కెవి: డిజాస్టర్లు – ఎన్‌జిఓలు

విపత్తులు వస్తూనే ఉంటాయి. కొన్ని ప్రకృతి వైపరీత్యాలు. కొన్ని మానవ తప్పిదాలు. సామాన్యంగా పొరుగువాణ్ని పట్టించుకోని జనాలు కూడా ప్రమాదాలు, విపత్తులు వచ్చినపుడు సహాయం చేయడానికి ముందుకు వస్తూంటారు. అలా ముందుకు వచ్చేవారందరికీ సాయం…

విపత్తులు వస్తూనే ఉంటాయి. కొన్ని ప్రకృతి వైపరీత్యాలు. కొన్ని మానవ తప్పిదాలు. సామాన్యంగా పొరుగువాణ్ని పట్టించుకోని జనాలు కూడా ప్రమాదాలు, విపత్తులు వచ్చినపుడు సహాయం చేయడానికి ముందుకు వస్తూంటారు. అలా ముందుకు వచ్చేవారందరికీ సాయం చేసే విషయంలో నైపుణ్యం, చాకచక్యం ఉంటాయని గ్యారంటీ లేదు. ఎవరికి వారే వారికి తోచినది చేయబోతే, శ్రమ వృథా కావడమే కాక, ఒక్కోప్పుడు వికటించవచ్చు కూడా. అందుకని కొన్ని సామాజిక సంస్థలు, సేవా సంస్థలు తమ సభ్యులను వీటిలో తర్ఫీదు యిచ్చి పెట్టుకుంటాయి. సేవాభావంతో పాటు గత విపత్తులలో పని చేసిన అనుభవం కూడా వీరికి ఉంటుంది. ఎలాటి విపత్తు వచ్చినా రామకృష్ణ మిషన్ వంటి అనేక సంస్థలు సహాయ కార్యక్రమాల్లో పాలు పంచుకున్నట్లు పత్రికల్లో చదువుతూ ఉంటాం, టీవీల్లో చూస్తూ ఉంటాం.

గత నెలలో రెండు తెలుగు రాష్ట్రాలలో వరదలు వచ్చాయి. ముంపు ప్రాంతాలను ముఖ్యమంత్రులు, మంత్రులు పర్యటించిన ఫోటోలు వచ్చాయి తప్ప, సేవా సంస్థల భాగస్వామ్యం గురించి మీడియాలో ఎక్కడా చూడలేదు. వారు ముందుకు రాలేదా, వచ్చినా మీడియా కవరేజి యివ్వలేదా అన్నది నాకు తెలియదు. ముఖ్యమంత్రులు వారి సేవల గురించి ప్రస్తుతించిన లేదా ప్రస్తావించిన వార్తలూ దాఖలాలు నా వరకూ రాలేదు. వరదబాధితులకు ఫలానా వారు యింత విరాళం యిచ్చారు వంటి వార్తలు, నిధులడిగినా కేంద్రం తగినంత విడుదల చేయటం లేదని ఫిర్యాదు చేసిన వార్తలూ మాత్రమే మనం విన్నాం, తప్ప ఫలానా ప్రజాహిత సంస్థ ఫలానా ప్రాంతాల్లోని బాధితులకు సేవలందించింది వంటి వార్తలు నాకు వినబడలేదు. ప్రభుత్వాలు వాటిని సత్కరించిన సందర్భాలూ నా దృష్టికి రాలేదు. మీడియాలో అస్సలు రాలేదని నేను అనలేను కానీ, తగినంత ప్రాముఖ్యత యివ్వలేదని మాత్రం తోస్తోంది. ఇది బాధాకరమైన విషయం. దీనిపై నా భావాలు చెప్పే ముందు, 2011 ఆగస్టులో ‘బ్రహ్మకుమారీస్’ అనే ఆధ్యాత్మిక, సామాజిక సంస్థలో నేనిచ్చిన ప్రసంగపాఠాన్ని యిస్తున్నాను.

‘విపత్తు (డిజాస్టర్‌) అంటే ఏమిటి? అనుకోకుండా ఊహించని విధంగా వచ్చిపడే ఆపదే విపత్తు. కరువు, భారీవర్షాలు, వరద, తుఫాను, నదీ ప్రవాహం వలన భూమి ఒరుసుకుపోవడం (రివర్‌ ఎరోజన్‌), సునామీ, భూకంపం, కొండచరియలు విరిగి పడడం, హిమపాతం.. యిలాటివి. దాన్ని మేనేజ్‌ చేయడం గురించి ఎందుకు ఆలోచించాలి? గతంలో డిసాస్టర్‌కు రెస్పాన్సు మాత్రమే వుండేది. అదీ అరకొరగా! ఇప్పుడు ముందుగానే వూహించి, సిద్ధపడి, విపత్తు అనంతరపు చర్యల గురించి ఆలోచించవలసిన అవసరం పడింది.

