తీసిందే బొమ్మ! చూసింది కాదా..?

వామ్మో! Advertisement తిట్టేసుకుంటున్నారు; కొట్టేసుకుంటున్నారు; తన్నేసుకంటున్నారు. తాను తీసిందే సినిమా అనీ దర్శకుడూ, తాను రాసిందే సమీక్ష అని సమీక్షకుడూ ఒకటే తన్నులాట. (తన్నులెన్ను వారు తమ తన్నులెరుగరు!) ఎంత గొప్ప సినిమా తీసినా,…

వామ్మో!

తిట్టేసుకుంటున్నారు; కొట్టేసుకుంటున్నారు; తన్నేసుకంటున్నారు.

తాను తీసిందే సినిమా అనీ దర్శకుడూ, తాను రాసిందే సమీక్ష అని సమీక్షకుడూ ఒకటే తన్నులాట. (తన్నులెన్ను వారు తమ తన్నులెరుగరు!) ఎంత గొప్ప సినిమా తీసినా, చూడ్డానికి ప్రేక్షకుడు ఒకడుండాలని దర్శకుడూ, ఎంత మహా సమీక్ష చేసినా చదవటానికి పాఠకుడంటూ ఒకడుండాలని వీక్షకుడూ  ఈ తన్నులాటలో మరచిపోయారు. యథా సినిమా, తధా సమీక్ష. ఈ సూత్రీకరణని తిరగేసినా అర్థానికి వచ్చిన ముప్పేమీ లేదు.

ఏ తన్నులాటకయినా ఓ రీతి వుంటుంది. బూతుతో మొదలయినా, నీతితోనే ముగుస్తుంది. కానీ ఆ నీతి ఎలాగుంటుందయ్యా అంటే, దానికన్నా బూతే మేలనిపిస్తుంది. బూతులు చాలించి, ఒకరికొకరు నీతులు చెప్పుకునే స్థాయికి ఈ రెండు పాత్రలు వచ్చేశాయి. ఫలితంగా,సినిమాలు ఎలా తీయాలో సమీక్షకుడూ, సమీక్షలెలా రాయాలో దర్శకుడూ పాఠాలు బోధించుకోవటం మొదలు పెట్టాశారు.

ఈ రెండు పాత్రలూ ఏ పరిశ్రమకూ కొత్త కానట్లే, తెలుగుసినిమా పరిశ్రమకీ, తెలుగు ప్రసార మాధ్యమాలకీ కొత్త కాదు. కాకుంటే, వీరి ప్రవర్తనే వింతగా వుంది. కనీసంగా ‘కొత్త’ గా వున్నా బాగుండేది. చూసేవాళ్ళకీ, చదివే వాళ్ళకీ వినోదమన్నా దేక్కది. వారు ఎప్పుడూ తీసే, వీరు ఎప్పుడూ ‘డిఫరెంట్ చిత్రం’ లాగా, ‘డిఫరెంట్ రివ్యూ’లాగానే వుంది.

అన్ని గడ్డల మీద వున్నట్లే, తెలుగు గడ్డల ( రెండు రాష్ట్రాల వల్లే ఈ బహువచనం) మీద ఎప్పటినుంచో దర్శకుడనే వాడు చిరంజీవిలా వుంటున్నాడు. కొన్నాళ్ళు నిర్మాత చాటునా, మరి కొన్నాళ్ళు హీరో చాటునా,  ఇంకొన్నాళ్ళు తన చాటునా, మరింకొన్నాళ్ళు మార్కెట్టు చాటునా దాక్కొని వున్నాడు. అయితే ‘సొంతసరకు’ వున్నవాడు ఎక్కడ దాక్కున్నా కనిపించిపోయేవాడు. అది వేరే విషయం.

సమీక్షల్లో ‘అంకెల’ యుగం!

