కుక్క చావు అంటే కుక్క చచ్చిన చావు కాదు. కుక్క అంటే హీనమైనది.. అలాంటి హీనమైన చావు దక్కకూడదు.. అన్నది వెనకటికి పెద్దలు చెప్పిన కుక్కచావు సారాంశం.
అసలు విషయానికొస్తే, ప్రభుత్వాసుపత్రిలో కుక్క చావు అంటే ఏంటో జనం చూస్తున్నారు గత కొంతకాలంగా. ప్రభుత్వాసుపత్రుల్లో పరిశుభ్రత లేమితో ఒక రోగానికి వైద్యం కోసం వెళితే, ఇంకో రోగం అంటించుకుని రావాల్సిన దుస్థితి పడ్తోంది సామాన్యులకి. అమాత్యులేమో పెద్దాసుపత్రుల్లో నిద్రలంటూ పబ్లిసిటీ స్టంట్లు చేస్తోంటే, రోగుల తిప్పలు మాత్రం దారుణాతి దారుణంగా తయారవుతున్నాయి.
తాజాగా హైద్రాబాద్లో పేరొందిన పెద్దాసుపత్రిలో ఓ వ్యక్తి వైద్య చికిత్స కోసం వచ్చి, కుక్కలకి ఆహారంగా మారిపోబోయాడు. రోడ్డు ప్రమదంలో తీవ్ర గాయాలపాలైన సదరు యువకుడికి డాక్టర్లు షరామామూలుగానే వైద్య చికిత్స అందించలేదు. చికిత్స అందలేదు సరికదా, కనీసం ఆసుపత్రిలో వుండేందుకు సైతం చోటు దక్కలేదతనికి. తీవ్రగాయాలతో ఆసుపత్రి బయట మెట్ల మీద కూర్చున్న బాధితుడిపై కుక్కలు కన్నేశాయి. తీవ్రగాయమైన కాలి భాగంలో కొంత నోట కరచుకుని వెళ్ళిపోయారు.
బాధితుడిని కుక్కలు పీక్కుతినడానికి ప్రయత్నించడంతో అక్కడున్న ఇతర రోగులు, వారి బంధులువు కుక్కల్ని చెదరగొట్టాయి. లేదంటే బాధితుడు కుక్కలకి ఆహారంగా మారిపోయేవాడే. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి విషమించినట్లు తెలుస్తోంది. మీడియాలో ఈ విషయమై బ్రేకింగ్ న్యూస్లు దర్శనమిస్తున్నా, వైద్యులు సరైన రీతిలో స్పందించలేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఆ మధ్య పిల్లల ఆసుపత్రి నీలోఫర్లో ఓ చిన్నారి మీద కూడా ఇలానే కుక్కలు తీవ్రంగా దాడి చేశాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో చాలా ప్రభుత్వ ఆసుపత్రులు రోగులకు వైద్య చికిత్స అందించడం మాటెలా వున్నా, కుక్కలకు, పందులకు మాత్రం షెల్టర్ జోన్లా మారిపోతున్నాయి. పాలకులు ఏం చేస్తున్నారు? అనడక్కండి. అదంతే.!