విపత్తులను నివారించకపోతే ఏమవుతుంది? మన దేశంలో మనం అనేక రకాలుగా ప్రణాళికలు వేసి, అందరూ కష్టపడి జిడిపి పెంచితే ఆ వృద్ధి రేటును విపత్తుల వలన వచ్చే నష్టం తుడిచివేస్తోంది. అంటే విపత్తులను సరిగ్గా కంట్రోలు చేయగలిగి వాటివలన నష్టం జరగకుండా చూస్తే మన జిడిపి వృద్ధిరేటు రెట్టింపు అవుతుందన్నమాట. విపత్తుల ఫ్రీక్వెన్సీ, ఇంటెన్సిటీ పెరిగినకొద్దీ మనం నెగటివ్‌ గ్రోత్‌లోకి వెళతాం.

విపత్తులకు సంబంధించి మన భారతదేశానికి సంబంధించి ప్రత్యేక పరిస్థితు లున్నాయి. మన భూమిలో 59% ఏరియాలో ఓ పాటినుండి తీవ్రమైన భూకంపాలు వచ్చే ప్రమాదం పొంచి వుంది. (ప్రోన్‌టు ఎర్త్‌క్వేక్స్‌). 12% భూమికి వరదలు, భూమి పై పొర కొట్టుకుపోవడం రావచ్చు. 7500 కి.మీ.ల తీరప్రాంతంలో 75%లో తుఫానులు, సునామీలు రావచ్చు, వ్యవసాయభూమిలో 68% కరువు వచ్చే ప్రమాదం ఉంది. కొండప్రాంతాల్లో కొండచరియలు విరిగి పడడం, హిమపాతాలు రావచ్చు. ఇవి కాకుండా సరైన భద్రతా చర్యలు చేపట్టకపోవడం వలన కెమికల్‌, బయలాజికల్‌, రేడియలాజికల్‌, న్యూక్లియర్‌ డిసాస్టర్స్‌ జరగవచ్చు.

విపత్తు వలన జరిగే అనర్థం మన వద్ద ఎక్కువగా వుండడానికి కారణాలు కొన్ని ఉన్నాయి. జనసమ్మర్దం ఎక్కువగా వుండడం, నగరీకరణ, పారిశ్రామికీకరణ.. యిలాటివి. హై రిస్క్‌ జోన్స్‌లో భద్రతా ఏర్పాట్లు సరిగ్గా చేయకపోవడం, పర్యావరణం గురించి అవగాహనా లేమి, అమలు చేయడం పట్ల చిత్తశుద్ధి బొత్తిగా లేకపోవడం, జనాభాలో బీదల శాతం ఎక్కువ వుండడం వలన వారికి తట్టుకునే శక్తి, మళ్లీ పుంజుకునే శక్తి లేకపోవడం.. యిలాటివి తోడయ్యాయి. కొన్ని ఉదాహరణలు చెప్పాలంటే – 1993లో మహారాష్ట్రలోని లాటూరులో 6.4 స్కేలు భూకంపం వస్తే మరణించినవారి సంఖ్య దాదాపు 8 వేలు. ఆ తర్వాతి ఏడాదే 6.7 స్కేలులో కాలిఫోర్నియాలో వస్తే మరణించినవారు 60 మందే! అదే కాలిఫోర్నియాలో 16 ఏళ్ల తర్వాత 6.5 స్కేలు భూకంపం వస్తే ఎవరూ చనిపోలేదు. అంటే వారు మిటిగేషన్‌ మెజర్స్‌ (ప్రభావం తగ్గించే చర్యలు) బాగా చేపట్టారన్నమాట. ఇరాన్‌లో 2003లో 6.7 స్కేలుపై భూకంపం వస్తే 40 వేల మంది పోయారు. అంటే అక్కడ ప్రిపేర్‌డ్‌నెస్‌ అధ్వాన్నంగా వుందన్నమాట.