సమీక్షకుడు మాత్రం తక్కువ తిన్నాడా? అప్పట్నుంచీ వుంటూనే వున్నాడు. అనుకున్నది అనుకున్నట్లు రాసి కొన్నాళ్ళూ, అనుకోనిది అనుకున్నట్లు రాసి ఇంకొన్నాళ్ళూ, ఇలా అనుకుంటే బాగుంటుందని రాసి మరి కొన్నాళ్ళూ, ఎవరూ అనుకోనిది తాను మాత్రమే అనుకున్నట్లు రాసి మరి కొన్నాళ్ళూ తన ఉనికిని చాటుకున్నాడు. అయితే మధ్యల్లో సమీక్షల్లేని కాలం అంటూ ఒకటి వచ్చింది. ‘విమర్శించావా? నీ పత్రికకు ప్రకటనివ్వను ఫో’ అని తెలుగు సినిమా పరిశ్రమ  మొత్తం, తెలుగు పత్రికా రంగాన్ని బెదరించి బతికేసిన ‘మధ్యయుగం’ ఒకటి నడిచింది. మళ్ళీ, టీవీలూ, వెబ్‌సైట్లూ, ఎఫ్‌ఎంలూ, ఫేస్ బుక్‌లూ, ట్విట్టర్‌లూ వచ్చాక, ‘చచ్చు సినిమాను’ సైతం సూపర్ హిట్టు అని బాకాకొట్టించుకోవటం కష్టమయింది. నీకు నవ్వు ‘హిట్’ అనుకుంటే కుదరదనీ, ‘ఫట్’ అనటానికి వెయ్యినొక్క మంది వున్నారనీ ఈ బహుళ మాధ్యమాలు నిరుపించేశాయి. దాంతో సమీక్షలు మళ్ళీ పాత వేగంతో దూసుకొచ్చాయి. పైపెచ్చు ఇది  ఇంజనీరింగుచదువులొచ్చేసిన యుగమాయె!  అందరూ ‘లెక్కల్లో మనుషులు’ అయిపోయారు. దాంతో సమీక్షల్ని అక్షరాలతో పాటు అంకెల్లో  కూడా చెప్పాలిస్స వచ్చింది. దాంతో సమీక్షకులు మార్కులు వేసే విక్రమార్కులుగా కూడా మారిపోయారు. ఈ మార్కుల్ని ఎంత ‘కొసరి కొసరి’ వేస్తే అంత గొప్ప. ఈ గొప్పను ప్రేక్షకుడు గుర్తించాడో లేదో కానీ, దర్శకుడు గుర్తించటం మొదలు పెట్టాడు. ‘హత్తెరి! అయిదు మార్కులికీ రెండే వేస్తావా?’ అని ఒక దర్శకుడూ, ‘సున్నా’ చుట్టడానికి నువ్వెరవోయ్’ అని ఇంకొక దర్శకుడూ ‘మైకు’లు దూసేశారు. (చర్చలప్పుడు టీవీ చానెళ్ళ వాళ్ళు కత్తులూ, కటారులూ వంటి మారణాయుధాల్ని అందుబాటులో వుంచరు.) ‘నెగటివ్/మైనస్ మార్కుల’ విధానాన్ని సమీక్షకులు ఇంకా ప్రవేశ పెట్టినట్టు లేరు.

ఇలాంటప్పుడే ఈ ‘సమీక్షకులు’ ఎవరన్న ఆరా వచ్చింది. వీరి అర్హతలేమిటి? వీరు ఏం చదువుకుంటారు? వీరికి శిక్షణ వుందా? వీరి అనుభవం ఏపాటిది? వీరి రాతలకూ, మార్కులకూ ప్రమాణాలుంటాయా? ఇరవయినాలుగు క్రాఫ్టులున్న సినిమాకు, ఒక్కొక్క క్రాఫ్టుకీ ఎన్నేసి మార్కులు వేస్తారు? వీరి భాష ఏమిటి? వీరి పేర్లేమిటి? వీరు జ్ఞాతులా? అజ్ఞాతులా? రచయితలా? భూత రచయితలా?

ఇన్ని కూపీలు లాగేస్తుంటే, నిజంగా తమ నెత్తి మీద ‘పదిలక్షలు’ వెలతో తిరుగున్న ఉగ్రవాదులమేమో అన్న అనుమానం సమీక్షకులకు మాత్రం రాకుండా వుంటుందా? అంతే కాదు. తాము రాసిందే రాతనీ, వేసింది మార్కు అనే నమ్మకం కుదరకుండా వుంటుందా? అసలు ప్రేక్షకులు మొత్తం తాము చూడమంటే చూసేలా, వద్దంటే మానేలా తయారయిపోయారని నిర్ధారణ చేసుకోకుండా వుంటారా? ఇంత ఆత్మవిశ్వాసం వచ్చేశాక నీతి బోధలకు పాల్పడకుండా వుంటారా?

