తానా…తందనా..ఓట్ల వేటన్నా..

ఏ దేశ మేగినా, ఎందు కాలిడినా స్వదేశాన్ని పొగడమన్నారు…కానీ మనవాళ్లు ఇప్పుడు వేరే పనిలోవున్నారు. ఏ దేశమేగినా, ఎక్కడ కాలు పెట్టినా ముందు అక్కడ ఓ సంఘం పెట్టి, ఆపై ఆ సంఘం అధికారం…

ఏ దేశ మేగినా, ఎందు కాలిడినా స్వదేశాన్ని పొగడమన్నారు…కానీ మనవాళ్లు ఇప్పుడు వేరే పనిలోవున్నారు. ఏ దేశమేగినా, ఎక్కడ కాలు పెట్టినా ముందు అక్కడ ఓ సంఘం పెట్టి, ఆపై ఆ సంఘం అధికారం సంపాదించి, ఇకపై ఆ అధికారం ఆలంబనగా స్వదేశంలో పనులు చేయించుకోవాలనుకుంటున్నారు. ఈ తరహా కార్యక్రమాల్లో ముందు వుంటుంది..తానా సంస్థ. తెలుగు అసోసియేషన్ ఆప్ నార్త్ అమెరికా. 

దగ్గర దగ్గర నాలుగు దశాబ్దాలకు చేరుకుంటోంది తానా వయస్సు. దాంతో దీనికి ఎన్ని అవలక్షణాలు రావాలో అన్నీ వచ్చేసాయి. ముఖ్యంగా తానా ఎన్నికలు ఓ ప్రహసనంగా మారాయి. ఈ సారి మళ్లీ వచ్చాయి. ఆంధ్రలో జరిగే సార్వత్రిక ఎన్నికలను మరిపిస్తున్నాయి ఇవి. పోటా పోటీ ప్రచారాలు, వదంతులు, ప్రకటనలు, ఓహ్…ఒకటేమిటి? నానా హడావుడి జరుగుతోంది. 

సరే ఎన్నికలు అన్నాక ఇవన్నీ కామన్. కానీ తానా ఎన్నికల స్పెషాలిటీ ఏమిటీ అని అడిగితే, చాలా మంది సభ్యులు చెప్పేది భలే చిత్రంగా వుంటుంది. తొమ్మిది వేల పైచిలుకు ఓటర్లు వున్నారు. వారు అమెరికా అంతా స్ప్రెడ్ అయి వున్నారు. అందువల్ల పోస్టల్ బ్యాలెట్ మినహా మరే మార్గం లేదు. ఇదే అదనుగా వుంది పోటీ దారులకు. గతంలో ఎప్పుడో ఎవరో మార్గం వేసేసారు. బోలెడు భోగస్ ఓట్లను చేర్చారని టాక్. ఇప్పుడు అదే కలిసివస్తోంది. పైగా పోస్టల్ ఓటింగ్. బ్యాలెట్ ఓటరు ఇంటికి చేరడం భయం, పోటీదారు మనుషులు వాలిపోతారు. మనం..మనం..బరంపురం..లేదా, గిఫ్ట్ పట్టు..ఓటు కొట్టు..ఇలాంటి స్కీములతో ఆ ఓటు చేజిక్కించుకోవడం. 

ఈ సారి ఎన్నికల ప్రత్యేకత ఏమిటంటే, ఓట్లకు బదులుగా కుర్రాళ్లకు గాడ్జెట్ లు కూడా గిఫ్ట్ గా అందిస్తున్నారని టాక్. బ్యాలెట్ లు పోస్టులో వెళ్లగానే, కాస్త ఎక్కువ ఓట్లు వున్న కమ్యూనిటీ పోస్టు బాక్స్ దగ్గర కాపు కాసేస్తున్నారట. మరీ మన దేశంలో మాదిరిగా కాదు కదా, ఏ టైమ్ కు బ్యాలెట్ డెలివరీ అవుతుందో కచ్చితంగా తెలుస్తుంది. అంతే టక్కున వాలిపోయి, ఓటరును లటుక్కున పట్టేసుకుంటున్నారట.

అసలు ఇంత హడావుడి, ఇంత ఖర్చు తానాలో ఎందుకు జరుగుతోంది..దీనివల్ల ఏం ఒరుగుతుంది..పైగా ఈ ఏడాది మరీ ఎందుకింత హడావుడి? అంటే…తానా సంఘంలో మెజారిటీ వర్గం ఓ సామాజికవర్గానికి చెందినవారే. ఆ సామాజికవర్గ ప్రభుత్వమే ఇప్పుడు ఆంధ్రలో వుంది. అందువల్ల తానా పగ్గాలు అందుకుంటే, ఇక్కడ స్వరాష్ట్రంలో తమ పనులు, అనుమతులు, ఇంకా ఏమన్నా కావాలంటే చక్కబెట్టుకొవచ్చంట. 

అందుకే ఈసారి ఎన్నికలు మరింత గరమ్ గరమ్ గా మారాయి. ప్రకటనలకు, గిఫ్ట్ లకు, ప్రచారానికి ఇబ్బడి ముబ్బడిగా డబ్బు ఖర్చు చేస్తున్నారట. అదేదో సినిమాలో డైలాగులా చెప్పుకోవాలంటే…’…అబ్బే..వీళ్లు మారరు….మారరంతే’..

చాణక్య

[email protected]