ఇక్కడ అండర్‌లైన్‌ చేయవలసిన పాయింట్లు ఏమిటంటే – ఈ డిజాస్టర్లు జిడిపిలో 2 నుండి 7% వరకు ప్రభావితం చేస్తాయి. జిడిపి వృద్ధి రేటు 7% వున్నా ఈ డిజాస్టర్ల కారణంగా అది మొత్తం తుడిచిపెట్టుకుని పోతుంది. 2) ప్రభావం తగ్గించడానికై ఒక్క రూపాయి ఖర్చు పెడితే అది 7 రూపాయలను కాపాడుతుంది. స్టిచ్‌ ఇన్‌ టైమ్‌ సేవ్స్‌ నైన్‌ అన్న సూక్తి యిక్కడ పూర్తిగా వర్తిస్తుంది. 3) చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటున్నా మనడానికి ఉదాహరణగా రిలీఫ్‌ పై ఖర్చు పెట్టే వ్యయం చూడండి. 2005-10 మధ్య కెలామిటీ రిలీఫ్‌ ఫండ్‌పై మన ప్రభుత్వం వెచ్చించినది 21 వేల కోట్లు. నేషనల్‌ కంటెన్‌జెన్సీ కెలామిటీ ఫండ్‌ కింద రికనస్ట్రక్షన్‌కి 2005-09 మధ్య వెచ్చించినది 20 వేల కోట్లు. అంటే 41 వేల కోట్లు ఖర్చు పెట్టాం. పై సూత్రం ప్రకారం దీనిలో ఏడో వంతు అంటే 6 వేల కోట్లు సకాలంలో ఖర్చు పెట్టి వుంటే రూ అవస్థ వచ్చేది కాదు, ఇంత ఖర్చు వుండేది కాదు. ఇక్కడ గమనించ వలసినది విషయమేమిటంటే – వ్యక్తిగత ఆస్తుల నష్టాన్ని యిక్కడ లెక్కలోకి తీసుకోవడం లేదు. అది కూడా కలుపుకుంటే అంకె ఎక్కడికి చేరుతుందో తెలియదు.

మరి ప్రభుత్వం ఏం చేస్తోంది? నేషనల్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీ (ఎన్‌డిఎమ్‌ఏ) అని 2005లో ప్రధానమంత్రి చైర్మన్‌షిప్‌లో ఏర్పాటు చేసి ఐదేళ్లపాటు దానిపై చర్చలు జరిపి పాలసీ గైడ్‌లైన్స్‌ యివ్వడం జరిగింది. రాష్ట్రాలలో కూడా స్టేట్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీలు ఏర్పాటు చేయడం జరిగింది. నిర్మాణాలు చేపట్టేటప్పుడు వరద రీత్యా, భూకంపం రీత్యా కొన్ని ప్రమాణాలు పాటిస్తేనే అనుమతి యివ్వాలనే దగ్గర్నుంచి విపత్తు సమయాలలో ముందుకు దూకవలసిన రక్షణదళాల తర్ఫీదు దాకా రాష్ట్రప్రభుత్వాలకు అనేక సూచనలు చేసింది ఎన్‌డిఎమ్‌ఏ.

విపత్తుకు ముందు చేపట్టవలసిన చర్యల గురించి నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ (ఎన్‌ఐడిఎమ్‌) అనే సంస్థ ఏర్పడి అనేక రిసెర్చి సంస్థలతో అనుసంధానం చేసుకుని కెపాసిటీ డెవలప్‌మెంట్‌ చేస్తోంది. నేషనల్‌ డిజాస్టర్‌ రిలీఫ్‌ ఫోర్సు (ఎన్‌డిఆర్‌ఎఫ్‌) అని పెట్టి దేశం మొత్తం మీద 10 చోట్ల బేస్‌లు పెట్టింది. అవసరాన్ని బట్టి వారు అతి త్వరగా చేరుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మన రాష్ట్రంలో విజయవాడలో ఓ బేస్‌ క్యాంప్‌ వుంది.

ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించినంత వరకు వచ్చే విపత్తులు ఏమిటంటే, వరదలు, తుపానులు, కరువు! ఒక మేరకు వచ్చే విపత్తులలో `సునామీ, భూకంపం, లాండ్‌స్లయిడ్‌, ఇండస్ట్రియల్‌, కెమికల్‌, న్యూక్లియార్‌, బయలాజికల్‌ ఎమర్జన్సీలు ఉన్నాయి. ఒక్క వరద వస్తే ఎంత ఖర్చవుతుందో అంచనా కోసం 2009 అక్టోబరు నాటి వరదల గణాంకాలు చూద్దాం. అది కర్నూలు, మెహబూబ్‌నగర్‌ జిల్లాలను ఎక్కువగా, కృష్ణా, గుంటూరు, నల్గొండ జిల్లాలను తక్కువగా ప్రభావితం చేసింది. ఎఫెక్టయిన గ్రామాలు 500, ప్రజలు 15 లక్షలు. మరణించినది 50, పోయిన పశువులు 10 వేలు. 62 వేల యిళ్లు దెబ్బ తిన్నాయి. రెస్క్యూ ఆపరేషన్స్‌ చూడబోతే, 400 బోట్లు, 1200 మంది ఈతగాళ్లు, 750 మంది ఆర్మీ పర్సనల్‌, 18 హెలికాప్టర్లు పాల్గొన్నాయి.

