పెళ్లి చేసుకోవాలా వ‌ద్దా, న‌యాత‌రం డైల‌మా!

వివాహం విషయంలో మ‌నుషుల ధోర‌ణి రోజురోజుకూ మారుతూ ఉంది. ఎంత‌లా అంటే.. ఇప్పుడు మారుమూల గ్రామ స్థాయిల్లో కూడా వివాహానికి నో చెబుతున్న‌, చెప్ప‌గ‌ల అమ్మాయిల సంఖ్య పెరుగుతూ ఉంది. రెండు ద‌శాబ్దాల క్రితం…

వివాహం విషయంలో మ‌నుషుల ధోర‌ణి రోజురోజుకూ మారుతూ ఉంది. ఎంత‌లా అంటే.. ఇప్పుడు మారుమూల గ్రామ స్థాయిల్లో కూడా వివాహానికి నో చెబుతున్న‌, చెప్ప‌గ‌ల అమ్మాయిల సంఖ్య పెరుగుతూ ఉంది. రెండు ద‌శాబ్దాల క్రితం ఒక అమ్మాయి పెళ్లికి నిస్సందేహంగా నో చెప్పే ప‌రిస్థితులు ఉండేవా అంటే.. మ‌న గ్రామాల్లో నిస్సందేహంగా లేవు. అయితే ఇప్పుడు తాము పెళ్లి చేసుకోదలుచుకోవ‌డం లేద‌ని అమ్మాయిలే ధైర్యంగా చెప్పే ప‌రిస్థితులు క‌నిపిస్తున్నాయి రూర‌ల్ బ్యాక్ గ్రౌండ్లో కూడా!

ఐదారు వంద‌ల జ‌నాభా ఉన్న ఊళ్ల‌లో గ‌తంలో ఎవ‌రైనా ఒక అమ్మాయి త‌ను పెళ్లి చేసుకోవ‌డం లేద‌ని చెబితే, అదో పెద్ద విడ్డూరం అయ్యేది. అయితే ఇప్పుడు ఎవ‌రైనా అలా విడ్డూరంగా చూసినా అమ్మాయిలు లెక్క‌చేసే ప‌రిస్థితి లేదు. పెళ్లితో స‌వాల‌క్ష వ్య‌వహారాలు ముడిప‌డి ఉండ‌టం, త‌మ‌కు స్వేచ్ఛా స్వ‌తంత్రాలు మృగ్యం కావ‌డ‌మే గాక‌, లేని పోని త‌గ‌వులెన్నో ప‌డాల్సి వ‌స్తుంద‌నే భావ‌న‌తో కొంత‌మంది అమ్మాయిలే ఈ త‌ర‌హా నిర్ణ‌యాలు తీసుకుంటున్నార‌ని స్ప‌ష్టం అవుతూ ఉంది. వారిని ఒక ద‌శ వ‌ర‌కూ క‌న్వీన్స్ చేయ ప్ర‌య‌త్నించిన త‌ల్లిదండ్రులు కూడా చివ‌ర‌కు చేసేది లేక వెన‌క్కు త‌గ్గుతున్నారు.

ఇక అమ్మాయిల్లోనే పెళ్లిపై విర‌క్తి ఉండ‌టం కాదు, కొంద‌రు ఎలిజిబుల్ బ్యాచిల‌ర్స్ కూడా పెళ్లికి నో చెప్ప‌డానికి వెనుకాడ‌ని ప‌రిస్థితి చాలా కాలంగా ఉంది. గ‌తంలో ఊరికి ఒక‌రిద్ద‌రు పెళ్లి చేసుకోని వ్య‌క్తులు ఉంటేనే వారికి ప్ర‌త్యేక గుర్తింపు ఉండిపోయేది! అయితే ఇప్పుడు అమ్మాయిలు, అబ్బాయిలు.. పెళ్లి చేసుకోకూడ‌ద‌ని అనుకునే వారు కూడా మ‌నుషులే అన్న‌ట్టుగా మారాయి ప‌రిస్థితులు!