ప్రేక్షకుడిది ‘ప్రేక్షక’ పాత్రేనా?

ఇలా ఇరుపక్షాల్లోనూ కరువయిన ‘వినయం’ కారణంగా దర్శకుడు ప్రేక్షకుణ్ణీ, సమీక్షకుడు పాఠకుణ్ణీ మరచిపోయారు. అంతే కాదు. ఇంత కన్నా గొప్ప సమీక్ష తాను చేసేయగలనని దర్శకుడూ, ఇంత కన్నా గొప్ప సినిమా తీసేయగలనని సమీక్షకుడూ నమ్మేసే దశకొచ్చారు. ఇంత వరకూ వచ్చేశాక ‘తన్నులాట’ తప్పుతుందా?

‘డిస్చార్జ్’ షీట్లు

ఈ వివాదంలో దర్శకుడు సమీక్షకుడి మీద ఒక అభియోగపత్రాన్ని నమోదు చేశాడు. అందులోని అభియోగాలు:

 సినిమాను వదలేసి దర్శకుడి మీద పడుతున్నాడు

కెమెరా ఎక్కడ పెట్టామో, ఎలా పెట్టామో, అసలు ఏ కెమెరా పెట్టామో తెలీని వాడు కూడా సమీక్ష రాసేస్తున్నాడు.

ప్రయోగం బోధపడక, అజ్ఞాన ప్రదర్శన చేస్తున్నారు.

తిట్టి పోసి, విమర్శ అంటున్నారు

మరి సమీక్షకుడు దర్శకుడి మీద చార్జ్‌షీట్ పెట్టలేదా? అదీ వుంది:

ప్రయోగాల పేరిట నిర్మాతల చేతి చమురు వదలిస్తున్నారు.

 సమీక్షకుడి స్వేఛ్చను కొల్లగొడుతున్నారు.  

సమీక్ష గురించి ఓనమాలు తెలియకుండా మాట్లాడుతున్నారు.

పరస్పర నిందారోపణల్లో ఉత్తమమైన జంతువుల ప్రస్తావన, బ్లాక్ మెయిలింగ్ ఆరోపణలూ దొర్లుతున్నాయనుకోండి. అది వేరే విషయం.

ఆడిందెల్లా బొమ్మ కాదు!

ఎంత టెక్నాలజీ వచ్చినా, ఎన్ని పరిణామాలు చెందినా, కెమెరాను ముంజేతికి కట్టుకుని పరుగెత్తుతూ తీసినా, ‘చాపర్’ మీద ఎగరేసినా సినిమా సినిమాయే. దాని ప్రధాన ధ్యేయం వినోదాన్నివ్వటం. సమాజ హితాన్ని కోరి సినిమాలు తీసిన సత్యజిత్ రేలు కూడా సినిమా ముందుగా చెయ్యవలసిన పని ‘వినోదాన్ని’ వ్వటం అని తేల్చేశారు. నాగరీకులమవుతున్న కొద్దీ వినోదస్థాయి పెరుగుతుంది. రోజు వారీ జీవితంలో కొందరు మనల్ని నవ్వించే వారుంటారు. కొందరు బూతు జోకులుతో తప్ప నవ్వించలేరు. కొందరు హుందాఅయిన హాస్యంతో నవ్విస్తుంటారు.  ఆదరణ ఇద్దరికీ వుంటుంది. అలాగని ఇద్దరివీ గొప్ప జోకులని అనలేం. కాబట్టి హిట్టయిన ప్రతీ చిత్రమూ గొప్ప చిత్రమనీ, మార్కెట్టు ఆదరించని ప్రతీ చిత్రమూ చెత్త చిత్రమనీ చెప్పలేం. సభ్యత పెరిగిన సమాజానికి బూతు జోకులతో పని వుండదు. సమాజాన్ని ఆస్థాయికి తీసుకు వెళ్ళే ప్రయత్నం ఎవరన్నా చేస్తే బాగుంటుంది. ఈ బాధ్యతను స్వీకరించే శక్తి కానీ, ఆసక్తి కానీ వున్న వాళ్ళు ఇటు దర్శకుల్లోనూ, అటు సమీక్షకుల్లోనూ తక్కువే వున్నారు.