రిలీఫ్‌ ఆపరేషన్స్‌లో 350 క్యాంపులు నడిపారు. 5 లక్షల మందిని తరలించారు. కాంపుల్లో 3 లక్షలమందికి ఆవాసం కల్పించారు. 12 లక్షల ఆహారపు పొట్లాలు పంచబడ్డాయి. చూడండి ఎంత ఖర్చయివుంటుందో ! మొత్తం నష్టం 12 వేల కోట్లు. 2010 నాటి లైలా తుపాను వల్ల నష్టం 1600 కోట్లు. 2009-10లో ఆంధ్రప్రదేశ్‌ జిడిపి గ్రోత్‌ రేట్‌ 5.04%, మరి అదే ఏడాదిలో వచ్చిన వరదలు, తుపాను వలన రాష్ట్ర జిడిపిలో 5.14% ఖర్చయింది. అంటే నష్టం గ్రోత్‌ రేట్‌ కన్నా 0.10% ఎక్కువన్నమాట.

విపత్తు సంబంధిత విషయాలను క్రోడీకరించి చెప్పాలంటే –

విపత్తుకు ముందు చర్యలు – 1.ప్రివెన్షన్‌, 2.ప్రిపేర్‌డ్‌నెస్‌ ప్లస్‌ 3.మిటిగేషన్‌

విపత్తు తర్వాత చర్యలు –1.రెస్పాన్స్‌ (ఇవాక్యుయేషన్‌, రెస్క్యూ, రిలీఫ్‌) 2.రీహేబిలిటేషన్‌, 3.రికనస్ట్రక్షన్‌ అండ్‌ రికవరీ

బ్రహ్మకుమారీస్‌ వంటి సామాజిక సంస్థలు యీ విషయంలో చేయదగిన పనులు కొన్ని ఉన్నాయి. విపత్తుకు ముందు చర్యలు (కెపాసిటీ బిల్డింగ్‌ మెజర్స్‌) చేపట్టవచ్చు. వాటిలో మొదటిది ప్రివెన్షన్‌! ఎవేర్‌నెస్‌ పెంచడం వలన యిది సాధ్యపడుతుంది. డిజాస్టర్‌ జరిగేంతవరకు దాని గురించి ఎవరూ పట్టించుకోక పోవడం, తర్వాత పరుగులు పెట్టడం, అప్పటికప్పుడు తాత్కాలికంగా ఏదో చేసి చేతులు దులుపు కోవడం జరుగుతోంది. దాని గురించి అవగాహన పెంచే ప్రయత్నాలు ప్రభుత్వాలు, పత్రికలు చేయడం లేదు. ఈ సంస్థలు ఆ పని చేయవచ్చు. తమ ప్రసంగాల ద్వారా, కరపత్రాల ద్వారా ముందునుంచీ ప్రిపేర్‌ చేయవచ్చు.

భూకంపాలు వచ్చినపుడు భూమి క్రుంగడం వలన జరిగే కష్టం కంటె ఇంట్లో వున్న వస్తువులు తలమీద పడి జరిగే ప్రాణనష్టం ఎక్కువ. అందువలన భూకంపం వచ్చే సంకేతాలు వచ్చినపుడు బీరువాల మీద బరువైన పెట్టెలు పెట్టవద్దని, అటకలు ఖాళీ చేయాలని వాళ్లకు నచ్చచెప్పాలి. ఇవన్నీ గృహిణులకు అర్థమయ్యేట్లు చెప్పడానికి యీ సంస్థల లోని మహిళా కార్యకర్తలు పూనుకోవాలి. ప్రభుత్వోద్యోగుల కంటె వారికి యింట్లోకి వెళ్లి నచ్చచెప్పడానికి ఎక్కువ అవకాశం వుంటుంది

రెండవది ప్రిపేర్‌డ్‌నెస్‌! దీనిలో ముఖ్యమైనది వార్నింగులను ఖాతరు చేయడం. విపత్తు రాబోతోందని ప్రభుత్వ ఏజన్సీలు చెప్పినా ప్రజలు విశ్వసించకపోవడం వలన నష్టం భారీగా వుంటోంది. వార్నింగులు యిచ్చినా జాలర్లు చేపల వేటకై వెళ్లి యిరుక్కుంటారు. నివాసప్రాంతాలను ఖాళీ చేయమని చెప్పినా చేయరు. సామాజిక సంస్థలకు విశ్వసనీయత బాగా వుంటుంది కాబట్టి, వారు చెప్తే ప్రజలు నమ్ముతారు, ఇళ్లు ఖాళీ చేసి తరలి వెళతారు. సముద్రం పొంగులో వున్నపుడు చేపలు సులభంగా పడతాయనే ఉద్దేశంతో జాలర్లు రిస్కు తీసుకుంటారు. బతికుంటే బలుసాకు తినవచ్చు, దేవుడిచ్చిన జీవితాన్ని డబ్బు కోసం బలి పెట్టవద్దని యీ సంస్థలు ఆధ్యాత్మిక ధోరణిలో చెప్తే వారు వినవచ్చు.

