ఉత్తరాంధ్రలో అత్యంత కీలకమైన ప్రాజెక్ట్ భోగాపురం ఇంటర్నేషనల్ గ్రీన్ ఎయిర్ పోర్టు పూర్తికి గడువుని కొత్త ప్రభుత్వం ప్రకటించింది. 2026 నాటికి ఈ ప్రాజెక్టు పూర్తి అవుతుందని ఉత్తరాంధ్రకే చెందిన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రకటించారు.
ఈ ఎయిర్ పోర్టుకి గత ఏడాది ఏప్రిల్ లో శంకుస్థాపన చేసిన నాటి సీఎం జగన్ 2025 నాటికి పూర్తి అవుతుందని అదే సభలో ప్రకటించారు. ఇపుడు మరో ఏడాది ఆలస్యం అవుతుందని అంటున్నారు. ఈ విమానాశ్రయం పూర్తయితే ప్రత్యక్షంగా పరోక్షంగా ఉత్తరాంధ్ర వాసులకు ఆరు లక్షల మందికి ఉపాధి లభిస్తుందని ఆశిస్తున్నారు. దీని వల్ల విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల నుంచి ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్లే పరిస్థితి ఉండదన్నది అంతా ఆశపడుతున్నారు. ఈ విమానాశ్రయం నిర్మాణం కోసం భూములు ఇచ్చిన వారికి సైతం ఉపాధిలో ప్రాధాన్యత ఉంటుందని ఆశిస్తున్నారు.
ఈ విమానాశ్రయం పూర్తయితే మొదటి సంవత్సరంలోనే 50 లక్షల మంది వినియోగిస్తారని అంచనా వేస్తున్నారు. 3.8 కిలోమీటర్ల రన్‌వే, 60 లక్షల మంది వినియోగించుకునేలా టెర్నినల్ ఉంటుంది. సీఎం అయ్యాక తొలిసారి విశాఖ వస్తున్న చంద్రబాబు విమానాశ్రయ పనులను సమీక్షిస్తారు అని అంటున్నారు. సీఎం దీని మీద ఏమి మాట్లాడుతారో చూడాలి.
భోగాపురం ఎయిర్ పోర్టుకు ఇప్పటికి రెండు సార్లు శంకుస్థాపన జరిగింది. ఇద్దరు సీఎంలు దానిని పూర్తి చేశారు. గడువు కూడా రెండు సార్లు మారింది. 2026 నాటికి అయినా పూర్తి అయితే ఉత్తరాంధ్ర జాతకం మారినట్లే అని అంటున్నారు.