‘దృశ్య’రాస్యులేరీ?

సినిమా తీయటమే కాదు, చూడటమూ ఒక విద్యే అని కొన్ని దేశాల్లో కొందరు ఆమాయకపు విద్యావేత్తలు భావిస్తుంటారు. వారి మాటల్ని నమ్మేసి, ఆయా దేశాల్లోని స్కూళ్ళలో ప్రాధమిక విద్య నుంచే ‘సినిమాను మెచ్చే విద్య’ (ఫిల్మ్ అప్రిసియేషన్ కోర్సు) ను బోధిస్తారు. ఎప్పుడో కొట్టబోయే ఐఐటి సీటుకోసం, ఎల్‌కేజీనుంచే ఇక్కడ బోధించేస్తున్నారే అలాగన్న మాట. ఈ విద్యను, అక్షరాస్యత లాగా  ‘దృశ్యరాస్యత’ (విజుయల్ లిటరసీ) అని కూడా గొప్పగా చెప్పేసుకుంటారు. ఇలా చదువుకున్న వాళ్ళు సినిమాలు చూడటం రాని వాళ్ళని, (చూడని వాళ్ళని కాదు) ‘నిరక్షరాస్యుల’గా ముద్రవేస్తారు. కానీ ఇలాంటి వాళ్ళకి మన తెలుగులో అపారమయిన గౌరవం వున్న సంగతి పాపం వాళ్ళకు తెలీదు. మనం ధైర్యం ఇవ్వాలే కానీ, ఇలాంటి వాళ్ళు ‘సూపర్ డూపర్ హిట్లు’ తీసే దర్శకులయి పోగలరు; సినిమాను ఏ ముక్కకా ముక్క చీల్చి చెండాడేసే స్టార్ సమీక్షకులు కూడా కాగలరు. ( ఇప్పటికే అయివున్నారేమో! తెలీదు కూడాను!)

అయితే మన దేశంలో ‘సినిమా చూసే విద్య’ ఇలాకాక పోయినా, ఇంకోలా పెరిగింది. ఒకప్పుడు ‘ఫిల్మ్ సొసైటీ’ ఉద్యమం నడిచింది. చిన్న పట్టణాల్లో సైతం ప్రేక్షకుడి స్థాయిని పెంచే సినిమాలను ఈ సొసైటీలు వేసేవి. ఇప్పుడు ‘చిల్డ్రన్ ఫిలిం సొసైటీ’లు కూడా వచ్చేశాయి. ఇక టీవీలూ, ఇంటర్నెట్‌లూ వచ్చేశాక ప్రపంచ చిత్రాలే కళ్ళ ముందు కొచ్చేస్తున్నాయి. సోషల్ మీడియా నెట్‌వర్క్‌లలో  సైతం అందరూ  గొప్ప, గొప్ప చిత్రాల గురించి చర్చించేస్తున్నారు. వెరసి, ఈ మొత్తం చైతన్యం తెలుగు ప్రేక్షకుడి స్థాయిని ఏదో మేరకు పెంచింది. ఈ  స్థాయి ఏమేరకు పెరిగిందంటే, కథే కాదు, ఏ సీను, ఏఫ్రేము  ఏ ఇంగ్లీషు సనిమాలోంచి కొట్టుకొచ్చిందో పసిగట్టి ‘ఫేస్ బుక్’ లో పెట్టేస్తున్నారు.కానీ ఈ విషయాన్ని దర్శకుడూ, సమీక్షకుడూ గుర్తించారా? లేదా? అన్నది సమస్య. లేదా గుర్తించికూడా, వేరే మార్గంలేక, పాత పద్ధతులతోనే సర్దుకు పోతున్నారా?

గుర్తించి వుంటే, ఎప్పుడో తన చిన్నప్పుడు చూసిన ఒకా నొక సినిమాను, మూడేసి సార్లు కాపీ కొట్టి మూడు సినిమాలు తీసేసే సాహసానికి ఒక దర్శకుడు పాల్పడడు. పొట్ట చించితే ఒక్క సొంత ప్లాటు ముక్క ( ఇతివృత్తాంశం) కూడా లేని వాడు ఇంకా దర్శకుడిగా ఊరేగడు. జీవితాన్నుంచి కాక, మరో కథనుంచి పుట్టుకొచ్చే ప్లాస్టిక్ కథల్ని చూపించడు. చూపించినా, వాసన రాలేదంటే ఉడుక్కోడు. పనివాడి నోటా, ప్రేయసినోటా ఒకే టైపు ‘పంచ్’లు పలికించి పాత్రౌచిత్యాన్ని అటెకక్కించే సాహసానికి పాల్పడడు. ‘టెక్నాలజీ’ని ప్రదర్శించి దర్శక ప్రతిభ అని ఊరేగడు.

