అవయవదానం.. ఒకప్పుడు పాపం. కానీ, ఇప్పుడది అత్యవసరంగా మారిపోయింది. మారుతున్న జీవన శైలి నేపథ్యంలో మానవాళి అనేకరకాలైన ఆరోగ్య సమస్యల్ని ఎదుర్కొంటోంది. డయాబెటీస్, హైపర్‌టెన్షన్.. ప్రపంచానికి పెను ముపగా మారాయి. ఈ రెండిటి కారణంగానే అనేక ఇతర జబ్బులు మానవాళిని పట్టి పీడిస్తున్నాయి. ఆహారపు అలవాట్లు, జీవనశైలిలో చిన్న చిన్న మార్పులు చేసుకుంటే చాలు.. ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. కానీ, క్షణం తీరిక లేని జీవితం, హైఫై ఫుడ్ కల్చర్ లాంటివి మనిషి ఆరోగ్యాన్ని చిన్నాభిన్నం చేసేస్తున్నాయి. ప్రధానంగా అధిక రక్తపోటు, మధుమేహం వల్ల శరీరంలోని ప్రధాన అవయవాలు దెబ్బతింటున్నాయి. ఇలాంటి సందర్భాల్లో అవయవ మార్పిడి అవసరమేర్పడుతోంది. రక్తదానం, నేత్రదానం గురించి ఇప్పటిదాకా వున్నాం. అమ్మో.. రక్తం దానం చేస్తే ఇంకేమన్నా వుందా? నిరసించిపోతాం.! అనే భావనలుండేవి ఒకప్పుడు. ఇప్పుడు పరిస్థితి మారింది. స్వచ్ఛందంగా రక్తదానం చేసేవారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. నేత్రదానం కూడా అంతే. కళ్ళు దానం చేస్తే చనిపోయాక వారి ఆత్మశాంతించదు.. అనే భయం వుండేది. అది గతం. ఇప్పుడు నేత్రదానం పట్ల కూడా అవగాహన బాగా పెరిగింది. నేత్రదానం, రక్తదానం అనేవి చాలా చిన్న విషయాలిప్పుడు.
మధుమేహం, అధిక రక్తపోటు.. వీటివల్ల అనారోగ్యం పాలైతే, అవయవాలు దెబ్బతింటే, ఇక వారికి అవయవ మార్పిడి ఒక్కటే మార్గం. ఎక్కడో విదేశాల్లోనే అందుబాటులో వుండేది ఈ అవయవదానం. పైగా, అత్యంత ఖరీదైన వ్యవహారమది. విదేశాల్లో కాదు, స్వదేశంలోనే.. ఇంకా చెప్పాలంటే మన హైద్రాబాద్‌లోనే అవయవదానం విరివిగా కాకపోయినా, అడపా దడపా జరుగుతోంది. అది కూడా విజయవంతంగా జరుగుతుండడం విశేషం. మొన్నీమధ్యనే బెంగళూరు నుంచి హైద్రాబాద్‌కి ఓ గుండె తరలివచ్చింది. గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి, అతి తక్కువ సమయంలో గుండెను బెంగళూరు నుంచి హైద్రాబాద్‌కి చేర్చి, గుండె జబ్బుతో బాధపడ్తున్న మహిళకు గుండెను అమర్చారు. అత్యంత క్లిష్టమైన గుండె మార్పిడి శస్త్ర చికిత్సను విజయవంతంగా నిర్వహించారు వైద్యులు. గతంలోనూ హైద్రాబాద్‌లోనే ఇలాంటి గుండె మార్పిడి శస్త్ర చికిత్సలు రెండు మూడు జరిగాయి. అయితే దాత, స్వీకర్త.. ఇద్దరూ హైద్రాబాద్‌లోనే వుండడంతో ‘రవాణా’ పెద్ద కష్టం కాలేదు. అక్కడికీ ఓ ఆసుపత్రి నుంచి ఇంకో ఆసుపత్రికి గుండెను తరలించడానికి తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది.
