2024 పార్లమెంటు ఎన్నికలలో బిజెపికి తగిలిన జాక్‌పాట్ ఒడిశా! నవీన్ బతికున్నంత కాలం అక్కడ రాష్ట్రంలో బిజెడిని, కేంద్రంలో బిజెపిని జనం గెలిపిస్తూ పోతారని విశ్లేషకులందరూ డిసైడై పోయి, పెద్దగా విశ్లేషణలు చేయలేదు. పలు ప్రీ పోల్ సర్వేలు కూడా బిజెడికి కనీసం 11 పార్లమెంటు సీట్లు వస్తాయని చెప్పాయి. ఇక అసెంబ్లీ సంగతి చూడబోతే యాక్సిస్ మై ఇండియా బిజెడికి, బిజెపికి సమానంగా 62-80 అని యిచ్చింది. టైమ్స్ నౌ బిజెడికి 100-115 అని యిచ్చింది. వాళ్లంతా ఫలితాలు చూశాక నాలిక కరుచుకుని ఉండాలి. ఎందుకంటే బిజెడికి అసెంబ్లీలో 51 స్థానాలు రాగా, పార్లమెంటులో ఒకటీ రాలేదు. నవీన్ స్థానంలో వచ్చే బిజెపి తరఫు ముఖ్యమంత్రి ఎవరో ఎవరికీ తెలియకపోయినా, ఎవర్నీ ప్రొజెక్టు చేయకపోయినా, ‘మాకు అవన్నీ అనవసరం, నవీన్ పట్నాయక్‌ను యింటికి పంపిస్తే అంతే చాలు’ అన్నట్లు ఒడియా ప్రజలు ఓటేశారు. ఈసారీ గెలిస్తే అత్యంత దీర్ఘకాలం ముఖ్యమంత్రిగా ఉండే రికార్డు బద్దలు కొట్టవలసిన నవీన్ 24 ఏళ్ల పాలనతో సరిపెట్టుకోవలసి వచ్చింది.
ఎన్నికలకు ముందు రాష్ట్రాల స్థితిగతుల గురించి పేపర్లలో, మ్యాగజైన్లలో వ్యాసాలు వస్తూనే ఉంటాయి. వాటిలో ఎవరూ నవీన్‌కు యింతటి ఘోరపరాజయానికి అర్హుడు అని రాయలేదు. అవినీతి ఆరోపణలు, ప్రతిపక్షాలపై కక్ష సాధింపులు, పార్టీ కార్యకర్తల దౌష్ట్యాలు.. యిలాటి వార్తలు ఏవీ చూడలేదు. ఒకప్పుడు ఒడిశా అంటే కాంగ్రెసుకి కంచుకోటగా ఉండేది. బిజూ పట్నాయక్ విడిగా వచ్చేశాక పోటాపోటీగా ఉండేది. నవీన్ రాజకీయాల్లోకి ప్రవేశించినప్పుడు బిజెపితో కలిసే సంకీర్ణ ప్రభుత్వం ఏర్పరచాడు. తర్వాత సిద్ధాంత విభేదాలంటూ విడిపోయాడు కానీ వైరం పాటించలేదు. బిజెపి కూడా అతని పట్ల ద్వేషం ప్రకటించలేదు. ఎన్నికల సమయంలో విమర్శలు ఎలాగూ తప్పవు కానీ మామూలు రోజుల్లో వ్యక్తిగత విమర్శలు కాదు కదా, రాజకీయ విమర్శలు కూడా పెద్దగా లేవు.
