వేట‌గాడు నిద్ర‌పోడు

అదృష్టం అంటే నీ ఎదుటి వాడికి డ్రైవింగ్ తెలిసి వుండ‌డం. వాడి కాలి కింద ఉన్న బ్రేక్, నీ జాత‌కాన్ని శాసిస్తుంది.

ఏదీ స‌ర‌ళంగా వుండ‌దు. ఇసిజి స‌ర‌ళ రేఖ‌గా మారితే ఆట అయిపోయింద‌ని అర్థం. ప్ర‌పంచం ఒక పెద్ద గాలం. ఆశ ప‌డితే చిక్కుకుంటాం. తాబేలుకి త‌న నిదానం గురించి తెలియ‌దు. దాని డిక్ష‌న‌రీలో వేగం అనే ప‌దం లేదు. ర‌క్త‌పాతం గురించి క‌త్తి మాట్లాడ‌కూడ‌దు. పేద‌రికం గురించి నాయ‌కులు మాట్లాడ‌కూడ‌దు.

ప్ర‌తి శిశువు బ‌త‌క‌డానికి ఈ భూమ్మీదకి వ‌స్తాడు. పోటీ ప‌డ‌డానికి కాదు. జ‌ల్లిక‌ట్టు ఎద్దులుగా మార్చాల‌ని త‌ల్లిదండ్రుల ఆశ‌యం. జీవితంలో వ‌చ్చే ప‌రీక్ష‌ల‌కి ప్ర‌శ్నాప‌త్రాలుండ‌వు.

మ‌ట్టి నుంచే అన్నీ వ‌స్తాయి, వెళ్తాయి. మ‌ట్టి ప‌రిమ‌ళంతో తిరిగే రైతు ఒక సుగంధ వృక్షం. నాగ‌లి మీద ప్ర‌పంచాన్ని మోసే అట్లాస్ , భూమి అత‌ని అక్ష‌య‌పాత్ర‌. అన్నం తినాల్సిన రైతు, పురుగుల మందు తింటున్నాడు. అనాగ‌రిక‌త అంటే ఇదే.

కదిలే కాలం, పారే న‌ది ఎవ‌రి కోసం ఆగ‌వు. ప్ర‌తివాడికీ ఒక వేదిక వుంది. న‌ట‌న నీ ఇష్టం. న‌టుడు నువ్వే, ప్రేక్ష‌కుడు నువ్వే. నీ క‌ల‌లో నువ్వు క‌న‌ప‌డ‌వు.

జీవితంలో పాములే నిచ్చెన‌లు. జాగ్ర‌త్త‌గా తోక ప‌ట్టుకుని ఎగ‌బాకాలి. నీ కాటుకి పామే భ‌య‌ప‌డాలి. స‌ర్పాల‌కి ఏడు త‌ల‌లు వుంటాయో, లేదో తెలియ‌దు. మ‌నుషుల‌కి మాత్రం కొత్త త‌ల‌లు మొలుస్తున్నాయి. ఒకే మ‌నిషి , ముఖాలు చాలా.

అబ‌ద్ధాలు చెబుతూ వుండు. అవే నిజాలుగా ప‌రావ‌ర్త‌నం చెందుతాయి. శుద్ధ స‌త్యం కోటింగ్‌ల మ‌ధ్య చిక్కుకుంది.

సూర్య‌చంద్రులు నీ కోసం, నా కోసం రారు. ప‌సిపిల్ల‌ల న‌వ్వులు చూడ‌డానికి వ‌స్తారు. మ‌న‌కీ ప్ర‌పంచం అర్థం కాలేదంటే, మ‌న‌మే ఈ ప్ర‌పంచానికి అర్థం కాలేద‌ని.

వాయులీనం తీగ‌ల‌పై సంగీతం జారుతుంది. ఒక గుడి భిక్ష‌గాడి క‌న్నీళ్లేమో! వెదురు పాడుతుంద‌ని క‌నిపెట్టిన వాడికి సాష్టాంగ న‌మ‌స్కారం. విషాదం నుంచే అస‌లైన వినోదం పుడుతుంది. పులిని ఆడిస్తున్న వాడికి తెలుసు, మృత్యువు త‌న పొలిమేర‌ల్లో త‌చ్చాడుతూ వుంద‌ని.

