శశి థరూర్ భార్య సునంద యీ జనవరి 17 న అనూహ్యపరిస్థితుల్లో మృతి చెందిందని అందరికీ తెలుసు. ఎయిమ్స్‌లో జనవరి 18 న ఆమె శవపరీక్ష జరిగిందని, రెండు రోజుల తర్వాత పోస్ట్ మార్టమ్ రిపోర్టును ప్రభుత్వానికి యిచ్చారనీ తెలుసు. అయితే ఆ రిపోర్టు యిచ్చిన డాక్టరు సుధీర్ గుప్తా దాన్ని ఒక వివాదంగా మారుద్దామని చూస్తున్నారు. ఆ రిపోర్టు మార్చమని తనపై ఒత్తిడి వచ్చిందని అయినా తను లొంగలేదని చెప్తున్నారు. మే 12 న ఆయన పనిచేసే శాఖలో ఆయన కంటె సీనియరైన డా|| ఒ.పి.మూర్తిని ప్రొఫెసర్‌గా, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్గా ప్రమోట్ చేయడం యీయన్ని బాధించింది. వెంటనే సెంట్రల్ ఎడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్‌కు ఫిర్యాదు చేశాడు – ''సునంద రిపోర్టు మార్చమని ఎయిమ్స్ డైరక్టర్ డా|| ఎం.సి. మిశ్రా, అప్పటి ఆరోగ్యమంత్రి, ఎయిమ్స్ ప్రెసిడెంటు అయిన గులాం నబీ ఆజాద్‌లు నాపై ఒత్తిడి తెచ్చారు. నేను లొంగలేదు. అందుకే నాకు ప్రమోషన్ రాకుండా చేశారు.'' అని. ఒత్తిడి వచ్చిందని రుజువేమిటి అని అడిగితే 'సునంద కున్న రోగాలు యివి అంటూ తన ఫ్యామిలీ ఫిజిషియన్ నుండి తనకు వచ్చిన యీ మెయిల్స్‌ను శశి థరూర్ నాకు ఫార్వార్డ్ చేశాడు చూడండి.' అన్నాడు. డా|| రాజీవ్ భాసిన్ అనే ఆ ఫ్యామిలీ ఫిజిషియన్ సునందకు చికిత్స చేసేవాడు. 'ఆమె పోయిన తర్వాత శశి థరూర్‌ను కలిసే అవకాశం రాలేదు. అందువలన కొన్ని రోజులకు నా అంతట నేనే ఆమె ఆరోగ్యపరిస్థితిని వివరిస్తూ, అతనికి సంతాపం తెలుపుతూ మెయిల్ రాశాను' అన్నాడు. పైగా ఆ మెయిల్‌ను థరూర్ జనవరి 26న అంటే పోస్ట్ మార్టమ్ రిపోర్టు సబ్మిట్ చేసిన 6 రోజుల తర్వాత డా|| గుప్తాకు పంపాడు! ఇక అది సాక్ష్యంగా ఎలా నిలుస్తుంది?
సునందకు పోస్ట్ మార్టమ్ నిర్వహించడానికి ఏర్పడిన కమిటీ గుప్తా ఏర్పరచినదే. రిపోర్టు తయారయ్యాక దాన్ని ఓ కవర్లో పెట్టి సీలు వేసి, సబ్ డివిజనల్ మేజిస్ట్రేటును, ఎడిషనల్ కమిషనర్ ఆఫ్ పోలీసును ఎయిమ్స్ డైరక్టరు ఆఫీసుకి రప్పించి వారి చేతిలో పెట్టాడు. ఆమెపై విషప్రయోగం జరిగిందా లేదా అన్న విషయంపై అనుమానాలు వున్నాయి కాబట్టి దేహం లోంచి కొన్ని భాగాలను విడిగా తీసి సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లేబరేటరీకి పంపారు. ఆ భాగాల్లో విషం వుందా లేదా, వుంటే ఏ విషం, ఏ మేరకు వుంది, అది కాక వేరే రకమైన విషం కూడా వుందా? అనే విషయాలను వారు కూలంకషంగా పరిశోధించి మార్చిలో ఆమె శరీరంలో విషం ఏమీ లేదు అని రిపోర్టు పంపారు. పోలీసులు దాన్ని ఆమోదించలేదు. మళ్లీ పరీక్ష చేయమని కోరారు. ల్యాబ్ వారు ఓ కమిటీ ఏర్పాటు చేసి మళ్లీ పరీక్ష చేయడానికి పూనుకున్నారు. మే రెండో వారంలోనే బిజెపి ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి తనను తాను కాంగ్రెసు బాధితుడిగా చిత్రీకరించుకోవడానికి కాబోలు గుప్తా జులై 1 న తనపై ఒత్తిడి వచ్చిందంటూ బహిరంగ ప్రకటన చేశారు. అసలాయన రిపోర్టు ప్రొఫెషనల్‌గా లేదని ఆ రంగంలో నిపుణులు అంటున్నారు. 'సడన్, అన్నేచురల్ డెత్' అని రిపోర్టులో గుప్తా రాశారట.
సడన్ నేచురల్ డెత్ వుంటుంది తప్ప అసహజ మరణం ఆకస్మికంగా జరగడమేమిటి? అంటున్నారు. మందులు మోతాదుకి మించి తీసుకుందని, శరీరంలో విషం వుందని రాశాడు తప్ప దాని వలనే మరణించిందని రాయలేదు. శరీరంపై గాయాలున్నాయని రాస్తూనే వాటికీ చావుకీ సంబంధం లేదన్నాడు.
