సెమీస్‌.. మ్యాచ్‌ ‘టర్న్‌’ అయ్యింది

వరల్డ్‌ కప్‌ సెమీస్‌లో మ్యాచ్‌ టర్న్‌ అయ్యింది. ఆరంభంలోనే ఆసీస్‌ని దెబ్బ తీయడంలో సక్సెస్‌ అయిన టీమిండియా, ఆ తర్వాత చేతులెత్తేసింది. 3 ఓవర్లలో తొలి వికెట్‌ కోల్పోయిన ఆసీస్‌, 34వ ఓవర్‌ వరకూ…

వరల్డ్‌ కప్‌ సెమీస్‌లో మ్యాచ్‌ టర్న్‌ అయ్యింది. ఆరంభంలోనే ఆసీస్‌ని దెబ్బ తీయడంలో సక్సెస్‌ అయిన టీమిండియా, ఆ తర్వాత చేతులెత్తేసింది. 3 ఓవర్లలో తొలి వికెట్‌ కోల్పోయిన ఆసీస్‌, 34వ ఓవర్‌ వరకూ మరో వికెట్‌ పడకుండా జాగ్రత్తపడిరది. స్కోర్‌ బోర్డ్‌ పరుగులు పెట్టింది. ఈ దశలో వికెట్‌ పడితే, ఆ తర్వాత మ్యాక్స్‌వెల్‌ రంగంలోకి దిగితే.? అని భారత క్రికెట్‌ అభిమానులు టెన్షన్‌ పడ్డారు.

కానీ, 34.1 ఓవర్లలో రెండో వికెట్‌ కోల్పోయింది ఆసీస్‌. సెంచరీ హీరో స్మిత్‌ ఔట్‌ అవగా, ఆ తర్వాత వచ్చిన మ్యాక్స్‌వెల్‌ మెరుపులు మెరిపించాడు. అది కూడా కాస్సేపే. అశ్విన్‌ బౌలింగ్‌లో మ్యాక్స్‌వెల్‌ ఔట్‌ అవగానే భారత క్రికెట్‌ అభిమానులు సంబరాలు చేసుకున్నారు. ఆ వెంటనే మరో వికెట్‌.. అదీ ఓపెనర్‌ అరోన్‌ ఫించ్‌ది. స్లోగా బ్యాటింగ్‌ ప్రారంభించినా, అవసరమైతే మ్యాక్స్‌వెల్‌ కన్నా విధ్వంసం సృష్టించగలడు ఫించ్‌.

ఇక, 42.1 ఓవర్లకు ఆస్ట్రేలియా 5 కీలక వికెట్లు కోల్పోయింది. ఆసీస్‌ కెప్టెన్‌ క్లార్క్‌ మరోమారు నిరాశపరిచాడు. ఈజీగా 300 దాటేసి, 400కి దగ్గరలోకి వెళుతుందనుకున్న ఆసీస్‌ స్కోర్‌.. అనూహ్యంగా డల్‌ అయ్యింది. ఇంకా 300 దాటడానికి ఛాన్స్‌లున్నా, పరిస్థితి ప్రస్తుతానికి టీమిండియాకి అనుకూలంగానే కన్పిస్తోంది.

మ్యాచ్‌లో అనూహ్యమైన మలుపులంటే స్మిత్‌, మ్యాక్స్‌వెల్‌, ఫించ్‌ వికెట్లు కూలడమే. ఉయేష్‌ యాదవ్‌ పరుగులు సమర్పించుకున్నా మూడు ముఖ్యమైన వికెట్లను నేలకూల్చడం గమనార్హం.