నవీన్ యుపిఏలోనూ (యిప్పుడు ఇండియాలోనూ), ఎన్డీఏలోనూ దేనిలోనూ చేరకుండా కాలక్షేపం చేస్తూ, ‘నా రాష్ట్రం బాగు తప్ప మరేదీ నాకు పట్టదు. ఇతర రాష్ట్రాలకు విస్తరించను, కేంద్రంలో చక్రం తిప్పే ప్రయత్నం చేయను, కేంద్రంలో అధికారంలో ఉన్నవాళ్లతో పేచీ పెట్టుకోను’ అనే ధోరణి కనబరిచాడు. తన వ్యక్తిగత అభిప్రాయాలు, సిద్ధాంతాల మాట ఎలా ఉన్నా, బిజెపి కేంద్రంలో చేస్తూ వచ్చిన వివాదాస్పద బిల్లులన్నిటికీ బేషరతుగా మద్దతిస్తూ వచ్చాడు. ఆంధ్రలో 25 ఎంపీలూ కేంద్రంలో బిజెపి జేబులో ఉన్నట్లు, ఒడిశాలో బిజెడి (13), బిజెపి (8) ఎంపీలు కేంద్ర బిజెపికే వశంలోనే ఉన్నారు. కేంద్రం కూడా బిజెడిని ఎన్నడూ అదిలించినది లేదు, బెదిరించినది లేదు. ప్రతిపక్ష నాయకులపై చెణుకులు విసిరే మోదీ నవీన్‌ను ఏమీ అనరు.
నవీన్ అధికారంలోకి వచ్చే ముందు ఒడిశా అంటే వెనకబాటుతనానికి ప్రతీకగా ఉండేది. ఆకలి చావులు, ప్రకృతి వైపరీత్యాలు, ఎటు చూసినా దారిద్ర్యం, గిరిజనుల కష్టాలు, మావోయిస్టు సమస్యలు, అవినీతి.. యిలా ఒడియా వాళ్లంటే, అయ్యో పాపం అన్నట్లు చూసేవారు. వాళ్లంతా చిన్నా చితకా ఉద్యోగాలకై పొరుగు రాష్ట్రాలకు వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడూ వెళుతున్నారు కానీ విద్యావంతులుగా, నైపుణ్యం ఉన్నవారిగా వెళుతున్నారు. డిజాస్టర్ మేనేజ్మెంట్లో నవీన్ నిజంగా అద్భుతమైన పనులు చేసి చూపించాడు. అతని పాలనలో అభివృద్ధి, సంక్షేమం రెండూ జరిగాయి. నవీన్ అమలు చేసిన సంక్షేమ పథకాలు ఎన్నెన్నో ఉన్నాయి. బిజూ స్వాస్థ్య కళ్యాణ్ యోజనా ద్వారా 4 కోట్ల మందికి ఆరోగ్యభాగ్యం కలిగింది. మిషన్ శక్తి ద్వారా 70 లక్షల మంది మహిళలకు, కలియా యోజనా ద్వారా 64 లక్షల మంది రైతులకు, మధుబాబు పెన్షన్ యోజనా ద్వారా వృద్ధులకు పెన్షన్… యిలా ఎన్నో ఉన్నాయి. అందుకే ప్రజల మన్ననలు పొందుతూ వచ్చాడు.
పరిపాలించడానికి అధికారులపై ఎక్కువగా ఆధారపడ్డాడన్న విమర్శ నవీన్‌పై ఎప్పుడూ ఉంది. బిజూ పట్నాయక్ వంటి కాకలు తీరిన రాజకీయ యోధుడికి కొడుకే అయినా, అతను రాజకీయాలను ఎప్పుడూ పట్టించుకోలేదు. తండ్రి మరణం తర్వాత రాజకీయాల్లోకి పేరాషూట్లో దిగినట్లు దిగాడు. కానీ రాజకీయాలు బాగానే వంట పట్టించుకున్నాడు. చాణక్యుణ్నని డప్పు వేసుకోకుండానే, తన కౌటిల్యంతో ప్రత్యర్థులను అణచివేశాడు. 24 ఏళ్లు ముఖ్యమంత్రిగా నిరాఘంటంగా ఉన్నాడంటే ప్రభుత్వ వ్యతిరేకత, ఆశ్రిత పక్షపాతం, కొందరు వ్యాపారవేత్తలతో లావాదేవీలు, అవినీతి ఆరోపణలు గుట్టలుగా పేరుకుని ఉండాలి. కానీ అలా జరగలేదు. అయినా నవీన్ ఓడిపోయాడు, ఘోరంగా ఓడిపోయాడు. బిజెపి అతన్ని యింటికి పంపించింది. ఎలా? అనేదే ఆసక్తికరం.