డా|| గుప్తాపై గతంలో ఒక వివాదం వుంది. 2009 మేలో కశ్మీర్‌లోని షోపియన్ గ్రామంలో ఒక నది ఒడ్డున యిద్దరు ముస్లిము స్త్రీల శవాలు దొరికాయి. వారిద్దరూ నదిలో మునిగి చచ్చిపోయారు. అయితే హిందువులు వారిపై అత్యాచారం చేసి, ఆపై హత్య చేశారంటూ కశ్మీర్ వేర్పాటువాదులు ఆందోళన చేయబూనారు. వారికి జమ్మూ కశ్మీర్ న్యాయవాదుల సంఘం వారు వత్తాసు పలికారు. 'నిజనిర్ధారణపై మేం ఒక టీమును పంపాము. ఆ మహిళల శవాలపై బట్టలు లేవని, వారి పాపిటలో సిందూరం పులమబడి వుందని కళ్లారా చూసిన వారు చెప్పారు, అలా చేసినది హిందువులే..' అంటూ వారు ప్రకటన చేశారు. ఇక అది మొదలుగా అక్కడ ప్రతిపక్షంవారు, వారూ కలిసి ప్రదర్శనలు నిర్వహించి 47 రోజుల పాటు జనజీవితాన్ని స్తంభింపచేశారు. అల్లర్లలో 8 మంది మరణించగా, 400 మంది గాయపడ్డారు. నిజం వెలికితీయడానికి రాష్ట్రప్రభుత్వం డాక్టర్లను నియమించింది. అయితే వాళ్లూ అబద్ధాలాడారు. సిబిఐ చేత విచారణ జరిపించాలని అందరూ కోరగా చివరకు సిబిఐ వారు ఎయిమ్స్ డాక్టర్లను పిలుచుకుని వచ్చారు. ఆ టీముకి నాయకత్వం వహించినది – డా|| టి.డి.డోంగ్రా. ఆయన ఎయిమ్స్‌కు డైరక్టరుగా పనిచేశారు. నిఠారి హత్యలు, ఇష్రత్ జెహాన్ కేసు, గోధ్రా అల్లర్లు, ఆరుషి తల్వార్ కేసు యిటువంటి అనేక కేసులను ఆయన డీల్ చేశారు. ఆయన అందరి సమక్షంలో పాతిపెట్టిన ఆ మహిళల శవాలు బయటకు తీయించి మళ్లీ పోస్ట్‌మార్టమ్ నిర్వహించారు. వారిలో ఒకమ్మాయి అవివాహిత. ఆమె కన్నెపొర చిరగలేదని గమనించారు. మరొకామె యిద్దరు పిల్లల తల్లి. ఆమెపై అత్యాచారం జరగలేదనీ గుర్తించారు. వారి ఊపిరితిత్తులను పరీక్షించాక నీటిలో మునగడం చేత మరణించారని తేల్చారు. అత్యాచారం జరిగిందని రిపోర్టు యిచ్చిన కశ్మీర్ డాక్టర్లను నిలదీస్తే వాళ్లు నీళ్లు నమిలారు. ఆ కేసు అలా ముగిసింది.
అయితే డా|| డోగ్రాపై మత్సరం వున్న డా|| సుధీర్ గుప్తా జమ్మూ కశ్మీర్ న్యాయవాదుల సంఘానికి తన అఫీషియల్ లెటర్‌హెడ్‌పై ''డోగ్రా యిచ్చిన పోస్ట్ మార్టమ్ రిపోర్టు నేను నమ్మను, అది తప్పు' అని ఉత్తరం రాశాడు. అది వెలుగులోకి రాగానే ఎయిమ్స్ డిప్యూటీ డైరక్టర్ గుప్తాను నిలదీశారు – 'నువ్వు ఆ రిపోర్టు గురించి డోగ్రాతో మాట్లాడావా? కేసు పూర్వాపరాలు తెలుసా? ఏ సాక్ష్యంతో అది తప్పని చెప్పావ్?' అని. గుప్తా 'నాకు అవేమీ తెలియదు. డోగ్రా ఏ కారణాల చేత అలా నిర్ధారించారో అవేమీ నేను పరిశీలించలేదు' అని ఒప్పుకుని 2010 ఫిబ్రవరిలో లిఖితపూర్వకంగా క్షమాపణ యిచ్చాడు. అలాటి డా|| గుప్తా యిప్పుడు తనకు ప్రమోషన్ దక్కలేదన్న అక్కసుతో యిలాటి ఆరోపణలు చేస్తున్నాడని శంకించడంలో తప్పేమీ లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్‌పై ఏ రాయి వేసినా జనం నమ్ముతారనే ధీమాతో యీ ఎత్తు ఎత్తి వుండవచ్చని అతని సహచరులే అంటున్నారు. ఎందుకంటే ఏదైనా ఒత్తిడి వుంటే అప్పుడే చెప్పి వుండాల్సింది. నాలుగు నెలలు నోరు మూసుకోవడం దేనికి? అంటున్నారు. పైగా ఒత్తిడి వచ్చినా రిపోర్టు మార్చనపుడు, తను అనుకున్నది చెప్పగలిగి నపుడు యిక దేని గురించి ఫిర్యాదు? అని అడుగుతున్నారు.
– ఎమ్బీయస్ ప్రసాద్ (జులై 2014)