ఇంకో ముఖ్యమైన విషయం, షెల్టర్‌ మైన్‌టైనెన్స్‌! విపత్తు సమయాలలో ప్రజలు తలదాచుకోవడానికి ప్రభుత్వం షెల్టర్స్‌ కడుతుంది. కానీ వరద తగ్గాక దానిని ఏం చేయాలో తెలియక అలాగ వదిలేయడం వలన అక్కడ అసాంఘిక శక్తులు చేరి దుర్వినియోగం చేసే ప్రమాదం వుంది. సరైన నిర్వహణ లేకపోతే ఆ కట్టడం పాడై పోయి, మళ్లీ ఏడాది దాని అవసరం పడినప్పుడు ఉపయోగం లేకుండా పోవచ్చు. అందువలన వాటి నిర్వహణ పంచాయితీలకు అప్పచెప్పినా ఆ రాజకీయాలలో అది ఏ మేరకు సవ్యంగా నడుస్తుందో చెప్పలేం. ఈ సంస్థలు వాటి నిర్వహణ చేపట్టి విపత్తు లేని సమయాలలో వారం వారం భజనలు, ఆధ్యాత్మిక ప్రసంగాలు, సామాజిక అంశాలపై అవగాహనా సదస్సులు పెట్టి ఏదో ఒక యాక్టివిటీ వుండేట్లు చూడవచ్చు.

అంతేకాదు, జలవిలయం సంభవించినప్పుడు ఈతగాళ్ల కొరత బాగా కొట్టవచ్చినట్టు తెలుస్తుంది. గతంలో చెరువులు, కాలువలు బాగా వుండేటప్పుడు చాలా మంది ఈత నేర్చుకునేవారు. పోనుపోను అవి మాయం కావడంతో, స్విమ్మింగ్‌ పూల్స్‌ మేన్‌టెనెన్స్‌ సరిగ్గా లేకపోవడంతో చాలామంది ఈత నేర్చుకోవడం లేదు. విపత్తు లేని విరామ సమయాల్లో రూ షెల్టర్లలో యీతకొలను ఏర్పాటు చేసి వీలైనంతమందికి యీత నేర్పించడం మంచిది. దానితో పాటు సంస్థ సభ్యులకు, ముందుకు వచ్చే పౌరులకు ఫస్ట్‌ ఎయిడ్‌ ఎలా చేయాలో కూడా నేర్పించాలి.

మిటిగేషన్‌ విషయానికి వస్తే, విపత్తు ప్రభావాన్ని సాధ్యమైనంత మేరకు తగ్గించడానికి తరతరాలుగా వస్తున్న విజ్ఞానం, సాంకేతిక పరిజ్ఞానం, ఆధునిక పరికరాలు వుపయోగించాలి. పర్యావరణాన్ని కాపాడుకోవడం ద్వారా కూడా నష్టాన్ని తగ్గించవచ్చు.

విపత్తు తర్వాత చర్యల గురించి మాట్లాడుకోవాలంటే – మొదటగా రెస్పాన్స్‌ అంటే ఇవాక్యుయేషన్‌, రెస్క్యూ, రిలీఫ్‌ అన్నమాట. ఇవాక్యుయేషన్‌ విషయానికి వస్తే, వరద వంటివి వచ్చినపుడు యిల్లు ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించడం ద్వారానే ప్రాణనష్టం నివారించవచ్చు. కానీ చాలా సందర్భాలలో ప్రజలు తరలడానికి యిష్టపడరు దానికి కారణాలు ఏమిటంటే – వెళ్లవలసినంత ప్రమాదం వుందని వాళ్లు నమ్మకపోవడం, నమ్మినా యింట్లోని ముసలివారిని, బాలురను, పశువులను తరలించడం కష్టం కావడంతో దేవుడి మీద భారం వేసి వుండిపోతారు. అంతేకాదు, వెళ్లే చోట సౌకర్యాలు బాగా వుంటాయని, యింతకంటె మెరుగ్గా వుంటాయని నమ్మరు. వరద తగ్గాక తిరిగి వచ్చేదాకా యింట్లో వస్తువులు భద్రంగా వుంటాయని నమ్మకపోవడం కూడా ఉంటుంది.