ఇతర కారణాలు కొన్ని ఉన్నా, పాండ్యన్ అనే అధికారిని బూచిగా చూపించి, ఒడియా అస్మిత (ఆత్మగౌరవం)ని నినాదంగా మారడం ముఖ్య కారణంగా చెప్పుకోక తప్పదు. బలహీనుడు, అశక్తుడు ఐన నవీన్ బాబు యీ మద్రాసీ అధికారికి పార్టీని, సింహాసనాన్ని అప్పగించి, ఒడియా వారి ఆత్మగౌరవానికి విఘాతం కల్పించాడన్న భావాన్ని మోదీతో సహా అందరు బిజెపి నాయకులూ కల్గించ గలిగారు. ఎన్టీయార్ రాజకీయాల్లోకి వచ్చినపుడు ఆంధ్రుల ఆత్మగౌరవం అనే నినాదం కత్తిలా పని చేసింది. కాంగ్రెసు తరచుగా ముఖ్యమంత్రులను మార్చడాన్ని, ఆంధ్రుల ఆత్మగౌరవానికి ముడి పెట్టాడు ఎన్టీయార్. పాత ముఖ్యమంత్రీ తెలుగువాడే, కొత్తవాడూ తెలుగువాడే, పైగా యిద్దరూ ఒకే పార్టీకి చెందినవారు. ఢిల్లీ ప్రభుత తన చిత్తానుసారం మార్చింది అనే పాయింటు ఒకటీ పట్టుకుని ఎన్టీయార్ ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని రెచ్చగొట్టగలిగాడంటే, మరి మన ఒడిశాలో ఎవడో మద్రాసీ వచ్చి మన నెత్తిన కూర్చుంటాడంటే ఒడియా వాళ్లు ఊరుకుంటారా?
ఇంతకీ ఎవరా మద్రాసీ? అతని పేరు వికె పాండ్యన్. తమిళనాడులోని మధురై జిల్లాకి చెందిన 1999లో ఐఆర్ఎస్కి, 2000లో ఐఏఎస్‌కు సెలక్టయ్యాడు. పంజాబ్ క్యాడర్‌కి సెలక్టయి, సాటి ఐఏఏస్ అధికారిణిని ప్రేమించి పెళ్లాడాడు. ఒడిశా క్యాడర్‌కు బదిలీ చేయించుకున్నాడు. ఒడియా రాయడం, చదవడం, మాట్లాడడం నేర్చుకున్నాడు. ఒడిశాను సొంత రాష్ట్రంగా ఫీలయ్యాడు. అక్కడే స్థిరపడ్డాడు. అప్పటికి నవీన్ ముఖ్యమంత్రి. అతని హయంలోనే యితను ఎదిగాడు. 2011 నుంచి ఆంతరంగికుడయ్యాడు. నవీన్ యితనికి అనేక ముఖ్యబాధ్యతలు అప్పగించాడు. అతని పథకాలను పక్కాగా అమలు పరిచాడని పాండ్యన్‌ను ఒడియా ప్రజలు, రాజకీయ నాయకులూ కూడా మెచ్చుకుంటూ వచ్చారు. ఉద్యోగానికి రాజీనామా చేసి 2023 నవంబరులో పార్టీలో చేరినప్పుడు కూడా ఎలాటి ప్రతిఘటనా లేదు.
