ప్రస్తుతానికి అయితే ఫేస్ బుక్ వినియోగదారులు ఎక్కువగా ఉన్న దేశం అమెరికా. ఆ దేశస్తుడే అయిన మార్క్ జుకర్ బర్గ్ ప్రారంభించిన సైట్ కు ఇంటర్నెట్ విస్తృతంగా అందుబాటులో ఉన్న దేశంలో అధిక ఆదరణ ఉండటం విశేషం కాకపోవచ్చు. అమెరికాలో తీవ్రం అయ్యాకా ఇండియాకు సోకిన ఈ ఫేస్ బుక్ జ్వరం త్వరలో అమెరికాను మించి పోనుండటమే ఇక్కడ ఆశ్చర్యం.
2017 కళ్లా ఇండియా ఫేస్ బుక్ వినియోగంలో తొలి స్థానంలో ఉంటుందని అంచనా. ఈ విషయాన్ని స్వయంగా ఫేస్ బుక్ వారే ప్రకటించారు. పెరుగుతున్న గణాంకాలు, విస్తృతంగా వాడకంలోకి వస్తున్న మొబైల్ ఇంటర్నెట్ సేవల ద్వారా ఫేస్ బుక్ ఈ అంచనాకు వచ్చింది. కంప్యూటర్ ద్వారా చూసే వాళ్ల కన్నా… స్మార్ట్ ఫోన్ల ద్వారా ఫేస్ బుక్ వినియోగంలోకి వచ్చాకే ఈ సైట్ కు వీక్షకుల సంఖ్య పెరుగుతోంది.
ఈ నేపథ్యంలో ప్రస్తుతానికి అమెరికాలో దాదాపు పన్నెండున్నర కోట్ల మంది ఫేస్ బుక్ యాక్టివ్ యూజర్లున్నారు. భారత్ లో వీరి సంఖ్య దాదాపు పది కోట్ల వరకూ ఉంది. ఈ గణాంకాలతో అమెరికా తొలి స్థానంలో ఉండగా.. ఫేస్ బుక్ వినియోగంలో ఇండియా రెండో స్థానంలో ఉంది. అయితే 2017 కళ్లా ఇండియా అమెరికా స్థానాన్ని ఆక్రమించనుంది.
ఆ సంవత్సరానికళ్లా అమెరికాలో దాదాపు పద్నాలుగు కోట్ల మంది ఫేస్ బుక్ యూజర్లు తయారవుతారని అంచనా. అదే సమయానికి ఇండియాలో పద్నాలుగున్నర కోట్ల మంది ఎప్ బీని బ్రౌజ్ చేస్తూ ఉంటారు. తద్వారా ఇండియా ప్రపంచంలోనే ఎక్కుమంది ఫేస్ బుక్ యూజర్లున్న దేశంగా నిలుస్తుంది. అక్కడ నుంచి ఇండియాలో గ్రోత్ రేట్ మరింత ఎక్కువగా ఉంటుందని అంచనా. మరి ఫేస్ బుక్ పుట్టింది అమెరికాలో అయినా.. అమెరికాను మించిన ఆదరణ అందించడంలో మాత్రం ఇండియన్స్ త్వరలోనే ముందు నిలుస్తారనమాట!