క్రికెట్‌లో రోజురోజుకీ కొత్త పోకడలు పుట్టుకొస్తున్నాయి. బౌలర్ల ఆధిపత్యం తగ్గిపోతోంది.. బ్యాట్స్‌మెన్ హవా పెరిగిపోతోంది. ఎప్పుడు ఏ బ్యాట్స్‌మెన్ ఎలా చెలరేగిపోతాడో ఊహించడమే కష్టమవుతోంది. ఎంత గొప్ప బౌలర్ అయినా, బ్యాట్స్‌మన్‌కి ఫిదా అవ్వాల్సిందే. ఒకప్పటి పరిస్థితులు ఇలా వుండేవి కావు.
బంతిని బలంగా బాదడమొక్కటే తెలుసు.. అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు కొందరు బ్యాట్స్‌మన్. దాదాపుగా క్రికెట్‌లో ప్రతి ఒక్కరూ ఫాలో అవుతున్న ట్రెండ్ ఇదే. కొందరు సక్సెస్ అవుతున్నారు, మరికొందరు ఫెయిల్ అవుతున్నారు.. తేడా అంతే. గతంలో సెహ్వాగ్ ఈ స్థాయిలో వీర బాదుడు బాదేవాడుగానీ, అందులో టెక్నిక్ స్పష్టంగా కన్పించేది. ఇప్పుడు టెక్నిక్ గురించి పెద్దగా పట్టించుకోవడంలేదు. గట్టిగా బంతిని బాదడమే టెక్నిక్ అయిపోయింది.
వన్డేల్లో డబుల్ సెంచరీ సాధ్యమేనని సచిన్ టెండూల్కర్ ఏ ముహూర్తాన చాటి చెప్పాడో, ఇక అక్కడినుంచీ డబుల్ సెంచరీలు నమోదవుతూనే వున్నాయి. సెహ్వాగ్ ఒకటి, రోహిత్ శర్మ రెండు డబుల్ సెంచరీలు సాధించారు ఇండియా తరఫున. ఈ వరల్డ్ కప్‌లో రెండు డబుల్ సెంచరీలు నమోదయ్యాయి. భారత్ కాకుండా ఇంకో దేశానికి చెందిన క్రికెటర్ డబుల్ సెంచరీ సాధించడం ఈ వరల్డ్ కప్‌లోనే షురూ అయ్యింది. క్రిస్‌గేల్ సుడిగాలిలా విరుచుకుపడి డబుల్ సెంచరీ చేస్తే, తాజాగా మార్టిన్ గుప్టిల్ డబుల్ సెంచరీ కొట్టేశాడు.
గుప్టిల్ సెంచరీ విషయానికొస్తే, తొలుత నెమ్మదిగా సాగింది అతని బ్యాటింగ్. వెస్టిండీస్ బౌలర్లను జాగ్రత్తగా ఎదుర్కొన్న గుప్టిల్ 111 బంతులో సెంచరీ కొట్టాడు. సెంచరీ తర్వాత గుప్టిల్ నెమ్మదిగా వేగం పెంచాడు. అది కాస్తా సుడిగాలి ఇన్నింగ్స్ అయిపోయింది. 111 బంతుల్లో సెంచరీ కొట్టిన గుప్టిల్, 163 బంతుల్లో 237 పరుగులు చేశాడంటే ఏ స్థాయిలో గుప్టిల్ సెంచరీ తర్వాత బాదేశాడో అర్థం చేసుకోవచ్చు.
కొసమెరుపేంటంటే వెస్టిండీస్ ఓడిపోయినా, 8.2 రన్ రేట్‌తో న్యూజిలాండ్ బౌలర్లను చితక్కొట్టింది. వెస్టిండీస్ ఆటగాళ్ళలో 61 పరుగులు చేసిన క్రిస్‌గేల్ 2 ఫోర్లు, 8 సిక్సర్లు బాదాడు. 394 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో తడబడి, 30.3 ఓవర్లలో వెస్టిండీస్ 250 పరుగులు చేసి ఇంటిదారిపట్టింది.