మునివాక్యం: అమ్మలూ.. అన్నం పెట్టొద్దు!

పిల్లల పెంపకం ఒక కళ. ఇంకో రకంగా చెప్పాలంటే చాలా ప్రమాదకరమైన కళ. ఎందుకంటే ఈ కళలో మనం ప్రావీణ్యం సంపాదించేలోగా.. మన అవసరం గడచిపోతుంది.

పిల్లల పెంపకం ఒక కళ. ఇంకో రకంగా చెప్పాలంటే చాలా ప్రమాదకరమైన కళ. ఎందుకంటే ఈ కళలో మనం ప్రావీణ్యం సంపాదించేలోగా.. మన అవసరం గడచిపోతుంది. సంపాదించుకున్న ప్రావీణ్యం ఆ తర్వాత ఎందుకూ పనికిరాదు. ఇతరులకు సలహాలు చెబుతూ కాలం గడుపుతాం. మనం చెప్పే సలహాలు.. ఇతర తల్లిదండ్రులకు ఉపయోగపడతాయనే గ్యారంటీ లేదు. కానీ.. ఏ ఇద్దరి పిల్లల పెంపకమూ ఒకే రీతిగా సాగదు. ఒక తల్లికి ఇద్దరు పిల్లలుంటే ఆ ఇద్దరినీ ఒకే పద్ధతిలో పెంచడం కూడా కుదరదు. ఇద్దరూ ఒకే రీతిగా తయారు కావడం కూడా జరగదు. ఈ విషయంలో కొంచెం ముందస్తు అవగాహన ఉండడం కొంత మెరుగు. పిల్లల పెంపకానికి సంబంధించి ఒక్కవిషయం గురించి మాత్రం చిన్న సూచన చెప్పాలని అనిపిస్తుంది.

ఆధునిక జీవన శైలుల్లో అనివార్యంగా భాగంగా మారిపోయిన అంశం.. స్మార్ట్ ఫోన్! స్మార్ట్ ఫోన్లు అనేవి సామాజికంగా ఎన్ని రకాల వికృతాలకు కారణం అవుతున్నాయో.. ఎన్ని అపసవ్య పోకడలను మన జీవితాల్లోకి చొరబెడుతున్నాయో చెబుతున్నవాళ్లు అనేకమంది ఉన్నారు. వ్యాసాలు, కవితలు, కథల రూపంలో స్మార్ట్ ఫోన్ చేస్తున్న దుర్మార్గాల గురించి పుంఖానుపుంఖాలుగా వస్తూనే ఉన్నాయి. నేను చెప్పదలచుకుంటున్నది.. స్మార్ట్ ఫోన్ వినియోగానికి మాత్రమే సంబంధించిన వ్యవహారం కాదు. కానీ.. దానితో కూడా ముడిపడి ఉన్న పిల్లల పెంపకానికి సంబంధించిన సంగతి.

పసిపిల్లలు ఉన్న చాలా కుటుంబాల్లో మనం గమనిస్తూ ఉంటాం. పిల్లలకు తల్లులు అన్నం తినిపించే సందర్భాల్లో ఆ పిల్లల చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటుంది. అందులో వారు ఎంచక్కా వీడియో గేమ్స్ ఆడుతూ.. తన దృష్టి మొత్తం అక్కడ కేంద్రీకరించి.. ఒకరకమైన ఆనందానుభూతిని పొందుతూ ఉంటారు. పిల్లలను ఆ రీతిగా ఒక అలౌకికావస్థలో ఉంచి తల్లి వారికి అన్నం తినిపిస్తుందన్నమాట. ఇది స్వయంగా అన్నం తినలేని పసిపిల్లల ఇళ్లలో మనం గమనించే సంగతి. అదే తరహాలో.. రెండు మూడేళ్ల వయస్సు, అంతకంటె పెద్ద పిల్లలున్న ఇళ్లలో మరో రకమైన వాతావరణం ఉంటుంది.

పిల్లలు స్మార్ట్ ఫోన్ చేతిలో పట్టుకునే కనిపిస్తారు. వీడియోలు చూస్తూ, గేమ్స్ ఆడుతూ ఉంటారు. వారి తీరు పట్ల తల్లిదండ్రుల లేదా అమ్మమ్మలూ నానమ్మలు, తాతయ్యల స్పందన ఒక తీరుగా ఉంటుంది. ‘వీడికి చాలా తెలివితేటలు ఉన్నాయండీ.. ఈ ఫోనులో చాలా ఆప్షన్స్ నాకు కూడా తెలియవు.. వాడికి తెలుసు’ అంటూ ఉంటారు. అన్నం తినిపించేందుకు స్మార్ట్ ఫోనును బిడ్డ చేతికిచ్చే తల్లుల మాటలు కూడా చిత్రంగా ఉంటాయి. ‘ఫోను ఇవ్వకపోతే వీడు తినడండీ’ అంటూ ఉంటారు. కేవలం స్మార్ట్ ఫోను గురించి మాత్రమే కాదు గానీ.. ఇలాంటి చాలా సంగతులతో ముడిపడిన తల్లులకు చేయదలచుకున్న సూచన ఇది.. ‘అమ్మలూ అన్నం పెట్టొద్దు’!

