింది. ప్రజాస్వామ్యవాదులు, మధ్యతరగతివారు, మేధావులు చీదరించుకున్నారు కానీ మహిళలు, పేదలు, దళితులు, మైనారిటీలు ఇందిరపై బోల్డు సానుభూతి కురిపించారు. 1978 ఆంధ్రప్రదేశ్, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలో ఇందిరా కాంగ్రెసు గెలుపొందడానికి ఆమె కన్నీళ్లే కారణమన్నా అతిశయోక్తి కాదు. ఇందిర జీపు కేసు కంటే నేషనల్ హెరాల్డ్ కేసు చాలా గట్టిది. ప్రస్తుతానికి బెయిలు దొరికింది కానీ 2016 ఫిబ్రవరి 20 న మళ్లీ కోర్టుకి హాజరు కావాలి. మోదీ ప్రభుత్వం సమర్థవంతంగా వ్యవహరించి, కేసును కడదాకా నడిపిస్తే సోనియా, రాహుల్ తదితరులు జైలుకి వెళ్లే సావకాశం గట్టిగా వుంది. శిక్షంటూ పడితే సోనియా విషయంలో ఆమెకున్న తీవ్రఅనారోగ్యం కారణంగా వెసులుబాటు దొరికే ఛాన్సుంది. కానీ రాహుల్‌కి అలాటి మినహాయింపులు లేవు. జైలుయోగం పడితే తన తరఫున ఆందోళన చేయడానికి కాంగ్రెసు కార్యకర్తలు సరిపోరు, ప్రజల్లో కొన్ని వర్గాలైనా తన కోసం నిలవాలి, ఆందోళన వ్యక్తం చేయాలి. అందుకే యివన్నీ అని నా అనుమానం. ఇంతకీ నేషనల్ హెరాల్డ్ కేసు అంత పెద్దదా?
కాంగ్రెసు పార్టీకి తనకంటూ ఒక పత్రిక వుండాలి, దాని కోసం ఒక పబ్లిషింగ్ కంపెనీ ప్రారంభించాలి అనే నెహ్రూ సూచనతో అసోసియేటెడ్ జర్నల్స్ లి. (ఎజెఎల్) అనే పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ 1938లో వెలిసింది. 2000 ప్రిఫెరెన్షియల్ షేర్ల విలువ ఒక్కోటి రూ.100 కాగా, 30 వేల మామూలు షేర్ల విలువ ఒక్కోటి రూ.10. నెహ్రూ వాటా రూ.100. మొత్తం 5000 మంది స్వాతంత్య్రయోధులు షేర్‌హోల్డర్లు అయ్యారు. వారిలో పురుషోత్తమ్ దాస్ టాండన్, ఆచార్య నరేంద్ర దేవ్, కైలాశ్ నాథ్ కట్జూ, రఫీ అహ్మద్ కిద్వాయ్, గోవింద వల్లభ పంత్ వంటి దిగ్గజాలు వున్నారు. ఇది నేషనల్ హెరాల్డ్ అనే ఇంగ్లీషు పత్రిక (సంపాదకుడిగా తెలుగువాడే అయిన చలపతిరావు వుండేవారు), ''క్వామీ ఆవాజ్'' అనే ఉర్దూ పత్రిక, ''నయా జీవన్'' అనే హిందీ పత్రిక ప్రచురించేది. స్వాతంత్య్రపోరాట కాలంలో ఆ పార్టీకి మంచి పేరుప్రఖ్యాతులు, ఆదరణ వుండేవి. కాంగ్రెసు నాయకులు పత్రిక గురించి ప్రచారం చేసి సర్క్యులేషన్ పెంచేవారు. అధికారంలోకి వచ్చాక వారికి పత్రిక గురించి పట్టించుకోవడానికి తీరిక లేకపోయింది. దృష్టి పెట్టేవాళ్లు లేక చందాదారులు తగ్గసాగారు. పార్టీ పత్రికలను ఎలాగైనా బతికించుకోవాలని నెహ్రూకు కోరిక వుండేది. చివరకు 1955లో ఎజెఎల్‌ను లాభాపేక్ష లేని సెక్షన్ 25 కంపెనీగా మార్చారు. (జనహిత్ నిధి ట్రస్టు అనే పేర ఒక ధర్మనిధి ఏర్పాటు చేసి ఎజెఎల్ షేర్లన్నీ దానికి బదిలీ చేశారని కూడా చదివాను, కేసులో యీ ట్రస్టు మాట ఎక్కడా వినబడటం లేదు) ఎజెఎల్‌కు అప్పటికే ఢిల్లీ, హరియాణా, బొంబాయి, లఖనవ్, ఇందోర్‌లలో ఆస్తులుండేవి. పత్రికను బతికించుకోవడం తమ నైతిక బాధ్యతగా కాంగ్రెసు పార్టీ ఫీలయ్యేది. దానికి అప్పుడప్పుడు డబ్బులు యిస్తూ వుండేది.
ఖుశ్వంత్ సింగ్ 1978-79లలో కొంతకాలం ఆ పత్రికకు ఎడిటరుగా పనిచేసేవాడు. డబ్బుల్లేక పత్రిక ఆపేయాలేమో అనుకున్నపుడు సడన్‌గా సూటుకేసుల్లో డబ్బులు వచ్చేవిట. దాంతో జీతాలు యిచ్చి, కరంటు బిల్లులు కట్టేవారట. అది ఎంత దరిద్రంలో బతికిందంటే 2008లో పత్రిక మూతపడేనాటికి ఆఫీసు మొత్తానికి ఒకే ఒక్క కంప్యూటరు వుండేది. పనంతా టైపు రైటర్లపై నడిచేది. చెత్త పేపరుపై 5 వేల కాపీలు వేసేవారు. వాటిలో చాలాభాగం ప్రభుత్వాఫీసులకే వెళ్లేవి. బయట న్యూస్ స్టాల్స్‌కి అతి తక్కువగా వెళ్లేవి. 265 మంది ఉద్యోగస్తులు మిగిలితే విఆర్‌ఎస్ కింద తలా రూ.15 లక్షలిచ్చి యింటికి పంపించేశారు. అందువలన కాంగ్రెసు అధికారంలో వున్నపుడు కూడా పత్రికను సరిగ్గా పోషించలేదు. 70 సం||రాల కాలంలో అది అడపాదడపా యిస్తూ వచ్చిన డబ్బు 2008 నాటికి రూ.90 కోట్లకు చేరింది. అది అప్పుగా యిచ్చినట్లా, లేక ఆ కంపెనీలో పెట్టుబడి పెట్టినట్లా అన్నది స్పష్టంగా ఎక్కడా రాసుకోలేదు. వడ్డీ లేకుండా అప్పిచ్చాం అంటోంది కాంగ్రెసు యిప్పుడు. రాజకీయపార్టీలు యిలా అప్పులివ్వచ్చా? అని యిప్పుడు ప్రశ్నలు వస్తున్నాయి. – (సశేషం)
-ఎమ్బీయస్ ప్రసాద్ (జనవరి 2016)