దీనికొరకు యీ సంస్థల వాలంటీర్లు చేయవలసినది – తాము స్వయంగా ముసలివారిని, పిల్లలను, పశువులను తర్వాత తీసుకుని వస్తామని హామీ యిచ్చి తమంతట తాము వెళ్లగలిగే వారిని త్వరగా వెళ్లమని చెప్పవచ్చును. ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్యాంపుల స్థితిగతులను తాము స్వయంగా చూసి వచ్చి, అక్కడున్న సౌకర్యాల గురించి యథాతథ స్థితి వివరించి అక్కడకి తరలడానికి ప్రోత్సహించవచ్చు. వారు తిరిగి వచ్చేటంత వరకు వారి ఆస్తిని సంరక్షిస్తామని హామీ యిచ్చి కొందరు వాలంటీర్లు యిదే పనిలో నిమగ్నం కావచ్చు. ఇవే హామీలను ప్రభుత్వోద్యోగులు యిచ్చినా ప్రజలు గాఢంగా విశ్వసించరు. మన సంస్థల వాలంటీర్లు నిస్వార్థంగా వుంటారని తెలుసు కాబట్టి ఆ యిమేజి దీనికి పనికి వస్తుంది.

ఇక రెస్క్యూ విషయానికి వస్తే, టీముతో అనుసంధానం – విపత్తు జరిగినపుడు జాతీయ స్థాయి నుండి కాని, రాష్ట్రస్థాయి నుండి కానీ రెస్క్యూ టీమ్స్‌ (రక్షణదళాలు) వస్తూంటాయి. వారితో ప్రధాన సమస్య భాష, రెండో సమస్య స్థానిక పరిసరాల (టోపోగ్రఫీ) గురించిన అవగాహన లేకపోవడం. సామాజిక సంస్థలలో విద్యావంతులుంటారు కాబట్టి కొందరు వారిని వెంటనంటి వుండి స్థానికులతో సంభాషించడానికి, స్థానిక భౌగోళిక పరిస్థితుల గురించి వివరించడానికి దుబాసీలుగా పని చేయవచ్చు. వారికి కావలసిన అవసరాలను ఏర్పాటు చేయవచ్చు.

నిజానికి యివి ప్రభుత్వోద్యోగులు చేయవలసిన పని. కానీ యిలాటి సమయాల్లో పబ్లిసిటీ కోసం రాజకీయ నాయకులు ఒకరి తర్వాత మరొకరు రావడం, మీడియా వారిని అంటి పెట్టుకుని తిరగడం, ప్రభుత్వోద్యోగులు వారి వెంట తిరగడం జరుగుతూ వుంటుంది. దాని కారణంగా దూరప్రాంతం నుండి వచ్చిన రెస్క్యూ టీమ్స్‌ బాగోగులు పట్టించుకోరు. పబ్లిసిటీ కోసం ప్రాకులాడే స్వభావం లేని ‘‘బ్రహ్మకుమారీ సంస్థ’’ సభ్యులు ఆ లోటును పూరించవచ్చు.

రిలీఫ్‌ విషయానికి వస్తే, సాధారణంగా విపత్తు సంభవించగానే దేశం నలుమూలల నుండి అనేక ఎన్‌జీవోలు సేవా దృక్పథంతో రిలీఫ్‌ టీమ్స్‌గా వస్తాయి. కానీ వారికి ఏదో చేయాలని వుంటుంది తప్ప ఏం చేయాలో తెలియదు. నిజానికి బాధితులు మళ్లీ జీవితంలో నిలదొక్కుకోవడానికి ఎన్నో వస్తువులు కావలసి వుంటాయి. ఇల్లు కట్టుకోవడానికి వస్తువుల దగ్గర్నుంచి, పుస్తకాలు, పత్రికలు, మంచినీరు.. యిలా రాసుకుపోతే జాబితా సాగుతూనే వుంటుంది.

కానీ అన్ని సహాయక బృందాలూ పట్టుకుని వచ్చేవి – ఆహారపు పొట్లాలు, బట్టలు. అందరూ రహదారికి అందుబాటులో వున్న వూరికి వెళ్లి అక్కడ పంచేసి లారీ ఖాళీ చేసుకుని వెళ్లిపోతారు. అందరూ అదే గ్రామానికి వద్దన్నా తెచ్చి పడేస్తారు తప్ప, లోతట్టు ప్రాంతాల జోలికి వెళ్లరు. సహాయం చేశామంటే చేశాం అని తప్ప అందరికీ అందిందా లేదా, అవసరమైనది అందించామా లేదా అని ఎవరూ చూడరు. వీరందరినీ సమన్వయం చేసేవారూ వుండరు.

