దర్శకులు రామ్ గోపాల్ వర్మ, మణిరత్నంలు ఒకానొక సమయంలో బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యారు. సౌతిండియా నుంచి వచ్చి దేశ వ్యాప్తంగా పేరు తెచ్చుకొన్న ఈ దర్శకులిద్దరూ కలిసి సినిమాలు చేద్దామని ఒక ఒడంబడికకు వచ్చారు. ఇద్దరూ కలిసి కొన్ని నెలల పాటు సినిమా గురించి చర్చించుకొన్నారు. అలా వీరి కాంబినేషన్‌లో రెండు సినిమాలు వచ్చాయి. వాటిలో ఒకటి ‘గాయం’ రెండోది ‘దొంగా దొంగా’ తొలిసినిమాకు వర్మ దర్శకత్వం వహిస్తే, రెండో సినిమాకు మణి దర్శకత్వం వహించాడు. ఈ సినిమాల ఫలితాల గురించి కాదు కానీ.. వీటి తర్వాత ఈ దర్శకులు ఎవరికి వారయ్యారు. అప్పట్లో మణితో కలిసి చేసిన జర్నీ గురించి వర్మ ఈమధ్య స్పందిస్తూ… ‘ఆయనేం చెబుతున్నాడో నాకర్థమయ్యేది కాదు.. నేనేం చెప్పానో ఆయనకు అర్థం అయ్యేది కాదు..’ అంటూ వ్యాఖ్యానించాడు. ఈ ఉపోద్ఘాతం ఎందుకంటే.. ఇద్దరు సృజనకారుల మధ్య సఖ్యత కుదరడం అంత ఈజీ కాదని చెప్పడానికి. అయితే దీనికి కొంతమంది మినహాయింపు. అలాంటి మినహాయింపుల్లో ప్రథమంగా చెప్పుకోవాల్సిన వారు సిద్ధిక్ -లాల్.
రచయితలుగా దశాబ్దాల పాటు కలిసి పనిచేసిన వారున్నారు.. సంగీతంలో కలిసి రాణించిన జోడీలున్నాయి… నిర్మాతలుగా కూడా కొంతమంది స్నేహితులు పేరు పొందారు. దర్శకులుగా కలిసి పనిచేసిన వారు మాత్రం తక్కువే. బాలీవుడ్‌లో అబ్బాస్- మస్తాన్ వంటి అన్నదమ్ముల ద్వయం చాలా సినిమాలు చేశారు. సౌతిండియాలో మాత్రం కాంబినేషన్‌లో సెన్సేన్షన్ క్రియేట్ చేసిన వారు సిద్ధిక్- లాల్‌లు మాత్రమే.
ఈ మళయాళీ దర్శకులు తీసింది అలాంటిలాంటి సినిమాలు కాదు. అవి కేవలం ఒక భాషకు పరిమితం అయినవి కావు. వీరు అక్కడ తీసిన సినిమాలు ఇతర ఇండస్ట్రీల వారిని కూడా ఆకట్టుకొన్నాయి! అనేక భాషల్లో రీమేక్ అయ్యాయి. ఎక్కడిక్కడ హిట్ అయ్యాయి. అలాంటి సృజనకారులు వీరిద్దరూ. ప్రస్తుతానికి ఈ జంట విడిపోయినా.. వీరు కలిసి చేసిన సినిమాలు మాత్రం శాశ్వతం.
వీళ్లిద్దరి నెరేషన్ ఎంత అద్భుతంగా ఉంటుందో చెప్పడానికి ‘హిట్లర్’ వంటి సినిమాను ఉదాహరణగా చెప్పవచ్చు. తెలుగులో చిరంజీవి హీరోగా వచ్చిన ఈ సినిమాను మొదట తెరెకక్కించింది ఈ దర్శకద్వయమే. మళయాళంలో మమ్మూట్టీ హీరోగా వీరు ‘హిట్లర్’ను రూపొందించారు. ఈ స్ట్రాంగ్ సబ్జెక్ట్ దక్షిణాది ఇండస్ట్రీలను ఆకట్టుకొంది. చిరంజీవి వెంటనే ఆ సినిమాను రీమేక్ చేశాడు. ఇక్కడా హిట్ అయ్యింది. ఆ తర్వాత తమిళంలో సత్యరాజ్ దీనిపై కన్నేశాడు. కన్నడలో విష్ణువర్ధన్ హీరోగా రీమేక్ అయ్యింది. హిందీలో సునీల్ షెట్టి హీరోగా రూపొందింది! ఇలా ఈ దర్శకుల ఉమ్మడి ప్రయత్నం ఇండియాలోని చాలా భాషల ఇండస్ట్రీల్లో రీమేక్ అయ్యింది.
