దక్షిణాఫ్రికా గడ్డపై ఇప్పటి వరకూ టెస్టు సీరిస్ నెగ్గిన చరిత్ర లేని టీమిండియా ఈ సారి ఆ లోటును భర్తీ చేసుకోవాలనే కృతనిశ్చయంతో అడుగుపెట్టింది. ఈ క్రమంలో సెంచూరియన్ లో మొదలైన తొలి టెస్టులో టీమిండియా శుభారంభం చేసింది. తొలి రోజు భారత బ్యాట్స్ మెన్ నిలిచారు. టాప్ ఆర్డర్ రాణింపుతో తొలి రోజు 272 పరుగులు సాధించి మెరుగైన స్థితిలో నిలిచింది. 90 ఓవర్ల పాటు బౌల్ చేసి మూడు వికెట్లను మాత్రమే సాధించి సౌతాఫ్రికన్ పేస్ దళం.
ఓపెనర్లు సెంచరీ భాగస్వామ్యంతో శుభారంభాన్ని ఇచ్చారు. కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్ లు ఫస్ట్ సెషన్లో వికెట్ పడకుండా ముగించారు. వీరిలో ముందుగా అగర్వాల్ అరవై పరుగులు చేసి ఔట్ కాగా, కేఎల్ రాహుల్ తొలిరోజు ఆసాంతం క్రీజ్ లో నిలిచి సెంచరీని పూర్తి చేసుకున్నాడు.
117 పరుగుల వద్ద తొలి వికెట్ పడగా, ఆ వెంటనే పుజారా కూడా డకౌట్ అయ్యాడు. అయితే కెప్టెన్ కొహ్లీ, రాహుల్ ను మరో భాగస్వామ్యాన్ని ఏర్పరిచారు. ముప్పై ఐదు పరుగులకు కొహ్లీ ఔట్ అయినా, రహనేతో కలిసి రాహుల్ మరో కీలక భాగస్వామ్యాన్ని ఏర్పరిచాడు. తొలి రోజు మరో వికెట్ పడకుండా ఈ జోడీ 73 పరుగులను జోడించింది.
122 పరుగులతో కేఎల్ రాహుల్ నాటౌట్ గా నిలిచాడు. దక్షిణాఫ్రికాలో టెస్టుల్లో భారత బ్యాటర్లు సాధించిన సెంచరీలు పరిమితంగానే ఉన్నాయి. ఈ క్రమంలో ఈ అరుదైన జాబితాలోకి కేఎల్ రాహుల్ చేరాడు. సౌతాఫ్రికా గడ్డపై అత్యధిక స్కోరు సాధించిన భారత టెస్టు ఓపెనర్ గా నిలుస్తున్నాడు రాహుల్. ఈ స్కోరును మరింత మెరుగైన స్థాయికి తీసుకెళ్లడానికి కూడా రాహుల్ కు ఇంకా అవకాశం ఉండనే ఉంది.