'పసలేని బౌలింగ్..' వరల్డ్ కప్‌కి ముందు టీమిండియా ఎదుర్కొన్న అతిపెద్ద విమర్శ ఇది. కానీ, అనూహ్యంగా వరల్డ్ కప్‌లో భారత బౌలర్లు అదరగొడ్తున్నారు. అలా ఇలా కాదు. ఏ మ్యాచ్ ఆడినా ప్రత్యర్థిని ఆలౌట్ చేస్తోంది టీమిండియా.. అంటేనే బౌలర్ల సత్తా ఏంటో అర్థమవుతోంది. ఇప్పటికే ఈ వరల్డ్ కప్‌లో ఐదు వరుస విజయాలతో పూల్-బిలో టాప్ ప్లేస్‌లో వున్న టీమిండియా, తాజాగా ఈ రోజు జింబాబ్వేతో తలపడ్తోంది.
పసికూన అయినా జింబాబ్వే భారత బౌలర్లకు చుక్కలు చూపించిందనే చెప్పాలి. టేలర్ అద్భుత సెంచరీతో జట్టుకు గౌరవప్రదమైన స్కోర్ అందించాడు. ఓ దశలో జింబాబ్వే స్కోర్ 300 పరుగులు దాటుతుందని అంతా అనుకున్నారు. కానీ, అనూహ్యంగా 287 పరుగుల వద్ద 48.5 ఓవర్లలో జింబాబ్వే ఆలౌట్ అయ్యింది.
కొసమెరుపేంటంటే ఈ వరల్డ్ కప్‌లో ఇప్పటిదాకా భారత్‌పై అత్యధిక స్కోర్ చేసింది జింబాబ్వేనే కావడం. ఇంకో విశేషమేంటంటే, భారత్‌పై ఎక్కువ పరుగులు చేసిన జట్లన్నీ చిన్న జట్లే. పెద్ద జట్లు భారత్‌తో పోటీలో అతి తక్కువ స్కోర్‌కే పరిమితమయ్యాయి. ఐర్లాండ్ 259 పరుగులతో సెకెండ్ ప్లేస్‌లో వుంది. ఆ తర్వాతి స్థానం పాకిస్తాన్ (224)ది. వెస్టిండీస్ (182), సౌతాఫ్రికా (177) కనీసం 200 పరుగులూ చేయలేకపోయాయి టీమిండియాపైన. పసికూన యూఏఈ 102 పరుగులకు ఆలౌట్ అయ్యింది.
మొత్తమ్మీద, ఈ వరల్డ్ కప్‌లో ఇప్పటిదాకా ఆడిన ఆరు మ్యాచ్‌లలోనూ ప్రత్యర్థిని ఆలౌట్ చేసిన ఘనతను టీమిండియా దక్కించుకుందన్నమాట.