రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులలో ఎవరైనా సరే స్పందించి తగు చర్యలు తీసుకోదగిన సమస్య తెరమీదకు వచ్చినప్పుడు.. ఒకేసారి ఇద్దరి దృష్టికి వచ్చినప్పుడు.. ఎవరు ముందుగా స్పందిస్తారు.. చర్యలు తీసుకుంటారు.. తమలోని కార్యకుశలతను నిరూపించుకుంటారు.. అనేది ఖచ్చితంగా చర్చనీయాంశమే.
ఈ కోణంలోంచి చూసినప్పుడు.. పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రి అనుభవం కూడా కలిగి ఉన్న, నలభై నాలుగేళ్ల రాజకీయ భీష్ముడు చంద్రబాబునాయుడు.. ఫస్ట్ టైం సీఎం అయిన రేవంత్ రెడ్డిని చూసి నేర్చుకోవాల్సింది ఇంకా ఏమైనా ఉన్నదేమో అనే అభిప్రాయం ప్రజలకు కలుగుతోంది. అవును ఒక సంఘస్పృహ ఉన్న సమస్య తన దృష్టికి రాగానే.. పోలీసులను రంగంలోకి దింపి.. దాని సంగతి తేల్చేశారు రేవంత్ రెడ్డి. ఆయనతో పాటు ఏకకాలంలో చంద్రబాబుకు కూడా ఆ సమస్య నివేదించుకున్నారు గానీ.. అతీగతీ లేదు.
వివరాల్లోకి వెళితే.. స్నేహితులతో వీడియో చాటింగ్ చేస్తూ యూట్యూబర్ ప్రణీత్ హనుమంతు అసభ్యకర మాటలతో రెచ్చిపోయిన వైనం కొన్ని రోజులుగా మీడియాల్ హల్ చల్ చేస్తోంది. తండ్రీ కూతుళ్ల బంధం గురించి ఈ యూట్యూబర్ ప్రణీత్.. విచక్షణ మరచి అశ్లీలం ధ్వనించేలా మాట్లాడాడు. అసభ్యంగా తన మిత్రులతో చిట్ చాట్ చేశాడు. ఈ వీడియోలు సామాజిక మాధ్యమాల్లోకి వచ్చాయి. వీటిపై సినీనటుడు సాయిదుర్గ తేజ్ ఎక్స్ వేదికగా స్పందించారు.
ఇలాంటి వారిని కట్టడి చేయడానికి చర్యలు తీసుకోవాలంటూ.. తెలుగురాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడులను ట్యాగ్ చేశారు. ఈ యూట్యూబర్ మాటలు చాలా వివాదాస్పదం అయ్యాయి. నటుడు మంచు మనోజ్ కూడా ఎక్స్ వేదికగా ఇతనికి వార్నింగ్ ఇచ్చాడు. ‘అమ్మతోడు నిన్నొదల’ అంటూ హెచ్చరించాడు.
అయితే.. చంద్రబాబునాయుడు పేషీ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. కానీ.. రేవంత్ రెడ్డి స్పందించి.. పోలీసుల్ని పురమాయించారు. వాళ్లు హుటాహుటిన ఆ యూట్యూబర్ వివరాలు ఆరాతీసి బెంగుళూరు వెళ్లి అక్కడ అరెస్టు చేశారు. పోక్సో సహా పలు సెక్షన్ల కింద కేసులు పెట్టారు. హైదరాబాదుకు తరలించారు.
ఇక్కడ పాయింట్ ఏంటంటే.. చంద్రబాబు నాయుడు తనకు ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులకు వెంటనే రెస్పాండ్ అయి ఉంటే.. ఇవాళ ఆ కీర్తి చంద్రబాబుకే వచ్చేది. ఇలాంటి మంచి పనులు చేయడం ఎలాగో.. రేవంత్ ను చూసి చంద్రబాబు నేర్చుకుంటే బాగుంటుందని ప్రజలు అంటున్నారు.