అత్యంత బలంగా వున్న సౌతాఫ్రికా, పాకిస్తాన్ మీద తేలిగ్గా విజయం సాధించేస్తుందనీ, పాకిస్తాన్ లీగ్ దశలోనే వరల్డ్ కప్ నుంచి నిష్క్రమిస్తుందనీ అంతా అంచనాలు వేశారు. అయితే ఆ అంచనాలు తలకిందులయ్యాయి. పాకిస్తాన్ ఇంకా లీగ్ దశను గట్టెక్కే అవకాశాలున్నాయి. బ్యాటింగ్‌లో చేతులెత్తేసినా, బౌలింగ్‌లో పాకిస్తాన్ సత్తా చూపింది. అదే సమయంలో బౌలింగ్‌లో తెగువ చూపిన సౌతాఫ్రికా, బ్యాటింగ్‌లో చేతులెత్తేసింది.
తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 46.4 ఓవర్లలో 222 పరుగులకు ఆలౌట్ అయ్యింది. పదే పదే వర్షం మ్యాచ్‌కి అడ్డంకిగా మారడంతో, పాకిస్తాన్ బ్యాటింగ్ ఇబ్బందికరంగానే సాగింది. డక్‌వర్త్ లూయీస్ మెథడ్ ప్రకారం 47 ఓవర్లలో 232 పరుగులు చేయాల్సిన సౌతాఫ్రికా, ఆదిలోనే తొలి వికెట్‌ని పారేసుకుంది. ఆ తర్వాత కాస్సేపు ఆమ్లా, డుప్లెసిస్ ధాటిగా ఆడారు. ఇక మ్యాచ్‌లో సౌతాఫ్రికా విజయం ఖాయమనుకున్నారంతా.
డుప్లెసిస్ 27 పరుగులకు ఔట్ అయితే, ధాటిగా ఆడుతూ 27 బంతులు ఎదుర్కొన్న ఆమ్లా 9 బౌండరీల సహాయంతో 38 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. తర్వాత వచ్చిన ఆటగాళ్ళలో డివిలియర్స్ తప్ప ఇంకెవరూ క్రీజ్‌లో కుదురుకోలేకపోయారు. డివిలియర్స్ ఒంటరిపోరాటం చేసినా ఉపయోగం లేకుండాపోయింది. 77 పరుగులు చేసిన డివిలియర్స్ ఔట్ అయ్యేసరికి సౌతాఫ్రికా స్కోర్ 200. ఇంకో రెండు పరుగులకు సౌతాఫ్రికా ఆలౌటయ్యింది. పాకిస్తాన్‌ని విజయం వరించింది.
పాక్ బౌలర్లలో ఇర్ఫాన్, అలీ, రియాజ్ చెరో మూడు వికెట్లు తీశారు. సొహైల్ఖాన్కి ఒక వికెట్ దక్కింది.