ఆసీస్‌ని కంగారెత్తించాలంటే…

టీమిండియా బౌలర్లు విదేశీ పిచ్‌లకు అలవాటుపడిపోయారు. బ్యాట్స్‌మెన్‌ ఎలాంటి బంతులనయినా ఎదుర్కోగలుగుతున్నారు. ఫీల్డింగ్‌ సైతం మెరుగుపడింది. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ హోదాలో, ఆ హోదాకు తగ్గట్టు ఆటగాళ్ళు ఈ వరల్డ్‌ కప్‌లో రాణిస్తుండడం ఆహ్వానించదగ్గ విషయమే.…

టీమిండియా బౌలర్లు విదేశీ పిచ్‌లకు అలవాటుపడిపోయారు. బ్యాట్స్‌మెన్‌ ఎలాంటి బంతులనయినా ఎదుర్కోగలుగుతున్నారు. ఫీల్డింగ్‌ సైతం మెరుగుపడింది. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ హోదాలో, ఆ హోదాకు తగ్గట్టు ఆటగాళ్ళు ఈ వరల్డ్‌ కప్‌లో రాణిస్తుండడం ఆహ్వానించదగ్గ విషయమే. టోర్నీని కైవసం చేసుకోవాలంటే ఇంకా రెండు మెట్లు మాత్రమే ఎక్కాల్సి వుంది. తొలి మెట్టు ఆసీస్‌తో.. అదీ ఆస్ట్రేలియాలోని సిడ్నీ మైదానంలో.

సొంత గడ్డ మీద, సిడ్నీ మైదానంలో ఆస్ట్రేలియాని టీమిండియా ఓడిస్తేనే సెమీస్‌ దాటి, ఫైనల్‌కి అర్హత పొందుతుంది. ఆసీస్‌ ఆటగాళ్ళలో క్లార్క్‌ టీమిండియాకి అతి ప్రమాదకరమైన బ్యాట్స్‌మెన్‌. అయితే, క్లార్క్‌ ఇప్పుడు ఫామ్‌తో లేడు. స్టీవ్‌ స్మిత్‌ కూడా టీమిండియాకి కొరకరాని కొయ్యే. మాక్స్‌వెల్‌ని నిలువరించడం భారత బౌలర్లకు చాలా కష్టమైన వ్యవహారం. అయినాసరే, ఆసీస్‌ని వారి సొంత గడ్డ మీద టీమిండియా ఓడించడం అసాధ్యమైతే కాదు.

టీమిండియా సెమీస్‌ గండం గట్టెక్కాలంటే కావాల్సింది.. ఇప్పటిదాకా చూపించిన తెగువ ఇంకాస్త ఎక్కువ చూపడం. బ్యాట్స్‌మెన్‌, బౌలర్లు సమిష్టిగా రాణిస్తే, ఆసీస్‌ని మట్టికరిపించడం కష్టమేమీ కాదన్నది విశ్లేషకుల వాదన. బౌలర్లు అంచనాలకు మించి రాణిస్తుండడం టీమిండియాకి కలిసొచ్చే అంశం. ఆసీస్‌కి ఎన్ని ప్లస్‌ పాయింట్స్‌ వున్నాయో, టీమిండియాకి సైతం ఆ స్థాయిలోనే ప్లస్‌ పాయింట్స్‌ వున్నాయి.

ఇదిలా వుంటే, సొంత గడ్డపై గెలిచేస్తామనే ధీమా ఆసీస్‌ ఆటగాళ్ళలో వ్యక్తమవుతోంది. అదే సమయంలో, టీమిండియాని లైట్‌ తీసుకోవడానికి వీల్లేదనీ, టీమిండియా విదేశీ పిచ్‌లను బాగా అర్థం చేసుకోవడం వల్లే ఈ టోర్నీలో సంచలనాలు నమోదు చేస్తోందని ఆస్ట్రేలియా ఆటగాళ్ళే చెబుతుండడం గమనార్హం.

ఆసీస్‌.. టీమిండియాని లైట్‌ తీసుకోవడంలేదు.. అదే సమయంలో టీమిండియా సైతం సెమీ ఫైనల్‌ విషయంలో మరింత అప్రమత్తంగా కన్పిస్తోంది. వీలైనంతవరకు ఒత్తిడి లేకుండా ఆడటమే విజయ రహస్యమని చెబుతోన్న టీమిండియా కెప్టెన్‌ ధోనీ, కలిసికట్టుగా రాణిస్తే విజయం తమదేనని చెబుతున్నాడు. చూద్దాం.. మార్చ్‌ 26న ఆసీస్‌, టీమిండియా జట్ల మధ్య జరిగే మ్యాచ్‌లో ఎవరు గెలిచి, ఫైనల్‌ పోరుకు అర్హత సాధిస్తారో.!