‘నన్ను చావనివ్వండి’ అంటున్న యండమూరి రఘు!

‘యండమూరి రఘు’ ఈపేరు చూడగానే కొంతమందికి తటాల్న అమెరికాలో జరిగిన ఓ విషాద దుర్ఘటన గుర్తుకురావొచ్చు. నానమ్మతో సహా పదినెలల పసి కందు శాన్విని హత్యచేసిన దుండగుడు అని చెబితే నేరం జరిగి దాదాపు…

‘యండమూరి రఘు’ ఈపేరు చూడగానే కొంతమందికి తటాల్న అమెరికాలో జరిగిన ఓ విషాద దుర్ఘటన గుర్తుకురావొచ్చు. నానమ్మతో సహా పదినెలల పసి కందు శాన్విని హత్యచేసిన దుండగుడు అని చెబితే నేరం జరిగి దాదాపు ఏడాది పూర్తవుతున్నప్పటికీ.. అందరికీ విషయం గుర్తుకు వచ్చేస్తుంది. గత ఏడాది అక్టోబరు లో అమెరికాలోని కింగ్‌ ఆఫ్‌ ప్రష్యా అపార్ట్‌మెంట్స్‌లో తనకు పరిచయస్తులైన వెంకటకొండశివ, చెంచులతల పసిపాపను కిడ్నాప్‌ చేసి 50 వేల డాలర్లు డిమాండ్‌ చేసి తీసుకోవడానికి మరో ఎన్నారై కుర్రాడు యండమూరి రఘునందన్‌ ప్రయత్నించిన సంగతి చాలా మందికి గుర్తుండే ఉంటుంది. తల్లిదండ్రులు లేని సమయంలో ఇంట్లోని పసిపాపను కిడ్నాప్‌ చేయడానికి ప్రయత్నించిన రఘునందన్‌.. ఆ సమయంలో అడ్డు వచ్చిన ఆ పాప నానమ్మ సత్యవతి (61)ని పొడిచి చంపేశాడు. పాపతో వెళ్లిపోయాడు. నాలుగు రోజుల తర్వాత పాప మృతదేహం లభించింది. అయితే అతని జంటహత్యల కేసులో ప్రస్తుతం మోంట్‌గోమెరీ కౌంటీ డిస్ట్రిక్ట్‌ అటార్నీ ఆఫీసులో విచారణ సాగుతోంది. 

ఇదిలా ఉండగా, ఇటీవల భారత్‌లోని ఓ తెలుగు టీవీ ఛానెల్‌ నిందితుడు రఘునందన్‌తో టెలిఫోన్‌లో ఇంటర్వ్యూచేసినట్లుగా సమాచారం. అయితే ఆ ఇంటర్వ్యూలో రఘు తనకు కోర్టు వారు నియమించిన న్యాయవాది మీద, కేసును విచారిస్తున్న పోలీసులు, కౌంటీ జైలులో తన సహచరుల మీద తీవ్రమైన పదజాలంతో అనేక ఆరోపణలు గుప్పించినట్లుగా వార్తలు వస్తున్నాయి. తెలుగులో సాగిన ఈ ఇంటర్వ్యూలో రఘు.. తనకు మరణ శిక్ష పడకుండా తప్పించడానికి తన న్యాయవాది ప్రయత్నిస్తున్నాడని, పోలీసుల ప్రయత్నాలు కూడా అలాగే ఉన్నాయని… అయితే తనకు మాత్రం చచ్చిపోవాలనే ఉన్నదని పేర్కొనడం విశేషం. నిజానికి తనకు ఈ న్యాయవాది వద్దని, మరో న్యాయవాది కావాలని కూడా రఘునందన్‌ కోర్టు వారికి అప్పీలు చేసుకున్నారట. ఆ పిటిషన్‌ ఇంకా పరిశీలనలోనే ఉన్నది. అయితే తనకు అమెరికాలోని భారతీయ అధికారులుకూడా సహకరించడం లేదని రఘునందన్‌ చెబుతున్నాట్ట.

అతను ఏం చెబుతున్నప్పటికీ.. ‘మేం మాత్రం ఇంకా అతని తరఫు న్యాయవాదులమే’ కోర్టు వారు అతనికి ఏర్పాటుచేసిన న్యాయవాది స్టీఫెన్‌ జి. హెక్‌మన్‌ చెబుతున్నారు. 

అయితే ఫిలడెల్ఫియా ప్రాంతంలోని తెలుగు వారు మాత్రం .. నేరం జరిగి ఏడాది దాటుతున్నా రఘునందన్‌ ఇలాంటి ఇంటర్వ్యూలతో మీడియాలో కనిపిస్తుండడాన్ని ఈసడించుకుంటున్నారట. మరణించిన పసిపాప శాన్వి తల్లిదండ్రులు ఇప్పుడిప్పుడే ఆ గాయం నుంచి కోలుకుంటూ ఉండగా, మానుతున్న గాయాన్ని తిరిగి రేపుతున్నట్లుగా ఈ ఇంటర్వ్యూలు కనిపిస్తున్నాయంటూ అక్కడి తెలుగువారు చెబుతున్నారు. 

అయితే.. ఇంతటి విషాదంలో కూరుకుపోయిన వెంకట కొండా శివ, చెంచులత దంపతులకు అంతో ఇంతో ఊరడింపు అయిన విషయం ఏంటంటే.. కొన్ని వారాల కిందటే వారికి ఒక బాబు పుట్టాడుట.