పాండ్యన్ సామర్థ్యాన్ని ఎవరూ వంక పెట్టలేక పోయారు. ఎన్టీయార్ స్టయిల్లో అతను తెల్లవారు ఝామునే లేచి, సూర్యోదయానికి ముందే మీడియాకు బ్రీఫింగులు యిచ్చేవాడు. నవీన్ 5టి (ట్రాన్స్‌పరన్సీ-పారదర్శకత, టెక్నాలజీ, టీమ్‌వర్క్, టైమ్, ట్రాన్స్ఫర్మేషన్-మార్పు) గ్యారంటీలని ప్రకటించాడు. దానికో కమిటీ వేసి యితన్ని చైర్మన్‌గా చేశాడు. అస్వస్థుడైన నవీన్ స్థానంలో ఎన్నికల ప్రచార బాధ్యతలను చేపట్టి, అంతటా తనై తిరిగాడు. అది పార్టీ పెద్దలకు కన్నెర్ర అయింది. కాంగ్రెసు వాళ్లు, బిజెపి వాళ్లు అతన్ని ఔట్‌సైడర్ అన్నారు, బిజెడి వాళ్లు పైకి అనలేక లోపల అనుకున్నారు. దీనిపై పాండ్యన్‌ను అడిగినప్పుడు అతను ‘జాతీయ పార్టీలు అలాటి భాష మాట్లాడడం శోచనీయం. నేను భారతీయుణ్ని కానా? తమిళనాడు నా జన్మభూమి ఐతే ఒడిశా నా కర్మభూమి’ అన్నాడు.
పూరీ జగన్నాథ మందిరంలోని రత్నభాండారం తాళం చెవి కనబడకపోవడం గురించి ఒక వివాదం ఆరేళ్లగా నడుస్తోంది. నేను గతంలోనే దానిపై రాశాను. దానిపై కేంద్రం ఏ చర్యా తీసుకున్నట్లు లేదు కానీ ఎన్నికల వేళ మాత్రం బిజెపి దాన్ని అనువుగా వాడుకుంది. పాండ్యన్ పేరెత్తకుండానే మోదీ ‘రత్నభాండాగారం తాళం చెవి తమిళనాడుకి వెళ్లిపోయిందని ప్రజలంటున్నారు. తమిళనాడుకి పంపించిందెవరు? అలాటివాణ్ని క్షమిస్తారా? (పంపించేశారు అని మోదీ నిర్ధారణకు వచ్చినట్లుంది. లేకపోతే ‘ఒకవేళ అలా పంపించి ఉంటే, పంపించినవాణ్ని.. అని స్పష్టంగా అనేవారు)’ అని పబ్లిగ్గా అన్నారు. ఎన్నికల వేళ దారుణమైన ఆరోపణలు చేయడం, ఆ తర్వాత వాటిపై విచారణకు ఆదేశించక పోవడం మోదీకి అలవాటు. తనపై మన్మోహన్ హత్యాయత్నం చేశారని కూడా గతంలో ఆరోపించారు. తర్వాత దాని అతీగతీ లేదు. ఇప్పుడు ఒడిశా రాష్ట్రంలో, కేంద్రంలో అధికారంలోకి వచ్చారు కాబట్టి తన ఆరోపణపై తనే విచారణ జరిపించి, తమిళనాడుకి వెళ్లిందో, మరెక్కడికి వెళ్లిందో తేల్చాలి. రాజకీయ ప్రయోజనం సిద్ధించింది కాబట్టి, తన భాండారం సంగతి జగన్నాథుడే చూసుకుంటాడని ఊరుకున్నా ఊరుకోవచ్చు.