ఇది ఒక్క ఉదాహరణ మాత్రమే. హిందీలో ‘హేరా ఫెరీ’ అనే ఇండస్ట్రీ హిట్ ఉంది. పరేష్ రావల్, అక్షయ్ కుమార్, సునీల్ షెట్టిలు ముఖ్యపాత్రల్లో నటించిన ఆ కామెడీ సినిమా అంత వరకూ బాలీవుడ్ చరిత్రలోని కలెక్షన్ల రికార్డులను తిరగరాసింది. హిందీలో 2000 సంవత్సరంలో విడుదలైన ఈ సినిమాకు మూలం 1998లో సిద్ధిక్ లాల్‌లు తీసిన ‘రామ్ జీరావ్ స్పీకింగ్’ అనే మళయాళీ సినిమా. పదకొండేళ్ల తర్వాత ప్రియదర్శన్ దీన్ని హిందీలో తీస్తే రికార్డులు సృష్టించింది. ఇదే సినిమా తెలుగులో ‘ధనలక్ష్మి ఐలవ్యూ’ పేరుతో రూపొందింది. హిందీలో హేరాఫెరీకి సీక్వెల్ కూడా వచ్చింది. అలాంటి ఈ సినిమా సోల్ క్రెడిట్ సిద్ధిక్ -లాల్‌లేక చెందుతుంది.
‘మధురానగరిలో..’ తెలుగులో 90లలో వచ్చిన ఒక సూపర్ హిట్ సినిమా. దీని మూలాన్ని తీసిన వారు కూడా దర్శకద్వయమే. మళయాళంలో ‘ఇన్ హరిహర నగర్’ పేరుతో రూపొందిన ఈ సినిమా తెలుగు, కన్నడ, తమిళ భాషల్లో రీమేక్ అయ్యి ఎక్కడిక్కడ సూపర్ హిట్ అయ్యింది. విశేషం ఏమిటంటే.. హిందీలో దీన్ని రెండు సార్లు రీమేక్ చేశారు. 1991లో మళయాళంలో వచ్చిన ఈ సినిమాను 92లో బాపయ్య దర్శకత్వంలో రీమేక్ చేయగా.. ఇదే సబ్జెక్ట్‌ను 2007లో ధోల్ పేరుతో ప్రియదర్శన్ మళ్లీ రీమేక్ చేసి హిట్ కొట్టాడు. అదీ ఈ సబ్జెక్టుకు ఉన్న సత్తా!
‘పెద్దరికం’ ఈ సినిమా జగపతి బాబు కెరీర్‌కు టర్నింగ్ పాయింట్. తండ్రి ప్రొడక్షన్‌లో వచ్చిన సినిమాలు హిట్ కాకపోవడంతో డల్ అయిపోయిన జగపతికి ‘పెద్దరికం’ హీరోయిజాన్ని తెచ్చి పెట్టింది. దీనికి మూలం ‘గాడ్ ఫాదర్’ అనే మళయాళ సినిమా. దాన్ని రూపొందించిందీ ఈ దర్శకద్వయమే. ఈ సినిమా హిందీలో కూడా రీమేక్ అయ్యింది.
మన్నర్ మథాయ్ స్పీకింగ్(1995) అని ఒక సినిమా తీశారు. ఇదే సినిమా హిందీలో ‘భాగమ్ భాగ్’ పేరుతో రూపొందింది. ఇదే సినిమాను తెలుగులో ‘బ్రహ్మానందం డ్రామా కంపెనీ’ పేరుతో రీమేక్ చేశారు.
ఈ దర్శక స్నేహితులు ఇద్దరూ కలిసి ‘ఫ్రెండ్స్’ అని మరో సినిమా తీశారు. బహుశా ఈ ఫ్రెండ్స్ కలిసి చేసిన ఆఖరి సినిమా ఇదే కాబోలు! ఇది తెలుగులో ‘స్నేహమంటే ఇదేరా’గా నాగార్జున, సుమంత్‌ల కాంబినేషన్‌లో వచ్చింది. తమిళంలో కూడా ఈ సినిమా రూపొందింది!
ఇలాంటి హిట్ పెయిర్ చాలా సంవత్సరాల కిందటే విడిపోయింది. నిర్మాతలుగా, దర్శకులుగా, నటులుగా కలిసి పనిచేసిన వీళ్లిద్దరూ ఎవరికి వారయ్యారు. లాల్ చాలా సినిమాల్లో నటించాడు. ‘పందెంకోడి’ సినిమాలో విలన్‌గా చేసి తెలుగువాళ్లకు కూడా టచ్‌లోకి వచ్చాడు. సిద్ధిక్ నటుడిగా దర్శకుడిగా కొనసాగుతున్నాడు. ఇప్పటికీ మళయాళంలో సిద్ధిక్ చేసిన సినిమాలు అనేక భాషల్లో రీమేక్ అవుతున్నాయి. ఈ మధ్య కాలంలో వచ్చిన ‘బాడీగార్డ్’ను తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రీమేక్ చేశారు.
కొసమెరుపు ఏమిటంటే ఇన్నిహిట్ సినిమాలు తీసిన సిద్ధిక్ తెలుగులో ఒక స్ర్టైట్ సినిమాకు దర్శకత్వం వహించాడు. అది మాత్రం అట్టర్ ప్లాఫ్ అయ్యింది. నితిన్ వరస ఫెయిల్యూర్‌లలో ఉన్నప్పుడు వచ్చిన ‘మారో’ అనే సినిమాను తీసింది సిద్ధిక్ ఎన్నో అవాంతరాల మధ్య విడుదలైన ఈ సినిమా డిజాస్టర్‌గా నిలిచింది.