ఎన్టీఆర్‌కి భారతరత్న.. ఇంకెప్పుడు.?

తెలుగు నేలపై సరికొత్త రాజకీయానికీ, సరికొత్త పరిపాలనకీ, సరికొత్త రాజకీయ సమీకరణాలకీ తెరలేపిన ఘనుడు స్వర్గీయ నందమూరి తారకరామారావు. దేశ రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేశారాయన. తెలుగు సినిమాకి సరికొత్త దిశా నిర్దేశం చేసిన విశ్వ…

తెలుగు నేలపై సరికొత్త రాజకీయానికీ, సరికొత్త పరిపాలనకీ, సరికొత్త రాజకీయ సమీకరణాలకీ తెరలేపిన ఘనుడు స్వర్గీయ నందమూరి తారకరామారావు. దేశ రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేశారాయన. తెలుగు సినిమాకి సరికొత్త దిశా నిర్దేశం చేసిన విశ్వ కథానాయకుడాయన. ఇటు సినీ రంగంలో, అటు రాజకీయ రంగంలో స్వర్గీయ ఎన్టీఆర్‌ తనదైన ప్రత్యేకతను చాటుకున్నారు. ఎప్పటికీ చెరిగిపోని చరిత్ర ఎన్టీఆర్‌. 

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడిగా తెలుగు నేలపై చెరగని ముద్ర వేసిన ఎన్టీఆర్‌, అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం విదితమే. ఆయన మరణం వెనుక మిస్టరీ ఇప్పటికీ వీడలేదు. అల్లుడు చంద్రబాబు, వెన్నుపోటు దెబ్బకి మానసికంగా కుంగిపోయిన ఎన్టీఆర్‌, ఆ మనోవేదనతోనే ప్రాణాలు కోల్పోయారన్నది జగమెరిగిన సత్యం. అదే చంద్రబాబు, ఒకానొక సమయంలో స్వర్గీయ ఎన్టీఆర్‌ ఫొటో కన్పించకుండా చేసేశారు.. మళ్ళీ అదే చంద్రబాబు, ఇప్పుడు స్వర్గీయ ఎన్టీఆర్‌ కీర్తి ప్రతిష్టల గురించి ఘనంగా చెప్పేస్తుంటారు. అదీ రాజకీయమంటే. 

ఒకప్పుడు ఇదే చంద్రబాబుని వ్యతిరేకించిన బాలకృష్ణ, హరికృష్ణ తదితరులంతా.. ఇప్పుడు చంద్రబాబు పంచనే వున్నారు. హరికృష్ణ తీరు వేరు, ఒక్కోసారి ఆయన ఒక్కోలా వ్యవహరిస్తుంటారనుకోండి.. అది వేరే విషయం. 

ఇక, ప్రతిసారిలానే ఈసారీ స్వర్గీయ ఎన్టీఆర్‌ వర్దంతి సందర్భంగా భారతరత్న డిమాండ్‌ని టీడీపీ నేత, ఎన్టీఆర్‌ తనయుడు, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ తెరపైకి తెచ్చారు. ఎన్టీఆర్‌కి భారతరత్నను సాధిస్తామంటూ నినదించేశారాయన. ఇన్నేళ్ళలో ఏనాడూ టీడీపీ అధినేత హోదాలో చంద్రబాబు, కేంద్రంపై ఎన్టీఆర్‌కి భారతరత్న విషయమై ఒత్తిడి తెచ్చిన దాఖలాల్లేవు. ఇప్పుడు చంద్రబాబు మద్దతిచ్చిన ప్రభుత్వమే కేంద్రంలో చక్రం తిప్పుతోంది. ఆ మాటకొస్తే, గతంలో చంద్రబాబు జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పానని చెప్పుకుంటున్న సమయంలోనే ఎన్టీఆర్‌కి భారతరత్న సాధించలేకపోయారనుకోండి.. అది వేరే విషయం. 

ఎన్టీఆర్‌కి భారతరత్న వస్తుందా.? రాదా.? అన్నది వేరే విషయం. ఆ పేరు చెప్పి, టీడీపీ నేతలు ఇప్పటికీ పబ్లిసిటీ స్టంట్లు చేస్తుండడమే హాస్యాస్పదం. 'భారతరత్న ఇవ్వాల్సిందే..' అనే డిమాండ్‌ తెరపైకి తీసుకురావడం ఎన్టీఆర్‌కి అవమానకరం.. అనే స్థాయిలో సాగుతున్నాయి ఈ పబ్లిసిటీ స్టంట్లు. చంద్రబాబు సంగతి సరే సరి, రాజ్యసభ సభ్యుడిగా పనిచేసిన కాలంలో హరికృష్ణ ఏం చేశారు.? ఎమ్మెల్యేగా రెండున్నరేళ్ళ పదవీ కాలంలో బాలకృష్ణ, తనంతట తానుగా ఎన్టీఆర్‌కి భారతరత్న కోసం ఏం ప్రయత్నాలు చేశారు.? ప్చ్‌.. ఏమీ లేదు.. ఎందుకంటే, బావ చంద్రబాబు చాటు బావమరుదులే ఈ ఇద్దరూ. 

మీడియా ముందుకొచ్చి స్వర్గీయ ఎన్టీఆర్‌ని తలచుకుంటూ ఆవేశపూరిత ప్రసంగాలు చేయడమ్మీదున్న శ్రద్ధ, ఎన్టీఆర్‌కి భారతరత్న సాధించే విషయంలో మాత్రం కన్పించదు. అందుకే, స్వర్గీయ ఎన్టీఆర్‌కి భారతరత్న అనేది ఓ కలగా మిగిలిపోయింది.