న‌దిని దాటే వాడు మొస‌లికి భ‌య‌ప‌డ కూడ‌దు. వేట‌గాడు నిద్ర‌పోడు. ఒక‌ప్పుడు ల‌క్ష‌ల మందిని అబ్బుర‌ప‌రిచిన సినిమా ప్రొజ‌క్ట‌ర్ ఇపుడు పాత వ‌స్తువు. నువ్వెంత గొప్ప వాడివైనా కాలం గడిస్తే ఎవ‌రికీ ప‌ట్ట‌ని అనామ‌కుడివే. శ‌వపేటిక సిద్ధం చేసుకో.

మెరుపు మెరిస్తే సంబ‌ర‌ప‌డ‌కు. దాని వెంట పిడుగు ఎదురు చూస్తూ వుంటుంది. చినుకులు క‌లిసిక‌ట్టుగా వ‌స్తే తుపాను.

పులుల‌న్నీ క‌లిసి మేక‌ల్ని కాపాడుతామ‌ని ప్ర‌మాణం చేస్తున్నాయి. మేక‌లు న‌మ్మి న‌డుస్తున్నాయి. త‌ల‌లు మాయ‌మ‌వుతున్నాయ‌ని తెలుసుకోలేవు. మేక‌ల‌న్నీ క‌లిసి పులిని బ‌లిచ్చిన‌పుడు క‌దా చ‌రిత్ర మారేది.

బ‌లిపీఠానికి చాలా క‌థ‌లు తెలుసు. ర‌క్త న‌దుల ర‌హ‌స్యం తెలుసు. నోరు విప్ప‌దు. విప్పితే అదే నాగ‌రిక‌త మ‌ర్మం. గిలెటిన్ కింద తెగిన త‌ల మాట్లాడితే ఫ్రెంచి మ‌హాకావ్యాలు మాయ‌మైపోతాయి.

క‌త్తులు ప‌దును పెడుతున్న‌పుడు రాలిన ఇనుప ర‌జ‌ను కింద క‌నిపించ‌కుండా పోయిన కంకాళాలు ఎన్నో.

చ‌క్ర‌వ‌ర్తి వెంట సైనికుడు వుంటాడు. సైనికుడి వెనుక ఆక‌లి, భార్యాబిడ్డ‌లుంటారు. అంద‌రూ ఆడేది చద‌రంగ‌మే, ర‌ణ‌రంగ‌మే. కొంద‌రు ఆడిస్తారు, కొంద‌రు ఆడుతారు. ఆట ముగిసాక పెట్టెలో చేరి క‌బుర్లు చెప్పుకుంటారు.

ఒక చిన్న పిట్ట‌కి త‌న‌కెంతో కావాలో తెలుసు. మ‌నిషికే తెలియ‌దు. అర‌చేతి గీత‌లు అదృష్టాన్ని మార్చ‌లేవు. అదృష్టం అంటే నీ ఎదుటి వాడికి డ్రైవింగ్ తెలిసి వుండ‌డం. వాడి కాలి కింద ఉన్న బ్రేక్, నీ జాత‌కాన్ని శాసిస్తుంది.

జీఆర్ మ‌హ‌ర్షి

8 Replies to “వేట‌గాడు నిద్ర‌పోడు”

  1. pennu kemi telusu adi yedi rasthado ?

    makemu telusu nuvvu yemi rasavo,

    avukemi telusu adi yentha palisthado ?

    dooda kemi telusu danikenni palu vuntato

    padu prapancham navvindi

    jagan matram yedusthunnadu

  2. ఒక చిన్న చీమ సప్తసముద్రాలు తాగేసింది , ఒక దోమ అంతరిక్షం లో కొన్ని కోట్ల కోట్ల కాంతి సంవత్సరాల దూరాన్ని సెకనులో పదోవంతు సమయంలో పది వొందల సార్లు చుట్టింది …ఒక మిణుగురు పురుగు సూర్యుడిని అలాంటి billions of నక్షత్రాలని ప్రజ్వరిల్లేలా చేసింది

    స్ఫూర్తి : అబ‌ద్ధాలు చెబుతూ వుండు. అవే నిజాలుగా ప‌రావ‌ర్త‌నం చెందుతాయి. శుద్ధ స‌త్యం కోటింగ్‌ల మ‌ధ్య చిక్కుకుంది

Comments are closed.