స్మార్ట్ ఫోను సంగతి పక్కన పెడదాం. ఈ రోజుల్లో చాలా మంది తల్లులకు దీనివలన కలిగే దుష్పరిణామాల గురించి అవగాహన ఉంది. వారు స్మార్ట్ ఫోను ఇవ్వడం లేదు. కానీ భోజనం వేళ పిల్లలతో చాలా సతమతం అవుతుంటారు. వారు ఒక పట్టాన తినరు. మారాం చేస్తారు. వారిని బతిమాలి, బామాలి, బుజ్జగించి వెంటపడి పరుగులు తీస్తూ ఇల్లంతా తిరుగుతూ అన్నం తినిపిస్తూ ఉంటారు. చాలా ఇళ్లలో మనం ఈ వైనం గమనించగలం. అలాగే మరో రకం వైఖరి గూడా చెప్పుకోవాలి. కొంచెం ఎదిగిన పిల్లలకు అలక కూడా అలవాటు అవుతుంది. వారు ఏదో ఒక డిమాండును ఇంట్లో వినిపిస్తారు.

పెద్దవాళ్లు ఒప్పుకోకపోతే అలుగుతారు. అలిగినప్పుడు వారు నిరసన చూపించగల ఏకైక మార్గం అన్నం తినకుండా భీష్మించుకోవడం. ‘నాకు వద్దు’, ‘నేను తినను’ లాంటి మాటలు చాలా విసురుగా ఎదుగుతున్న పిల్లల నుంచి తరచూ వినిపిస్తుంటాయి. అప్పుడు చూడాలిక! ఒక్కో ఇంట్లో దృశ్యాలు ఒక్కో తీరుగా ఉంటాయి. కొన్ని ఇళ్లలో బతిమాలే పర్వాలు షురూ అవుతాయి, కొన్ని ఇళ్లలో వారి కోరికలను, అనుచితమైనవని తమకు తెలిసినా సరే, తక్షణం తీర్చేసే వరాలు కురుస్తాయి, కొన్ని ఇళ్లలో ఏకంగా రణరంగం ఆవిష్కృతం అవుతుంది. పిల్లలను తిట్టడమూ, కొట్టడమూ.. వారి ఏడుపులూ పెడబొబ్బలూ ఇవన్నీ నిత్యకృత్యం అవుతాయి. ఇలాంటి అన్నిరకాల అనుభవాలను ఎదుర్కొంటున్న, చవిచూస్తున్న తల్లులకు చెప్పదలచుకుంటున్న మాట ఇది. ‘అమ్మలూ.. అన్నం పెట్టొద్దు’!

తల్లిదండ్రుల్లో అత్యంత సహజమైన భావన ఒకటి ఉంటుంది. ‘మన పిల్లలను బాగా చూసుకోవాలి’ అనే భావన! ఈ భావనకు ధనిక– పేద తారతమ్యం కూడా లేదు. వారికి పూటకు గతిలేకపోవచ్చు. కానీ.. పిల్లలను బాగా చూసుకోవాలనే కోరిక మాత్రం ఉంటుంది. కలిగినదేదో ముందుకు వారికి పెట్టాలనే ఉంటుంది. కష్టాలు పడి ఎదిగిన వారైతే.. తాము పడిన కష్టాలు తమ పిల్లలు పడకూడదనే ఆరాటం కూడా కలిగిఉంటారు. పిల్లల మీద ప్రేమకు నిదర్శనంగా నిలిచే ఇలాంటి అనేక ఆలోచనల పర్యవసానమే.. పైన చెప్పుకున్న ఇబ్బందులన్నీ కూడా!

పిల్లలకు భోజనం అనేది తల్లిదండ్రులుగా తమ ప్రాథమికమైన బాధ్యత అనుకుంటూ.. తినిపించడంకోసం పడే తాపత్రయంలోనే.. ఈ వ్యవహారాలన్నీ జరుగుతూ ఉంటాయి. పిల్లల పోషణ తల్లిదండ్రుల బాధ్యత నిజమే.. కానీ ప్రతిరోజూ మూడు పూటలా తిండి పెట్టడం ఒక్కటే పోషణ కాదు కదా! తిండితో పాటు వారి బుద్ధులను తీర్చిదిద్దడం, క్రమశిక్షణ అన్నీ కూడా తల్లిదండ్రుల బాధ్యతే! ఈ విషయాన్ని కూడా అందరూ ఒప్పుకుంటారు. ‘ఒక్కపూట పిల్లలు తిండి తినకపోతే ఏమవుతుంది?’ అనే ఆలోచన చేయడానికి కూడా తల్లిదండ్రులు సాహసించరు. నిజానికి అలా ఆలోచించాలి.