ప్రచార సందర్భంగా ఈ ఆరోపణ వచ్చినపుడు పాండ్యన్‌ను అడిగితే ‘ఇది హాస్యాస్పదం. గత 40 ఏళ్లగా భాండారం తెరవబడలేదని ప్రజలకు తెలుసు. ముఖ్యమంత్రి రిటైర్డ్ సుప్రీం కోర్టు జజ్ ఆధ్వర్యంలో కమిటీ వేశారు. కోర్టు ఆర్డర్ల ప్రకారమే డాక్యుమెంటేషన్ జరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం దీనిలో జోక్యం చేసుకోలేదు.’ అన్నాడు. జగన్నాథ మందిరం చుట్టూ హెరిటేజి కారిడార్ పేర రోడ్లు విశాలం చేసి, రాకపోకలకు, దర్శనానికి మంచి ఏర్పాట్లు చేద్దామని ప్రయత్నించడం బిజెడికి శాపమైంది. అదేమిటో అయోధ్య మందిరం అద్భుతంగా కడితే అక్కడ బిజెపి ఓడిపోయింది. వారణాశిలో విశ్వేశ్వరుడి మందిరం చుట్టూ బాగా విశాలం చేసి గంగా నది నుంచి విశాలమైన రోడ్డు వేస్తే మోదీకి గతంలో కంటె 3 లక్షల ఓట్లు తక్కువ మెజారిటీ వచ్చింది. మొదటి రెండు రౌండ్లలో వెనకబడ్డారు కూడా. ఇక్కడ పూరీ, భువనేశ్వర్లలో బిజెడి ఓడిపోయి, బిజెపి గెలిచింది.
నవీన్ వద్దనుకుంటే ఒడియా ప్రజలు కాంగ్రెసును ఎంచుకోవచ్చు. కానీ బిజెపిని ఎందుకు ఎంచుకున్నారు? ఎందుకంటే బిజెపితో కలిసి చాలాకాలం ప్రయాణించడం ద్వారా నవీన్ దానికి యాక్సెప్టన్స్ పెంచాడు. 2000 నుంచి 2008 వరకు బిజెడి బిజెపి కలిసి రాష్ట్రాన్ని ఏలాయి. 2017 పంచాయితీ ఎన్నికలలో కాంగ్రెసు కంటె ఎక్కువ సీట్లు తెచ్చుకుని బిజెపి ప్రధాన ప్రతిపక్షంగా మారింది. ఈ 2024 ఎన్నికలకు ముందు కూడా రెండు పార్టీలు కలిసి పోటీ చేద్దామా అని చర్చలు జరిపాయి. చివరకు సీట్ల పంపకం దగ్గర పేచీ వచ్చి మార్చి నెలాఖరులోనే బిజెపి ఒంటరిగా పోటీ చేస్తానని ప్రకటించింది. అది బిజెపికి అత్యంత లాభదాయకంగా, బిజెడికి అత్యంత నష్టదాయకంగా పరిణమించింది. బిజెపి భారీ ఎత్తున యుద్ధం చేసింది. అనేకమంది నేతలు వందలాది సభలు నిర్వహించారు.
ఇటు నవీన్‌కు తిరిగే ఓపిక, మాట్లాడే ఓపిక లేదు. 10 ని.లకు మించి ఎక్కడా ప్రసంగించ లేదు. ఓ బస్సు ఎక్కి, కిటికీలోంచి చేతులు ఊపాడు. ఆ చేతులు కూడా వణుకుతున్నాయని మోదీ వెక్కిరించాడు. నా చేతుల సంగతెందుకు, చేతల సంగతి చూడండి అని నవీన్ జవాబిచ్చినా, అతను అంపశయ్య మీద ఉండి రోజులు లెక్కపెడుతున్నాడనే భావన ఓటర్లకు కలిగింది. 77 ఏళ్ల నవీన్ బాబు ఆరోగ్యం క్షీణింపచేయడానికి 49 ఏళ్ల పాండ్యన్ ఏదో చేశాడని కూడా ప్రచారం సాగింది. పాత సినిమాల్లో కుంటి రాజుపై విషప్రయోగం చేసో, మందు పెట్టో తన గుప్పిట్లో పెట్టుకున్న దుష్ట సేనాపతిని ప్రేక్షకులు ఎలా ద్వేషించేవారో అలా ఒడియా వారు పాండ్యన్‌ను ద్వేషించేట్లా చేయగలిగింది బిజెపి.