అందువలన ‘‘బ్రహ్మకుమారీ సంస్థ’’ సభ్యులు ఆ ఎన్జీవోలకు ఏం చేయాలో స్పష్టంగా చెప్పాలి. ఎవరు ఎక్కడికి వెళ్లాలో, ఏం పట్టుకెళ్లాలో స్పష్టంగా చెప్పాలి. దీనికి కావలసినది వారి చర్యలను సమన్వయం చేయడం. నెట్‌వర్కింగ్‌ ద్వారా అందరికీ సహాయం అందేటట్లు పర్యవేక్షించడం. దీనికి గాను ‘‘బ్రహ్మకుమారీ సంస్థ’’ కార్యకర్తలు ఎన్‌జివోలతో సంబంధ బాంధవ్యాలు పెట్టుకుని, వారికి సరైన గైడెన్సు యివ్వాలి. కొందరు లోతట్టు ప్రాంతాలకు వెళ్లడానికి జంకుతారు. వాళ్లకు ధైర్యం చెప్పి దగ్గరుండి తీసుకుని వెళ్లే బాధ్యత ‘‘బ్రహ్మకుమారీ సంస్థ’’ సభ్యులు చేపట్టవచ్చు.

రిహేబిలిటేషన్‌ – విపత్తు వలన నష్టపోయిన వారికి నష్టపరిహారం యిస్తామని ప్రకటనలు చాలా వెలువడుతాయి. తర్వాత ఎప్పటికో పరిహారం వస్తుంది. అది కూడా చాలామంది చేతుల్లో పడి అసలైన బాధితులకు అందదు. అవినీతి ఆరోపణలు ముంచెత్తేది యీ సందర్భంలోనే ! మనం కొన్ని గ్రామాలను దత్తత తీసుకుని కనీసం అక్కడైనా అవినీతి లేకుండా సరైన వ్యక్తులకు పరిహారం అందేట్లు చూడాలి. వీళ్ల ఆరోగ్యరక్షణకు అత్యధిక ప్రాధాన్యత యివ్వాలి. వారికి మళ్లీ ఉపాధికల్పనా సౌకర్యాలు ఏర్పడేట్లు కృషి చేయాలి.

కొన్ని ఎన్జీవోలు పునరావాసానికై డబ్బులతో వస్తాయి. వీళ్లు సాధ్యమైనంత తక్కువ సమయంలో సాధ్యమైనంత ఎక్కువ డబ్బు విరాళాలుగా పంచేసి, చేతులు దులుపుకుని వెళ్లిపోతే బాగుండునని అనుకుంటారు. ఏది చేసినా పదికాలాల పాటు నిలిచేట్లా, బడుగు జీవితాలను లోతుగా ప్రభావితం చేసేటట్లు, ఉత్తరోత్రా ఎవరి సహాయం లేకుండా వారంతట వారే స్వంతకాళ్లపై నిలబడేట్టు కార్యక్రమాలు రూపొందించి అమలు చేయాలి తప్ప గబగబా ఎదుట బడిన పదిమందికి డబ్బులు పంచేసి సంచీ దులుపుకుని వెళ్లిపోవడం సరికాదు.

రికార్డింగ్‌ – విపత్తు సంభవించినపుడు కొందరు అధికారులు, కొన్ని సంస్థలు చక్కటి ప్రణాళికతో, సమయస్ఫూర్తితో కొన్ని చర్యలు చేపట్టడం ద్వారా నష్టనివారణ జరుగుతుంది. వారికి పేరుప్రఖ్యాతులు వస్తాయి. దురదృష్టవశాత్తూ విపత్తును ఎలా ఎదుర్కొన్నారో ఎక్కడా రికార్డు చేయడం జరగదు. అందువలన తరువాతిసారి యిదే రకమైన విపత్తు కలిగినపుడు ఆ సమయంలో అక్కడున్న వ్యక్తులు మళ్లీ కృత్యాద్యవస్థతో మొదలు పెట్టి, కొత్తగా ప్రయోగాలు చేయడం జరుగుతుంది. అవి సఫలం కావచ్చు, విఫలం కావచ్చు.

అంతకుముందు చేసిన చర్యల ఫలితాలను నమోదు చేసి వుంచితే వాటి కంటె మెరుగ్గా వ్యవహరించి మరింత నష్టాన్ని నివారించవచ్చు. కానీ ఎదుటివారికి పేరు రావడం యిష్టం లేని ప్రభుత్వోద్యోగులు, తాము లేకపోతే ఏదీ జరిగేది కాదని నమ్మించడానికి చూసే కొన్ని సంస్థలు రికార్డు చేయడానికి యిష్టపడరు. పేరు గురించి పాకులాడని ‘‘బ్రహ్మకుమారీ సంస్థ’’ వారు అలాటి పరిస్థితుల్లో జరిగినవన్నీ డైరీగా నమోదు చేసి భద్రపరిస్తే అవి తర్వాతి వారికి ఎంతో ఉపయోగపడతాం­.

