రాబందుల రెక్కల చప్పుడు కింద నెమళ్లు నాట్యం ఆడవు. పులులే పులి వేషాల్లో వస్తే జింకలు బతకవు. వృక్షాలని నరకడమే ఇపుడు ఒక ఉద్యమం. ఎవరు వచ్చినా పోయేది జనమే. ఎవరు గెలిచినా ఓడేది ప్రజలే.
భూమిని నమ్ముకునే కాలం పోయి, అమ్ముకునే కాలం వచ్చింది. ఎవరెక్కువ అమ్మితే వాళ్లు సంరక్షకులు. అభివృద్ధి అంటే అందరూ వాటాలేసుకుని తినడం. దక్కని వాళ్లు అరుస్తారు.
అవతార్ సినిమాలోలా ఇక్కడ హీరోలుండరు. యంత్రాలే వుంటాయి. మనం కొట్టిన కట్టెలే మనల్ని కాలుస్తాయి. అడవి చచ్చిపోయినా మనకి పనికొస్తుంది. మనిషి పోతే దేనికీ పనికిరాడు.
యంత్రమనే భూతమే పంచభూతాల్ని శాసిస్తుంది. భూమిలోని నీళ్లు లాగేసింది. పర్వతాలని కంకర చేసింది. గాలిని విషంగా మార్చింది. ఆకాశం రసాయనం అయ్యింది. ప్రకృతిని వికృతి చేసి సంస్కృతి అని గర్విస్తున్నాం.
ఈ భూమి అందరిదీ. కోట్ల ప్రాణుల్లో మనిషి ఒకడు. మనిషి ఒకడిదే కాదు. నువ్వు గజాలు, ఎకరాల్లో కొలుస్తావు. ఒక పక్షి చెట్ల సంఖ్యతో కొలుస్తుంది. ఎవరిల్లు వారిది. అందరినీ ఖాళీ చేయించి ఏకాంత జైలు శిక్షకి సిద్ధమవుతున్నాం. ఒక ఉడత, మిడత, చిరుత అన్నీ వుంటేనే జీవం.
మట్టి తనని తాను పిండుకుని ధాన్యం గింజని ఇస్తేనే నీకు కంచంలో అన్నం. నువ్వు లెక్కలేసుకుని తినే ప్రొటీన్ ఫుడ్ ఎక్కడో గోచి పెట్టుకున్న పేదరైతు కష్టం. నీ చేతిలో ఉన్న రూపాయి కాగితం అన్నీ కొంటుంది. కానీ, నువ్వు ఆ కాగితానికి అమ్ముడుపోయి చాలా కాలమైంది. ఆత్మని సైతాను దగ్గర తాకట్టు పెట్టిన దృశ్యం, మనింటి గోడకి వర్ణచిత్రంగా వేలాడుతూ వుంది. రక్తంతో గీసిన కనువిందుగానే వుంది. ఎన్నటికీ ఆరని తడి.
మనిషి కళ్లలో ఎడారులు తిరుగుతున్నాయి. చెట్టు కన్నీళ్లని మనం వానగా భ్రమపడుతున్నాం. ఫిరంగులు తయారు చేసే వాడు కూడా దాహమేస్తే మంచినీళ్లు తాగుతాడు. సృష్టిలో సుఖంగా నిద్రించిన నియంతలు లేరు.
నీ పూర్వీకుల ప్రపంచమంతా అడవే. దయతలచి తన శరీరాన్ని ఒక ముక్క కోసి ఇస్తే అది నీ నగరమైంది. దానంగా తీసుకున్న దాన్ని హక్కు అనుకుంటున్నావ్. ఎంత ఇచ్చినా ఇంకా కావాలని అనుకుంటున్నావ్.
ప్రకృతికి కోపం వస్తే కలకత్తా కాళీమాత. ఆమె నాలుక మీద రేగిన జ్వాలకి రెండేళ్లు ప్రపంచమంతా తలుపులు బిగించుకుని కూచుంది. కరోనా, కార్చిచ్చు, భూకంపం పేరు ఏదైనా అది రౌద్రం.