వీళ్లేమి చెప్పినా ప్రజలు తననే ఆదరిస్తారనే పిచ్చి భ్రమలో పడి నవీన్ దిద్దుబాటు చర్యలు తీసుకోలేదు. తన వారసుడు పాండ్యన్ కాదని ప్రకటనలు చేయలేదు. పాండ్యన్‌పై బిజెడి నాయకులు కూడా అసంతృప్తిగా ఉన్నారు. నవీన్ దగ్గరకు తమను వెళ్లనివ్వ లేదని, నవీన్ అండ చేసుకుని ఎవరి మాటా వినకుండా, తన చిత్తం వచ్చినట్లు చేశాడని, పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం లేదని, తమ అభిప్రాయాలు వెలిబుచ్చే వాతావరణం లేదని ఆరోపిస్తూ అనేక మంది బిజెడి నాయకులు బిజెపికి ఫిరాయించారు. పాండ్యన్ సామర్థ్యాన్ని ప్రజలు కూడా మెచ్చుకున్నారు. కానీ అతన్ని కాబోయే ముఖ్యమంత్రిగా మాత్రం అంగీకరించలేక పోయారు.
దానికి తోడు పాండ్యన్ ప్రచార బాధ్యతంతా నెత్తి మీద వేసుకున్నాడు. ఎక్కడ చూసినా అతనే కనబడ్డాడు. వెనక్కాల వుండి చక్రం తిప్పితే అదో దారి. హెలికాప్టర్ వేసుకుని ప్రతీ ఊరూ అతనే తిరిగి, రోజుకి 3, 4 ర్యాలీలు నిర్వహించి, ఒడియా వచ్చు కదాని స్పీచులు దంచేశాడు. దాంతో ప్రజలకు మరీ భయం వేసింది. పక్కనున్న బెంగాల్లో తృణమూల్ బిజెపిని ‘బయటివాళ్ల పార్టీ’ అంటే బెంగాలీలు అవునుస్మీ అనుకున్నారు. ఇక్కడ అదే తరహా నినాదంతో పాండ్యన్‌ను బూచిగా ఒడియా ప్రజలను బిజెపి నమ్మించగలిగింది. నవీన్ సంగతి చూస్తే బహిరంగ సభా వేదికలెక్కి ‘నేను ఫస్ట్ క్లాస్‌గా ఉన్నాను, నాకెవరూ మందూమాకూ పెట్టలేదు. ఐ యామ్ యిన్ కమాండ్’ అని చెప్పే పరిస్థితి లేదు. ఏదైనా ప్రకటన విడుదల చేసినా, పాండ్యనే దాన్ని రాసి బలవంతంగా సంతకం పెట్టించాడేమోనని అనుమానించే పరిస్థితి వచ్చింది.
ఈసారి అధికారం మాదే అని బిజెపి చెప్తున్న దాన్ని ఎద్దేవా చేయడానికి ‘పగటి కలలు కనడం వాళ్ల అలవాటు’ అనే సందేశంతో వీడియో చేసి ప్రజల్లోకి వదిలాడు నవీన్. దాని నిడివి ఎంతో తెలుసా? 10 సెకన్లు. అంతకు మించి మాట్లాడే ఓపిక లేదన్నమాట అనుకోరూ!? అందుకే కాబోలు నవీన్ రెండు చోట్ల పోటీ చేస్తే కాంతాబంజి స్థానంలో 16 వేల ఓట్ల తేడాతో ఓడిపోయాడు. 26 ఏళ్లలో అతను ఓడిపోవడం యిదే ప్రథమం, అదీ ఐదు సార్లు ముఖ్యమంత్రిగా చేసి! హింజిలిలో గెలిచినా కేవలం 4600 ఓట్ల మెజారిటీతో మాత్రమే! గత మూడు అసెంబ్లీ ఎన్నికలలో బిజెడికి 100కు తక్కువ సీట్లు ఎప్పుడూ రాలేదు. 2019లో అయితే 113 వచ్చాయి. బిజెపికి వచ్చింది 23 మాత్రమే! ఇప్పుడు ఒక్కసారిగా అధికారంలోకి వచ్చేసింది.