ప్రభుత్వం ఆర్థిక సహాయం చేయగలదు, సాధనసంపత్తి నీయగలదు, రాజకీయనాయకులు హామీలు గుప్పించగలరు. కానీ విపత్తులలో కావలసినది ప్రధానంగా కావలసినది – మానసిక స్థయిర్యం, ఎటువంటి ఆపద వచ్చినా తట్టుకుంటామనే గుండె ధైర్యం, ఆపద దాటడానికి చూపవలసిన సాహసం, కాల్లో ముల్లు గుచ్చుకుంటే ఏడ్చుకుంటూ కూర్చునే బదులు కంట్లో గుచ్చుకోలేదని ఓదార్చుకునే గుణం! ఆధ్యాత్మికత జీర్ణించుకున్న కార్యకర్తలున్న ‘‘బ్రహ్మకుమారీ సంస్థ’’ మాత్రమే వారికి యివి కలిగించగలదు. అందువలన జాతీయ విపత్తు నిర్వహణలో ‘‘బ్రహ్మకుమారీ సంస్థ’’ పాత్ర ఎంతైనా గణనీయమైనది.’

ఇది 2011 నాటి ప్రసంగం అని చెప్పాను కదా. ఇప్పటికీ దీనిలోని అంశాలు వర్తిస్తాయని గమనిస్తే దుఃఖం వస్తోంది. సెప్టెంబరులో ఆంధ్రకు వచ్చిన వరదల్లో ఆహార పొట్లాలు తెచ్చినవారు మొదటే రిలీఫ్ క్యాంపులకే అందించారని, వారిలో చాలామంది తినకుండా పారేశారని ఫోటోలు వచ్చాయి. లోతట్టు ప్రాంతాల వారు మూడు రోజుల పాటు ఆహారం, నీరు లేకుండా అలమటించారట. ప్రాణనష్టంతో పాటు అపారమైన ఆస్తి నష్టం వాటిల్లింది. వరదల కంటె ఆక్రమణల వలన నీటి ప్రవాహానికి అడ్డు తగలడం వలన హెచ్చు నష్టం జరిగింది. బుడమేరు గేట్లు ఎత్తే ముందు ప్రజలను హెచ్చరించ లేదనే ఆరోపణలూ వచ్చాయి. అంటే గత విపత్తులు నేర్పిన పాఠాలు వంటబట్టలేదని అర్థమౌతోంది. హెచ్చరించినా ప్రజలు యిళ్లు విడవటం లేదని 2011 ఉపన్యాసంలో వాపోయాను. హెచ్చరికే లేకపోతే ఎలా?

74 ఏళ్ల వయసులో ఆంధ్ర ముఖ్యమంత్రి తనే అన్ని చోట్లకూ వెళ్లడం హర్షణీయమే కానీ సామాజిక సంస్థలకు కూడా పాత్ర, ప్రాధాన్యత యిచ్చి ఉంటే మరింత హర్షదాయకంగా ఉండేది. ఎంతసేపూ ముఖ్యమంత్రిపైనే ఫోకస్‌. ఆయన అధికారులపై విరుచుకు పడ్డారు, గత ప్రభుత్వచర్యల కారణంగానే విపత్తు సంభవించిందన్నారు, విపక్షం వారు లాంచీలు పంపి కృష్ణా బ్యారేజిని డామేజి చేసేశారు…. వంటి వార్తలే! ముఖ్యమంత్రి తన యిల్లు కాపాడుకోవడానికి వరద దారి మళ్లించారని ప్రతిపక్షం ఆరోపణ. కొంపాగోడూ పోయి మేం ఏడుస్తూ ఉంటే, వరదలో యీ ఓట్ల వేట ఏమిటి, వరద బురద కడుక్కుంటే పోతుంది, యీ రాజకీయ బురదని కడగడం మన తరమా? అని బాధితులు పళ్లు నూరుకున్నారంటే ఆశ్చర్యమేముంది? కనీసం మీడియా ఐనా రాజకీయ నాయకుల రొటీన్ ప్రసంగాలకు, ప్రకటనలకు యిచ్చే ప్రాధాన్యత తగ్గించి, ప్రజల భాగస్వామ్యం, సామాజిక కార్యకర్తల సేవాభావం వంటివి హైలైట్ చేస్తే, మరింత మంది ప్రజలు సామాజిక సేవ వైపు మొగ్గుతారు. విపత్తు సమయాలలో ప్రజలకు ధైర్యాన్ని, పాజిటివ్ దృక్పథాన్ని కలిగిస్తారు.

– కె.ఐ. వరప్రసాద్ రెడ్డి (శాంతా బయోటెక్నిక్స్)

5 Replies to “కెవి: డిజాస్టర్లు – ఎన్‌జిఓలు”

  1. ఈయన రాస్తున్న ఆర్టికల్ స్ అన్ని ఒక మతాన్ని ప్రమోట్ చేసేలాగానే ఉన్నాయి, ఈయనకు అర్జెంటు గా రాజ్య సభ సభ్యత్వం ఇవ్వవలసిందగా ఆ పార్టీ ని కోరుతున్నాను.

Comments are closed.