ఒంటరిగా వుండాలంటేనే భయం…పూర్ణ

తెలుగులో కాస్త చెప్పుకోదగ్గ సినిమాలే చేసినా, అవును, అవును 2 సినిమాలతో ప్రేక్షకులకు బాగా దగ్గరయింది పూర్ణ. పైగా మంచి నటిగా కూడా ప్రూవ్ చేసుకుంది. తక్కువ సినిమాల్లో అయినా మంచి సినిమాల్లో నటిస్తున్న…

తెలుగులో కాస్త చెప్పుకోదగ్గ సినిమాలే చేసినా, అవును, అవును 2 సినిమాలతో ప్రేక్షకులకు బాగా దగ్గరయింది పూర్ణ. పైగా మంచి నటిగా కూడా ప్రూవ్ చేసుకుంది. తక్కువ సినిమాల్లో అయినా మంచి సినిమాల్లో నటిస్తున్న పూర్ణతో చిట్ చాట్

అవును 2 రిజల్ట్ తో హ్యాపీయేనా?

నూటికి నూరు శాతం.. రివ్యూలు రాసేవాళ్లు అంతా నాకు నూటికి నూరు మార్కులు వేసేసారు.

అదే తరహా పాత్ర, చేయడానికి కొత్తగా ఏమీ వుండదు..పార్ట్ 2చేయడానికి అభ్యంతరం ఏమీ చెప్పలేదా మీరు.

లేదు. పార్ట్ వన్ చేసినపుడు నాకు రవి సార్ గురించి అంతగా తెలియదు. పాత్ర గురించీ తెలియదు. ఇప్పుడు అన్నీ తెలుసు. అంటే రవిసార్ ఏదో క్రియేట్ చేస్తారు. అందుకే ఒకె అన్నాను.

మీరు బాగానే భయపడి, జనాల్ని బాగానే భయపెట్టినట్లున్నారు? రెండు హర్రర్ సినిమాలు వరుసగా చేసి, ఒంటరిగా వుండగలుగుతున్నారా?

మీకు తెలుసా? నాకు చాలా భయం..ఘోస్ట్ లు అన్నా, దొంగలు అన్నా. నేను అస్సలు ఎప్పుడూ ఒంటరిగా రూమ్ లో వుండను. వుండాల్సి వస్తే, తలుపు వేసుకోమన్నా వేసుకోను.

అవును సిరీస్ తరువాతా? ముందునుంచీనా?

చిన్నప్పటి నుంచీ నాకు విపరీతమైన భయం. ఎందుకో తెలియదు.  ఇప్పటికీ హోటళ్లలో దిగినా తలుపు తీసి వుంచుతాను. హౌస్ కీపింగ్ వాళ్లు వచ్చి, ఏమన్నా కావాలా..తలుపు తీసి వుంచారు అని అడుగుతారు.

దొంగలంటే భయం అంటారు..తలుపు తీసి వుంచితే ఎలా?

అంటే, తలుపు తీసి వుంటే నాకు అదో ధైర్యం. చటుక్కున బయటకు పారిపోవచ్చు అని.

తెలుగులో ఎక్కువగా సినిమాలు చేయకపోవడానికి కారణం..ఆపర్లు రాకనా? మీరు మరీ సెలక్టివ్ గా వుంటారా?

రెండూనూ. ఒకటి నేను ఇలియానా టైపు హీరోయిన్ కాదు. టాలీవుడ్ కమర్షియల్. ఇక్కడ అన్ని రకాల డ్రెస్ లు వేసుకునే వారు కావాలి. నేను పక్కా ట్రెడిషనల్ గర్ల్ గా వుంటాను. శారీ నాకు కంపర్టబుల్ గా వుంటుంది.ఇక నాకు లెంగ్త్ ఎక్కువే వున్నాకూడా, పాస్ ఆన్ క్యారెక్టర్లు అంటే ఇష్టం వుండదు. కొంచెం చేయడానికి ఏదైనా వుండాలి. అందుకోసం, అలాంటి పాత్రల కోసం చూస్తాను.?

రవిబాబు గారితో వరుసగా సినిమాలు చేసారు. మీ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరిందని గుసగుసలు?

అయ్యో…దీనికి నేనేం చెప్పను. మీకు తెలుసా? అవును ముందు ఆయన పరిచయం లేదు. అవును సినిమా షూటింగ్ సగంలో వుండగా, ఓ ఇస్యూ జరిగింది. ఆయనకు నచ్చలేదు. పూర్ణా, యు గో బ్యాక్. నేను వేరే అమ్మాయితో సినిమా కంప్లీట్ చేసాక పిలుస్తాను..చూద్దువు గానీ అన్నారు. తరువాత మళ్లీ బాగా చేసి ఓకె చేసాను. నమ్మండి..అప్పటి నుంచి సినిమా విడుదలయ్యేవరకు మా మధ్య పెద్దగా మాటలు లేవు. అవును 2 అప్పుడు కూడా వచ్చి ఒక్కటే అన్నారు. రెండో పార్ట్ మనం చేస్తున్నాం అని. నిజానికి రవిబాబుగారంటే నాకు చాలా గౌరవం. అలాంటివాళ్లు తక్కువ మంది వుంటారు. సినిమా..సినిమా. అంతే. సినిమా కోసం వచ్చాం. సినిమా చేస్తున్నాం. పర్సనల్ విషయాలు, గ్యాసిప్ లు, అక్కర్లేని సంగతులు ఆయన అస్సలు మాట్లాడరు పట్టించుకోరు. చాలా సీరియస్ గా వుంటారు. ఆయన పని, లేకుంటే ఇంటికి వెళ్లిపోవడం. నాకు ఆయనంటే మాత్రం చాలా గౌరవం. ఇక గ్యాసిప్ లంటారా..దాందేముంది హర్షకు నాకు కూడా ముడిపెట్టారు కదా?

సరే, ఇంతకీ హర్షతో ఎలా వుంది ప్రయాణం.?

నైస్. మంచి నటుడు. చాలా మంది అన్నారు. మీ ఇద్దరి పెయిర్, సినిమా పెయిర్ లా వుండదు. నిజమైన పెర్ ఫెక్ట్ కపుల్ లా వుంటారు అని.

మీరు మంచి డ్యాన్సర్. అందుకు సరైన అవకాశాలు రాలేదని ఫీల్ ఏమన్నా వుందా?

లేదు. ఇంతకు ముందు సినిమాల్లో నా డ్యాన్స్ లు చూసారుగా. మీకో సర్ ప్రైజ్ చెప్పనా, మహేష్ బాబు పక్కన డాన్స్ చేసానోచ్. కొరటాల శివ సినిమాలో ఓ పాటలొ కాస్సేపు ఆయన పక్కన డ్యాన్స్ చేసా. ఐటమ్ సాంగ్ కాదు. ఓ స్పెషల్ సాంగ్ అన్నమాట. ఐ ఫీల్ సో హ్యాపీ.

కమింగ్ ప్రాజెక్ట్ సంగతులు.?

త్వరలో ఓ పెద్ద ప్రాజెక్ట్ లో పార్ట్ కాబోతున్నా, మెయిన్ లీడ్ కాదు. కానీ ఇంపార్టెంట్ రోల్. మరో నెల తరువాత చెబుతా ఆ న్యూస్.

విఎస్ఎన్ మూర్తి