మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ టీమిండియాకి కొత్త కోచ్‌గా అవతారమెత్తనున్నాడన్న వార్త క్రికెట్ అభిమానుల్ని ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. దేశం గర్వించదగ్గ క్రికెటర్లలో గంగూలీ ఒకడు. ఇందులో ఎవరికీ ఎలాంటి సందేహాల్లేవు. మైదానంలో సౌరవ్ గంగూలీ బ్యాటింగ్‌తో విరుచుకుపడ్తుంటే, చూడ్డానికి రెండు కళ్ళు సరిపోయేవి కాదు క్రికెట్ అభిమానులకి. ‘రాయల్ బెంగాల్ టైగర్’గా అభివర్ణించేవారు క్రికెట్ అభిమానులు సౌరవ్ గంగూలీని. లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మెన్ అయిన గంగూలీ.. ఫ్రంట్ ఫుట్ వేసి ప్రత్యర్థి విసిరే బంతిని స్టాండ్స్‌లోకి పంపిస్తోంటే.. ఆ సొగసు ఇంకే బ్యాట్స్‌మెన్‌లోనూ చూడలేం.. అనేవారు క్రికెట్ విశ్లేషకులు సైతం.
కెరీర్ చివరి రోజుల్లో అత్యంత అవమానకరంగా జట్టులోంచి గంగూలీ బయటకు రావాల్సి వచ్చింది. ఫామ్ కోల్పోయిన టైమ్‌లో జట్టులోని అనేక రాజకీయాలు ఆయన్ని క్రికెట్ నుంచి తప్పించాయన్నది ఓపెన్ సీక్రెట్. ఆ విషయం పక్కన పెడితే, టీమిండియాలో పోరాట పటిమను పెంచిన కెప్టెన్‌గా గంగూలీని ఎప్పటికీ మర్చిపోలేరు భారత క్రికెట్ అభిమానులు. సంచలన విజయాలు గంగూలీ టైమ్‌లోనే భారత్‌ని వరించాయి. కాదు కాదు, టీమిండియాకి కసితో కూడిన విజయాల టేస్ట్‌ని చూపించాడు గంగూలీ.
ప్రత్యర్థి జట్లు ఎగ్రెసివ్‌గా మైదానంలో కన్పిస్తోంటే, వారిని చూసి నీరుగారిపోకూడదనీ, మరింత ఎగ్రెసివ్‌గా ఆటతీరు ప్రదర్శించాలనీ ‘ధైర్యం’ నూరిపోసిన కెప్టెన్ సౌరవ్ గంగూలీ. మైదానంలో చొక్కా విప్పి తిరగడం.. అదీ ఓ కెప్టెన్ ఆ పని చేయడం.. టీమిండియాకి సంబంధించినంతవరకూ గంగూలీతోనే మొదలైంది. అలాంటి గంగూలీ టీమిండియాకి కోచ్ అయితే? టీమిండియా మరింత కొత్త ఉత్సాహంతో ముందడుగు వేయడం ఖాయమన్నది చాలామంది వాదన. అదే సమయంలో, గంగూలీ టీమిండియా కోచ్‌గా పనిచేయడం మంచిది కాదన్న వాదనలూ లేకపోలేదు.
అవును, గతానికీ.. ఇప్పటికీ చాలా తేడా వుంది. అప్పట్లో సచిన్ సహా పలువురు క్రికెటర్లు బాగా సౌమ్యులు. కెప్టెన్ తీసుకునే నిర్ణయాల్ని ప్రశ్నించేవారు కాదు. కెప్టెన్ ఏం చెబితే అది చేసేవారు. కెప్టెన్ ఎగ్రెసివ్‌గా వ్యవహరిస్తే, ఆ కెప్టెన్‌కు పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందించారు. కోచ్‌గా గంగూలీ ఇప్పుడు అదే అగ్రెసివ్‌నెస్ కొనసాగిస్తే, దాన్ని ప్రస్తుత తరం క్రికెటర్లు అర్థం చేసుకుంటారా.? పైగా, ఇప్పుడు జట్టులో రాజకీయాలు మరింత ముదిరిపోయాయి. కూల్‌గా కన్పించే కెప్టెన్ ధోనీ, తనక్కావాల్సిన వారిని జట్టులో వుంచుకోవడం, ఇష్టం లేనివారిని పక్కన పెట్టేయడం చేస్తున్నాడు. ఈ రాజకీయాల నడుమ, గంగూలీ కోచ్‌గా ఎంతవరకు తన ఉనికిని చాటుకోగలడన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నే.