ఎదుగుతున్న పిల్లలు భీష్మించుకున్నప్పుడు, పసిపిల్లలు మారాం చేసినప్పుడు.. బతిమాలకుండా ఆ పూట వారికి అన్నం పెట్టడం మానేసి చూడండి. ఫలితం మీకే అర్థమవుతుంది. ఒకపూట అన్నం తినకపోయినంత మాత్రాన పిల్లలకేమీ కాదు. ఈ విషయం ఒప్పుకోవడానికి తల్లి మనసు, తల్లిప్రేమ అంగీకరించదు. ఆ అనుచితమైన ప్రేమ వల్లనే పైన చెప్పుకున్న అన్ని ఇబ్బందులూ వస్తాయి. పసివాడు అన్నం తిననని మొండికేశాడు.. ఏదో రకంగా వాడికి తినిపించేయాలనే ఆరాటంతో చేతిలో ఫోను పెట్టడం మనమే అలవాటు చేస్తాం. అందులో పిల్లల వయసును బట్టి యూట్యూబులో రైమ్స్, కార్టూన్స్ చూసుకోవడం, గేమ్స్ ఆడడం వంటివాటికి అడిక్ట్ అవుతారు. ఇక్కడినుంచి మొదలై ఫోను చేతికి ఇస్తే తప్ప అసలు అన్నం వద్దకు రాని పరిస్థితి ఏర్పడుతుంది. తొలినాళ్లలోనే అసలు ఫోను ఇవ్వకపోతే.. ఆ మాటకొస్తే ఒక పూట అన్నం పెట్టకపోతే ఏమవుతుంది?

పసి పిల్లలకు కల్మషం, ద్వేషం తెలియవు. ‘ఫోను ఇవ్వను.. తింటే తిను, తినకపోతే పో’ అని తల్లి చెబితే వారు కొద్దిసేపు మారాం చేయవచ్చు గాక.. కానీ తల్లిని ద్వేషించరు. అప్పటికి అలిగి వెళ్లిపోతారు. కానీ.. కాసేపటికి ఆకలి వేస్తుంది. ఆకలి వేసినప్పుడు వాళ్లే వచ్చి అన్నం పెట్టమని అడుగుతారు. అప్పుడు పెట్టాలి. ఫోను కాదు కదా.. కనీసం టీవీ పెట్టమనే డిమాండు కూడా లేకుండా చప్పుడుచేయకుండా తిని వెళతారు. ఏ వయసు పిల్లలైనా మారాం చేసే సందర్భాల్లో ఈ సూత్రం వర్తిస్తుంది. ఎదిగిన పిల్లల విషయంలో తల్లులు ఇంకొంచెం కఠినంగా కూడా ఉండవచ్చు. వారి డిమాండ్లకోసం అలిగి తినడం మానేస్తారు. వారిని బతిమాలకుండా వదిలేయండి.

భోజనానికి పిలిచినప్పుడు ఇప్పుడు నాకొద్దు అనే సందర్భాల్లో కూడా రెట్టించకుండా వదిలేయండి. ఆకలి వేసినప్పుడు తింటారు. ఆహారం తీసుకోవడం అనేది, తినడం అనేది వారి అవసరం.. ఆ అవగాహనను ఎదుగుతున్న పిల్లల్లో కూడా కల్పించలేకపోతే అది తల్లిదండ్రుల వైఫల్యం అవుతుంది. అనుచితమైన డిమాండ్లను, శక్తికి మించి తీర్చడం ప్రారంభిస్తే కుటుంబాలు కుంగిపోవడం మాత్రమే కాదు.. పిల్లలు కూడా గాడితప్పుతారు. క్రమశిక్షణ లేకుండా తయారవుతారు. పిల్లల పెంపకం అనేది కేవలం వారికి తినిపిస్తూ పుష్టిగా చూసుకోవడం మాత్రమే కాదు. ముందే చెప్పుకున్నట్టు వారి బుద్ధులను తీర్చడం, వ్యక్తిత్వాన్ని నిర్మించడం కూడా. ఆ విషయాన్ని ప్రతి తల్లీ దృష్టిలో పెట్టుకోవాలి.

..కె.ఎ. మునిసురేష్ పిళ్లె

6 Replies to “మునివాక్యం: అమ్మలూ.. అన్నం పెట్టొద్దు!”

  1. ఫోన్ ఇవ్వలేదని.. రిమోట్ ఇవ్వలేదని.. బర్త్డే పార్టీ చేయలేదని.. సినిమాకి తీసుకెళ్లలేదని.. ఫ్రెండ్స్ తో తిరగనివ్వలేదని.. ఇలా చిన్నా చితకా కారణాల వల్ల పిల్లలు.. పెళ్ళాలు.. ఆత్మహత్యలు చేసుకున్న కే సు లు చాలానే ఉన్నాయి..

  2. కుటుంబానికి ఒక బిడ్డ అనే అలవాటు వచ్చాక గారాబం ఎక్కువైపోయి పిల్లలు సైకోలుగా తయారవుగుతున్నారు

  3. ప్లే బాయ్ వర్క్ వుంది ఏడు తొమ్మిది తొమ్మిది ఏడు ఐదు మూడు ఒకటి సున్నా సున్నా నాలుగు

Comments are closed.