శ్రీకాకుళం జిల్లా పలాసలో మాజీ మంత్రి వైసీపీ నేత సీదరి అప్పలరాజు మీద అదే నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన గౌతు శిరీష న్యాయ పోరాటానికి దిగారు. ఆమె ఈ మేరకు విశాఖ కోర్టులో దావా వేశారు. సీదరి అప్పలరాజు మంత్రిగా ఉన్నపుడు ఇరవై మందిని ప్రత్యేకంగా పెట్టి మరీ తనపైనా తన తండ్రి పైనా అసభ్యంగా మాట్లాడించారని ఆమె ఆరోపించారు.
అందుకే తాను ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నాను అన్నారు. గత ఐదేళ్ళలో సోషల్ మీడియా వేదికగా టీడీపీ నుంచి పోరాటం చేసిన మహిళల మీద అసభ్యంగా పోస్టింగులు పెట్టి వారిని దారుణంగా అవమానించారని శిరీష అన్నారు.
వారు ఎవరైనా కఠిన చర్యలు ఉండాలని అన్నారు. అందుకే తాను కోర్టుని ఆశ్రయించాను అని గౌతు శిరీష చెబుతున్నారు. రాజకీయంగా విమర్శలు అరోగ్యకరంగా కాకుండా దిగజారి చేసిన వారి మీద చర్యలు ఉండాలని ఆమె అంటున్నారు.
తప్పుడు రాతలతో పోస్టింగులతో ఇబ్బంది పెట్టిన వారి మీద చట్టం కఠినంగా వ్యవహరించకపోతే హద్దు లేకుండా పోతుందని ఆమె అన్నారు. ఈ పోరాటం అందుకే ఆరంభించాను అని అన్నారు. ఆమె పోరాటం మంచిదే.
ఇక్కడ ఒక రాజకీయ పార్టీ అని కాదు, వాటి వెనక అభిమానులు అంతా కలసి చాలా అసభ్యంగా పోస్టింగులు పెడుతూ వచ్చారు. అలా అన్ని పార్టీలలోని వారూ ఇబ్బంది పడ్డారని అంతా అంటున్నారు. అందువల్ల పార్టీలకు రాజకీయాలకు అతీతంగా అందరి మీద చర్యలు తీసుకుంటే సమాజంలో భయం వస్తుంది, అపుడు ఆరోగ్యవంతమైన రాజకీయాన్ని కూడా ఆశించవచ్చు అన్నది మేధావుల సూచన.