ఓటర్లు పార్లమెంటుకి ఒకలా, అసెంబ్లీకి మరొకలా ఓటేశారు. అసెంబ్లీకి వచ్చేసరికి బిజెపి కంటె బిజెడికే 0.15% ఎక్కువ ఓట్లు వేశారు. బిజెడికి 40.22% (2019లో 44.7%) వస్తే బిజెపికి 40.07% (2019లో 32.4%) వచ్చాయి. అయితే యీ ఓట్లు సీట్లగా కన్వర్ట్ అయ్యేసరికి తేడా కొట్టేసింది. మొత్తం 147 సీట్లలో బిజెపికి 78 (సింపుల్ మెజారిటీకి 74 చాలు) రాగా, బిజెడికి 51 వచ్చాయి. కాంగ్రెసుకు 14, సిపిఎంకు 1, స్వతంత్రులకు 3 వచ్చాయి. అంటే బిజెడి కొన్ని ప్రాంతాల్లో బలంగా ఉండి ఎక్కువ ఓట్లు తెచ్చుకుందన్నమాట. ఇక పార్లమెంటు విషయానికి వస్తే బిజెడికి వేసినా, ఎటు తిరిగి బిజెపికి మద్దతిస్తారు కదా, ఆ మాత్రానికి బిజెపికే డైరక్టుగా ఓటేస్తే పోలేదా అనుకున్నారేమో, బిజెపికి 45.4% (గతంలో కంటె 5.3% ఎక్కువ) వేశారు.
బిజెడికి గతంలో కంటె 2.8% తక్కువగా 37.5% వేశారు. ఓట్ల తేడా 7.7% మాత్రమే అయినా, బిజెపికి 20 సీట్లు వస్తే బిజెడికి 0 వచ్చాయి. 12.5% ఓట్లు తెచ్చుకున్న కాంగ్రెసు కోరాపుట్ సీటు గెలుచుకుంది. ఒడిశాలో మొత్తం 21 ఎంపీ సీట్లున్నాయి. బిజెపికి 20(2014లో 01- 2019లో 08), బిజెడి 0(2014లో 20- 2019లో 13), కాంగ్రెస్ 1(2014లో 0-2019లో 0) సీట్లు వచ్చాయి యీసారి. పదేళ్లలో బిజెడి 20 నుంచి 0కి పడిపోగా, బిజెపి 1 నుంచి 20కి ఎగబాకింది. అదీ బిజెపి సాధించిన ఘనవిజయం. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో అది ఓట్లు గెలుచుకోగలిగింది. చిత్రం ఏమిటంటే రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు మన్మోహన్ సమాల్ ఓడిపోయాడు.
2019 ఎన్నికలలో బిజెపి అర్బన్ ప్రాంతాల్లో బాగా గెలవగా, బిజెడి గ్రామీణ ప్రాంతాల్లో బాగా గెలిచింది. ఈసారి బిజెడికి అర్బన్ ప్రాంతాల్లో బలం పెరిగి 46% ఓట్లు పొందగలిగింది కానీ గ్రామీణ ప్రాంతాల్లో బిజెపిది పైచేయి అయింది. నిజానికి నవీన్ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నవారికై ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశాడు. వ్యవసాయంపై ఆధారపడిన రాష్ట్రం కాబట్టి వ్యవసాయానికి ఎంతో చేశాడు. కానీ క్వింటాల్ వరికి రూ.3100 యిస్తానన్న బిజెపి హామీ రైతులను అటు మొగ్గేట్లు చేసింది. లోకనీతి సర్వే ప్రకారం నవీన్ బాగా దెబ్బ తినేసింది మహిళా ఓటర్ల విషయంలో! మహిళలకు అతను ఎంతో చేశాడు. వాళ్లెప్పుడూ అతనికి అండగా నిలిచారు. కానీ యీసారి బిజెడికి 39% మహిళా ఓట్లు పడగా బిజెపికి 47% పడ్డాయి.