మ‌రి ఎలాగోలా పెళ్లి చేసుకుంటే చాలనే ప్ర‌య‌త్నాల్లో ఉన్న వారు ఒక ఎత్తు. తాము పెళ్లి చేసుకోకూడ‌ద‌ని తీర్మానించుకుని ఆ మేర‌కు సాగిపోయే వారు మ‌రో ఎత్తు. అయితే డైల‌మాలో ఉండేవారికీ కొద‌వ‌లేదు. పెళ్లి చేసుకోవాలా వ‌ద్దా అనేది వీరి మీమాంస‌. పెళ్లి చేసుకుంటే జీవితం ఎలా ఉంటుంది, పెళ్లి చేసుకోక‌పోతే జీవితం మ‌రెలా ఉంటుంద‌నే లెక్క‌ల‌తో కొంద‌రు స‌త‌మ‌తం అవుతూ ఉన్నారు! సొంత కాళ్ల‌పై నిల‌బ‌డ‌టానికి త‌గిన ఉద్యోగం, కార్య‌నిర్వాహ‌ణ సామార్థ్యం ఉన్నాకా, మ‌రొక‌రితో ముడిపెట్టుకోవ‌డం వ‌ల్ల ఉన్న కొత్త ఝంజాటాలు వ‌స్తాయ‌నే భ‌యాలతో స‌త‌మ‌తం అవుతున్న వారూ క‌నిపిస్తారు నేటిత‌రంలో. వీరిది ఆన్ అండ్ ఆఫ్ ప‌రిస్థితి.

పెళ్లి చేసుకుంటే ఇంకొక‌రితో జీవితం ఎలా ఉంటుంద‌నే భ‌యానికి తోడు, రేపు వ‌య‌సు మీద ప‌డ్డాకా.. ఇలా ఫ్రెండ్స్ తోనో క‌లిసి జీవించే ప‌రిస్థితి ఉంటుందా, అప్పుడు అయినా మ‌రొక‌రి తోడు అవ‌స‌రం ప‌డ‌దా.. అనే భ‌యాలూ క‌నిపిస్తాయి వీరిలో. దీనికి తోడు.. కొంద‌రు ప్ర‌ముఖ బ్యాచిల‌ర్స్ కూడా జీవితంలో పెళ్లి చేసుకోవాల్సింద‌ని, అప్పుడు చేసుకోలేక‌పోయినందుకు ఇప్పుడు చింతిస్తున్న‌ట్టుగా చేసే ప్ర‌క‌ట‌న‌లు వీరిని మ‌రింత గంద‌ర‌గోళంలోకి నెడుతూ ఉన్నాయి.

టైల‌ర్ మేడ్ గా త‌మ‌కు వంద‌కు వంద శాతం సెట్ అవుతాడ‌నే వాడు దొర‌క‌డం అసాధ్యం. అందునా ఇది సోష‌ల్ మీడియా యుగం ర‌క‌ర‌కాల వ్య‌క్తులు ర‌క‌ర‌కాల సంద‌ర్భాల్లో ప‌రిచ‌యం అయ్యే త‌రుణం. విద్య‌, ఉద్యోగాల్లో రక‌ర‌కాల క్వాలిటీస్ ఉండే వారు ప‌రిచయం కావాల్సిన సంద‌ర్భాల్లో క‌న్నా, లేటుగా ప‌రిచ‌యం అయ్యే సంద‌ర్భాలూ ఎక్కువే! డెస్టినీ ఎవ‌రిని ఎప్పుడు ఎలా క‌లుపుతుందో ఎవ్వ‌రికీ ఎరుక ఉండ‌దు. దీంతో.. డైలామా కొన‌సాగే ప‌రిస్థితి క‌నిపిస్తూ ఉంది.

పెళ్లి చేసుకుందామ‌న్నా జ‌ర‌క్క కొంద‌రు, వ‌ద్ద‌న్నా పెళ్లి ప్ర‌పోజ‌ల్స్ తో మ‌రి కొంద‌రు, ఇలా డైల‌మాల‌తో మ‌రి కొంద‌రు.. మొత్తానికి పెళ్లి ఈ జ‌న‌రేష‌న్ లోనూ పెద్ద టాపిక్కే, చేసుకుందామ‌న్నా, చేసుకోవ‌ద్ద‌నుకున్నా!

7 Replies to “పెళ్లి చేసుకోవాలా వ‌ద్దా, న‌యాత‌రం డైల‌మా!”

  1. మంచి డెసిషన్ రా నాయనా ?? అభివ్రుది చెందిన దేశాల జనాభా కె టాక్స్ లు ఖర్చులు గురించి భయం ఉంటె ..జీవన ప్రమాణాలు అంతంత మాత్రం గ ఉన్న మన దేశం లో ఇలాంటి డెసిషన్ తీసుకుంటే తప్పు లేదు

Comments are closed.