టీమిండియా బ్యాట్స్ మెన్ డబుల్ సెంచరీల పరంపర కొనసాగుతూ ఉంది. ఇటీవలే ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీతో అదరగొట్టగా, ఈ జాబితాలో చోటు సంపాదించాడు మరో యంగ్ బ్యాట్స్ మన్. ఉప్పల్ వేదికగా న్యూజిలాండ్ తో జరుగుతున్న తొలి వన్డే మ్యాచ్ లో శుభ్ మన్ గిల్ డబుల్ సెంచరీ బాదాడు. 149 బంతుల్లో 208 పరుగులు చేసిన ఈ ఓపెనర్, డబుల్ సెంచరీని సాధించిన అతి పిన్న వయస్కుడైన బ్యాట్స్ మన్ గా నిలుస్తున్నాడు. 23 యేళ్ల గిల్ కు ఇది వరసగా రెండో సెంచరీ కూడా. వన్డే జట్టులో చోటును పదిల పరుచుకోవడంలో గిల్ ఇలా దూసుకుపోతున్నాడు.
సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, రోహిత్ శర్మ (3), ఇషాన్ కిషన్ ల తర్వాత వన్డేల్లో డబుల్ సెంచరీ సాధించిన భారత బ్యాట్స్ మన్ గా గిల్ నిలుస్తున్నాడు. సిక్సర్ తో గిల్ తన డబుల్ సెంచరీని పూర్తి చేశాడు. ఆ ఓవర్లో మొదటి బంతులనూ సిక్సర్లుగా మలిచి గిల్ డబుల్ సెంచరీని పూర్తి చేశాడు. ఇలా 18 పరుగులనూ సిక్సర్ల రూపంలో మూడే బంతుల్లో రాబట్టి ఇతడు డబుల్ సెంచరీని పూర్తి చేయడం గమనార్హం.
ఈ ఇన్నింగ్స్ తో గిల్ మరో రికార్డును కూడా సవరించాడు. హైదరాబాద్ వేదికగా గతంలో సచిన్ టెండూల్కర్ 175 పరుగుల భారీ స్కోరును సాధించాడు. అయితే అది ఉప్పల్ స్టేడియంలో కాదు. ఎల్బీ స్టేడియంలో సచిన్ రికార్డు స్కోరు సాధించాడు. ఇప్పుడు హైదరాబాద్ వేదికగా గిల్ భారీ ఇన్నింగ్స్ ను ఆడి, సరికొత్త రికార్డును సాధించాడు. ఇక గిల్ భారీ ఇన్నింగ్స్ తో టీమిండియా 50 ఓవర్లూ ముగిసే సరికి 349 పరుగులను సాధించింది.