కులాల వారీగా చూస్తే లోకనీతి సర్వే చెప్పిన దాని ప్రకారం అగ్రకులాలు, బిసిలలో పై స్థాయి వారు బిజెపిని ఎక్కువగా సమర్థించారు. క్రింది స్థాయి బిసిలు బిజెపి, బిజెడిల మధ్య సమంగా చీలిపోయారు. (చెరో 48%). ఈ ఓటమిని ఊహించిన చాలామంది బిజెడి నాయకులు బిజెపికి ఫిరాయించారు. దాంతో బిజెపికి ఒంటరి పోరే మేలు అనే ధైర్యం వచ్చింది. ఈ ఓటమి తర్వాత కూడా నవీన్‌ను తిట్టేవాళ్లు కనబడటం లేదు. తీవ్రంగా అనారోగ్యం పాలయ్యాడు కాబట్టి, అతనితో అవసరం తీరిపోయింది కాబట్టి దింపేశాం అన్నట్లుగానే ప్రజలు ప్రవర్తిస్తున్నారు. కానీ పాండ్యన్‌కు మాత్రం దోషిగా నిలబడ్డాడు. అతని భుజంపై తుపాకీ పెట్టి మోదీ నవీన్‌ను కూలగొట్టడంతో, పార్టీ నాయకులు, నవీన్ అభిమానులు పాండ్యన్‌పై భగ్గుమన్నారు. తన కారణంగా నవీన్‌కు హాని కలగడం, తనపై తిరుగుబాటు చూశాక కృంగిపోయిన పాండ్యన్ ఫలితాలు వచ్చిన ఐదురోజుల్లో రాజకీయాలకు స్వస్తి పలికాడు. తను అనేక ఆస్తులు పోగేసుకున్నాడన్న ఆరోపణకు స్పందిస్తూ ’24 ఏళ్ల సర్వీసు తర్వాత కూడా నా ఆస్తులేవీ పెరగలేదు. నాకు యిప్పటికీ ఉన్న ఆస్తి మా తాత నుంచి సంక్రమించినదే’ అన్నాడు. కానీ వినేవారెవరు?
ఉత్తరం, పశ్చిమం దెబ్బ తీసిన క్లిష్ట సమయంలో బిజెపికి తూర్పున ఉన్న ఒడిశా అండగా నిలబడిందన్న విషయాన్ని మోదీ గుర్తించారు కాబట్టే విజయోత్సవ సభలో జై శ్రీరామ్‌కు బదులు జై జగన్నాథ్ అని స్మరించారు. అయోధ్య రాముడు అక్కరకు రాలేదు, విష్ణువు మరో అవతారం జగన్నాథుడే కాపు కాశాడు. ఒడిశాకు కృతజ్ఞత ఎలా తెలుపుకుంటారో వేచి చూడాలి. రత్న భాండారాన్ని సంరక్షిస్తారనీ, హెరిటేజ్ కారిడార్‌ను పూర్తి చేస్తారని ఆశిద్దాం. 14న రత్నభాండారం తెరుస్తారని వార్త వచ్చింది. అన్ని గదులూ తెరుస్తారా, లేదా, తాళం చెవి దొరికిందా? దొరికితే ఎక్కడ దొరికింది? తమిళనాడులోనా? మరో చోటా? ప్రస్తుతానికి ఏమీ తెలియదు.
– ఎమ్బీయస్ ప్రసాద్ (జులై 2024)