సినిమాను బాగా ఒంటబట్టించుకున్న రచయితల్లో ఒకరయిన ముళ్లపూడి వెంకట రమణ ఒక సినిమాకు సమీక్ష రాస్తూ ‘మతిభ్రమతో మంచం పట్టిన రవి మళ్ళీ మామూలు మనిషి ఎలా అయ్యాడు? ఎలాగయినా అవుతాడు. అవటానికి సందేహం లేదు. అసలు తెలుగు చిత్రాలలో  నాయకుడు చిరంజీవి రవికి ఎప్పుడూ ఢోకా వుండదు. మతి పోవటం వంటివి జరిగినప్పుడు , ఊచి పుచ్చుకు చెంపకాయ కొడితే సృృతి రావచ్చు’ అన్నారు. ఇప్పటికీ తెలుగు సినిమాల్లో హీరోలకూ, హీరోయిన్లకీ మతి ఇలాగే పోతుంది; ఇలాగే వస్తుంది. పెద్దగా హేతు బధ్ధత పెరగలేదు.

ఈలల లెక్కలూ, చప్పట్ల తూకాలూ!

ఇక సమీక్ష అంటారా? మనమింకా సమీక్ష స్థాయే చేరుకోలేదు. సినిమా విమర్శ స్థాయికి ఎప్పుడు వెళ్తామో! తెలీదు. బహుశా ‘సిటిజన్ జర్నలిజం’ లో భాగంగా ప్రేక్షకులే ఈ స్థాయికి ముందు చేరుకుంటారనే అనుమానం కలుగుతుంది. ఒక కొత్త ‘జోనర్’ లో సినిమా తీయాలని  ఏ కొత్త దర్శకుడో ప్రయత్నం చేస్తేనో, కొత్త కళా సిధ్థాంత పరిధిలో ఓ ప్రయోగం చేస్తేనో, అర్థం కానీ సమీక్షకుడు ‘ట్రాష్’ అని కొట్టి పారేస్తాడు. అదేమంటే, జనం చూడలేదంటాడు. సమీక్ష రాసే రచయిత సినిమా హాలులో కూర్చుని సినిమాను ఎలా తూకం వేస్తున్నాడో, ఇలాంటప్పుడే అనుమానం వస్తుంది. అతనక్కడున్నది పాతిక ఈలలూ, పన్నెండు చప్పట్లూ మొత్తం మీద మోగాయి అని లెక్క రాసుకోవటానికి కాదు కదా! తాను ముందుగా సినిమా చూసిందెందుకు? చూడబోయే ప్రేక్షకుల వినోదాన్ని, రసాస్వాదననీ పెంచటానికి. సినిమా ‘ఆడుతుందో, లేదో’  చెప్పే ‘ట్రేడ్ టాక్’కు సమీక్షకుడే అక్కర్లేదు. సినిమా వ్యాపారం మీద అంచనా వున్న వాళ్ళెవరయినా చెబుతారు. ఇక రాసే రచన విషయానికొస్తే, తిట్లూ, శాపనార్థాలు పెట్టేసి వెటకారమంటేనో, చెక్కభజన చేసేసి ప్రశంస అంటేనో చెల్లే రోజులు పోయాయి.

కాబట్టి, తాను తీసిందే చిత్రమనీ దర్శకుడూ, రాసిందే సమీక్ష అని సమీక్షకుడూ చేసే దాదాగిరీ మొత్తం ప్రేక్షకుడికి లేదా పాఠకుడికీ ఒక ‘కామెడీ ట్రాక్’ లాగా కనిపిస్తోందేమో! ఒక్క సారి సృ్పహలోకి వచ్చి  చూసుకోవచ్చు. ప్రమాదమనుకుంటే తమ భ్రమల్లో తాము నిశ్చింతగా కొనసాగవచ్చు.

– సతీష్ చందర్