ఆంధ్రప్రదేశ్‌లో కొత్త దేశ భక్తుడు పుట్టుకొచ్చాడు. ఈయన తప్ప, మరెవరూ ఆంధ్రప్రదేశ్‌లో దేశ భక్తులు లేరు. ఆ కొత్త దేశ భక్తుడే జనసేనాని పవన్‌కల్యాణ్. దేశమన్నా, మనుషులన్నా పవన్‌కు తప్ప, మరెవరెకీ ప్రేమాభిమానాలు లేవన్నట్టు ఆయన మాట తీరు వుంది. అదే విమర్శలకు దారి తీసింది.
'సొంత లాభం కొంత మానుకు, పొరుగు వాడికి తోడుపడవోయి.. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయి…' అని మహాకవి గురజాడ అప్పారావు అన్నారు. కానీ దేశ భక్తికి పవన్‌కల్యాణ్ తనదైన స్టైల్‌లో కొత్త నిర్వచనాన్ని కనిపెట్టారు. దేశమంటే తానొక్కడినే అని ఆయన చెబుతున్నారు. తనకే మాత్రం గిట్టని జగన్‌ను విమర్శించడానికి దేశభక్తి అంటూ సెంటిమెంట్ పల్లవి ఎత్తుకోవడాన్ని పవన్ మాటల్లో గమనించొచ్చు.
'నువ్వు పరీక్షల్లో కాపీ కొట్టేటప్పుడు దేశం గురించి ఆలోచిస్తున్నా. నువ్వు ఎస్ఐపై దాడి చేసేటప్పుడు భగత్‌సింగ్ గురించి ఆలోచిస్తున్నా' అని సీఎం వైఎస్ జగన్‌పై 'దేశ' భక్తుడైన పవన్ కల్యాణ్ అవాకులు చెవాకులు పేలడం విమర్శలపాలైంది. జగన్‌పై విద్వేషం పవన్‌లో విచక్షణను కోల్పోయేలా చేస్తోందనే అనుమానాలు కలుగుతున్నాయి. దేశ భక్తి గురించి మహనీయులు రాసిన కవిత్వాన్ని బహిరంగ సభల్లో చదువుతూ, అదే తనలో ఉన్నట్టు బిల్డప్ ఇవ్వడం పవన్‌కు పరిపాటైంది.
పవన్ దృష్టిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దేశ ద్రోహి. మరి ఆయన ప్రేమించే చంద్రబాబునాయుడు, రామోజీరావు, లోకేశ్, నందమూరి బాలకృష్ణ తదితరుల సంగతేంటి? వీళ్లెవరికీ దేశ భక్తి లేదా? భారతదేశాన్ని ప్రేమించని హృదయం వుంటుందా? అదేంటో గానీ, ప్రతిదీ తానే అన్నట్టు పవన్‌కల్యాణ్ తెగ ఫీల్ అవుతున్నారనే విమర్శ వెల్లువెత్తుతోంది.
దేశమును ప్రేమించుమన్నా
మంచి అన్నది పెంచుమన్నా
దేశమంటే మట్టి కాదోయ్
దేశమంటే మనుషులోయ్ !
వట్టి మాటలు కట్టి పెట్టోయ్
గట్టి మేల్ తలపెట్టవోయ్ …అని మహాకవి గురజాడ కవిత్వాన్ని స్ఫూర్తిగా తీసుకున్న వాళ్లెవరూ ఇతరులను నిందిస్తూ వుండరు.
దేశ భక్తి అంటే సాటి మనుషుల్ని ప్రేమించడం. పవన్‌లో మచ్చుకైనా అది కనిపించదు. పవన్ కల్యాణ్ ప్రసంగాలు మనుషులు, ప్రాంతాల మధ్య విద్వేషాల్ని పెంచేలా ఉన్నాయి. పులివెందుల వాసుల్ని రౌడీలుగా చిత్రీకరించడాన్ని ఎలా చూడాలి? మంచిని పెంచాలనే ప్రయత్నం పవన్‌లో ఏ మాత్రం కనిపించదు. మాటలు తప్ప, చేతల్లో మేలు తలపెట్టడం అంటూ అసలు వుండదు. తాను అధికుడినని, ఇతరులంతా తన దయాదాక్షిణ్యాలపై బతుకుతున్నారనే భ్రమలో ఆయన బతుకుతున్నారు. టీడీపీ బలహీనంగా వుందని, తన వల్ల అది బతికి బట్ట కడుతోందనే అభిప్రాయాన్ని బయట పెట్టడానికి ఆయన సంకోచించకపోవడాన్ని రెండు రోజుల క్రితం చూశాం.
మనుషులంటే చిన్న చూపు, చులకన భావాన్ని మనసంతా నింపుకోవడం వల్లే, పవన్ అవాకులు చెవాకులు పేలుతున్నారు. ప్రత్యర్థులపై రాజకీయ విమర్శలు చేసిన వాళ్లను మనం ఇంత వరకూ చూశాం. కానీ తనకు తాను గొప్ప వాడిగా చెప్పుకుంటూ, ఇతరులంతా పనికిమాలిన వాళ్లన్న రీతిలో మాట్లాడ్డం కేవలం పవన్‌నే చూస్తున్నాం. ఇప్పుడు జగన్‌పై, రేపో, ఎల్లుండో చంద్రబాబు, లోకేశ్‌లపై పవన్ అనుచిత వ్యాఖ్యలు చేయకుండా వుండరు.
ఎందుకంటే ఆయన మాటల్లో దేశ భక్తి, ప్రజలపై ప్రేమ తప్ప, చేతల్లో వుండవు. నిజంగా వుంటే అంత మంది మహిళల జీవితాలతో ఆడుకునే వాడా? అని ఒక్కసారి ప్రశ్నించుకుంటే సమాధానం దొరుకుతుంది. కులాన్ని, సినిమా అభిమానుల్ని అమ్ముకుని రాజకీయాలు చేస్తున్న పవన్, అందుకు భిన్నమైన నాయకుడిగా నిరూపించుకోడానికే దేశ భక్తి మాటలు. ఎవరేమిటి అనేది ప్రజలు నిర్ణయించుకుంటారు. తన గురించి తాను ముఖ్యంగా దేశ భక్తుడిని అంటూ గొప్పలు చెప్పుకునే నాయకుడే దేశానికి అత్యంత ప్రమాదకారి అని గ్రహించాలి.