నాలుగు నెమళ్లు, ఆరు జింకలు అరిచినందుకు కాదు కానీ, అవి ఇంతకాలం మనుషుల మధ్య ఇంకా బతికున్నందుకే ఆశ్చర్యం. కుమారస్వామికి దండం పెట్టి, ఆయన వాహనాన్ని కోసుకు తినే భక్తులం. సాధుపుంగవులంతా జింక చర్మం మీద కూచునే తపస్సులు చేసారు.
హక్కుదారుల్ని తరిమేయడం మనకి కొత్తకాదు. జాతులే అంతరించిపోయాయి. ఆకుపచ్చ గుండెలో పిడిబాకు పాత పదబంధం. వనం మాయమై భవనం మొలిస్తే అదే బృందావనం. డబ్బులు లెక్కపెట్టే మిషన్లే కాదు, తప్పులు లెక్కపెట్టే మెదళ్లూ వుంటాయి. లెక్కలు సరితూగుతాయి.
మనిషి సంగతి తెలిసే సముద్రం తనని ఉప్పుతో నింపుకుంది. అవి మంచినీళ్లు అయితే ఈ పాటికి గ్యాలన్ల లెక్కన అమ్మేసి తిమింగలాలకే తిమింగలాలుగా మారేవాళ్లు.
జీఆర్ మహర్షి
ఆశపోతు మనిషిని చూసి జల చరాలు పెట్టిన కన్నీరు ఈ ఉప్పటి సంద్రం.
ఎవరో
మీటింగ్ పెట్టిన ప్రతి చోటా చెట్లు కొట్టేసిన జ్ఞాపకం
Yevado rajadhani ani 3000 acres nasanam chesadu anedi vastavam..
ఎవరో హరగోపాల్ సూరపనేని అని నిన్న ఒక చెత్త ఆర్టికల్ రాసాడు ఇక్కడ. అతనికి చూపించాలి ఈ ఆర్టికల్
Chala Baga Rasaru.
హాయ్ ఓపెన్ ప్రొఫైల్
సూపర్ గా చెప్పేరు GA గారు
జస్ట్ జూమ్ ఇట్
Oka yedava rajadhani ani..pachhani panta polalu masanam chesadu..
Inko vedhva siddham ani roads paina unna chetlanu narikesadu adi kanapadada leka kantlo J gadi M pettukunnava????
మహర్షి గారు! చాలా బాగా రాసారండీ! డబ్బులిచ్చి ఇల్లు అద్దెకున్నాం. నగర అభివృద్ధి పేరుతో కాలుష్యం పెరిగి పోయింది. Traffic, నీరు, గాలి, ఆహరం అన్నింట్లో కాలుష్యం. ఇప్పుడు రానున్న కాలం లో ప్రతీ వాడు డబ్బులిచ్చి oxygen cylinder వెనక కట్టుకుని తిరిగే రోజులు వస్తాయి. సీనియర్ సిటిజన్సులం. మనం బాగా బ్రతికి భావితరానికి కల్తీ ప్రపంచాన్ని ఇస్తున్నాము. పిండం కూడా పెట్టరు. అందరూ ముఖ్యంగా యువజనం… పార్టీల వెనక పడి తిరగడం కాదు. ముసలాళ్లం మేము బాగానే బ్రతికేసాం. మీ భవిష్యత్తు మీరు కాపాడుకోండి. ఆస్తులు డబ్బులు వెనక వేసుకోవడం కాదు ఆరోగ్యమైన వాతావరణం లో ఉంటున్నారా చూసుకోండి. ఇప్పుడు మొదటి ర్యాంకు లో ఉన్న switzerland other countries కూడా రేపు కాలుష్యంకి చిరునామాలుగా మారతాయి. త్వరగా మేలుకోండి. ఆరోగ్య జీవనమే ప్రశ్నార్ధకమైతే మీ దగ్గరున్న ఇళ్ళు దేనికి డబ్బులు దేనికి? ఆలోచించండి.