ఈ వరల్డ్ కప్‌లో ఇప్పటిదాకా ఆడిన అన్ని మ్యాచ్‌లలోనూ ప్రత్యర్థిని టీమిండియా ఆలౌట్ చేసిన విషయం విదితమే. అంచనాలకు మించి బౌలర్లు రాణించడంతో టీమిండియా సెమీస్‌కి చేరిందన్నది కాదనలేని వాస్తవం. అయితే సెమీస్‌లో బౌలర్లు ఆశించిన స్థాయిలో రాణించలేకపోవడం భారత క్రికెట్ అభిమానుల్ని కలవరపాటుకు గురిచేస్తోంది.
ఆరంభంలోనే ఆసీస్‌ని యాదవ్ దెబ్బ కొట్టినా, ఆ తర్వాత ఆసీస్ ఒక్క వికెట్ కూడా చేజార్చుకోకుండా 25 ఓవర్ల దాకా జాగ్రత్తపడింది. 30 ఓవర్లు పూర్తయినా భారత బౌలర్లు ఇంకో వికెట్ తీయలేకపోయారంటే, ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ ఎంత జాగ్రత్తగా ఆడుతున్నారో అర్థం చేసుకోవచ్చు. రన్‌రేట్ పక్కాగా మెయిన్‌టెయిన్ చేస్తూనే, భారత బౌలింగ్‌ని ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ సమర్థవంతంగా ఎదుర్కొంటున్నారు.
యాదవ్, షమీ, మొహిత్ శర్మ, అశ్విన్, జడేజా వికెట్ల కోసం కష్టపడాల్సి వస్తోంది. ఫాస్ట్ బౌలింగ్, స్పిన్ బౌలింగ్.. ఇలా దేన్నయినా ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ ఎదుర్కొంటుండడంతో టీమిండియాకి వికెట్లు దక్కడం కనాకష్టంగా మారిపోయింది. పార్ట్ టైమ్ బౌలర్ కోహ్లీ కూడా ఓ ఓవర్ వేసేశాడు.
వికెట్లు పడకపోతే, ఆస్ట్రేలియాని చివరి ఓవర్లలో కట్టడిచేయడం దాదాపుగా అసాధ్యమే. షేన్ వాట్సన్, మ్యాక్స్‌వెల్ చెలరేగిపోతే, ఆసీస్ స్కోర్ 300 దాటుతుందో, 400 చేరుతుందో లెక్కలు వేయలేం. టీమిండియా బౌలింగ్ చప్పగా సాగడంతోపాటు, ఆసీస్ బ్యాట్స్‌మెన్ ఎక్కడా ప్రత్యర్థి బౌలర్‌కి అవకాశమివ్వకపోవడంతో ఆసీస్ ఇన్నింగ్స్ స్టడీగా కొనసాగుతోంది.
30 ఓవర్లకు ఒక వికెట్ నష్టానికి 155 పరుగుల స్కోర్ దాటించారు ఆసీస్ బ్యాట్స్‌మెన్. స్టీవ్ స్మిత్, ఆరోన్ ఫించ్ అర్థ సెంచరీలతో ఆసీస్ ఇన్నింగ్స్‌ని నిలబెట్టారు.