సాధారణంగా బ్రెయిన్‌డెడ్ అయిన వ్యక్తులనుంచి కిడ్నీ, లివర్, గుండె.. వంటి కీలక అవయవాల్ని సేకరించి, అవసరమైనవారికి అవయవమార్పిడి శస్త్ర చికిత్సలు చేస్తుంటారు. దేశవ్యాప్తంగా వేల సంఖ్యలో బాధితులు పైన చెపకున్న అవయవాలు ఎవరు దానం చేస్తారా.? అని ఎదురు చూస్తున్నారు. వేల సంఖ్యలో అవసరం.. లభ్యమవుతున్నవి పదుల సంఖ్యలో కూడా లేకపోవడంతో చాలామంది బాధితులు మృత్యువు ఒడిలోకి వెళ్ళిపోతున్నారు. మహారాష్ర్ట మాజీ ముఖ్యమంత్రి విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ కూడా ఇలానే అవయవదానం కోసం ఎదురుచూసీ చూసీ తుదిశ్వాస విడిచారు. రక్తదానం ఎవరైనా చేయొచ్చు. కుటుంబంలో ఎవరికైనా కిడ్నీలు కావాల్సి వస్తే, ఆ కుటుంబంలోని ఇంకో వ్యక్తి తనకున్న రెండు కిడ్నీల్లో ఒకటి దానం చేసే వీలుంటుంది. లివర్ విషయంలోనూ ఇంతే. కళ్ళూ అంతే. ఊపిరితిత్తులు, గుండె విషయంలో పరిస్థితి అలా కాదు. బ్రెయిన్ డెడ్ అయిన వారి నుంచే సేకరిస్తారు. మన దేశంలో బ్రెయిన్ డెడ్ కేసుల్ని తీసుకుంటే ఏటా వేల సంఖ్యలోనే వుంటాయి. అయితే తమ వారిని కోల్పోతున్నామనే ఆవేదనలో కన్నీరుమున్నీరయ్యే కుటుంబాలు, తమవారి అవయవాల్ని దానం చేయడానికి ముందుకు రాలేరు. సమస్య ఇక్కడే వచ్చి పడ్తోంది. అయితే ఇదివరకటితో పోల్చితే ఇప్పుడు అవయవదానం పట్ల అవగాహన పెరిగింది.
మార్కెట్‌లో కూరగాయలు అమ్మేసినంత తేలిగ్గా కాకపోయినా, చాటుమాటుగా డ్రగ్స్ దందా నిర్వహిస్తున్నట్లే, అవయవాల్ని విక్రయించే ముఠాలూ ఎక్కువైపోయాయి. పది నుంచి పాతిక లక్షలకు కిడ్నీ దొరుకుతోందని అప్పుడుప్పుడూ వెలుగు చూస్తోన్న ‘కిడ్నీ రాకెట్’లను చూస్తే అర్థమవుతుంది. ఇలాంటి సందర్భాల్లోనే అవయవదానం పట్ల సామాన్యుల్లో అవగాహన పెరుగుతోంది. కానీ, ప్రభుత్వాలు తగు రీతిలో అవయవదానం పట్ల ప్రజల్లో అవగాహన పెంచడం, ఖరీదైన వైద్యాన్ని కాస్తంతైనా అందుబాటులోకి తీసుకొచ్చేలా చర్యలు తీసుకోవడంలో చొరవ చూపడంలేదనే విమర్శ వుంది. తెలుగు రాష్ట్రాల్లోనూ, తమిళనాడు, కర్నాటకల్లోనూ పరిస్థితులు కాస్త మెరుగ్గానే వున్నా, మిగతా దేశవ్యాప్తంగా ఇదో ఉద్యమంలా చేపట్టేందుకు పాలకులే నడుం బిగించాలి. అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాలతో పోల్చలేంగానీ, ప్రపంచంలో భారతదేశానికి అవయవమార్పిడిలో ఘన చరిత్రే వుంది. అవయవ మార్పిడి విషయంలో మన దేశంలో సెక్సస్ రేట్ ఎక్కువేనని గణాంకాలు చెబుతున్నాయి.
ఒక్క వ్యక్తి బ్రెయిన్ డెడ్‌కి గురైతే, అతను ఇద్దరిలో, నలుగురిలో ఆరుగురిలో జీవించే అవకాశం అవయవదానం ద్వారా లభిస్తుంది. అవయవదానం చేస్తూ, దాత కుటుంబీకులు తమవారిని కోల్పోయామన్న ఆవేదనను దిగమింగి మరీ ఈ నగ్నసత్యం చెబుతుండడం అభినందనీయం. పుడుతూ ఏమీ తీసుకురాం.. చనిపోతూ ఏమీ తీసుకుపోం. కానీ, పోతూ పోతూ ఇంకొకరికి ప్రాణం పోసే అవకాశం రావడమంటే అదేమీ మామూలు విషయం కాదు. ప్రజల్లో అవగాహన పెరగాలి, ప్రభుత్వాలు సైతం బాధ్యతగా వ్యవహరించాలి. అప్పుడే అవయవదానం మరింత సులువవుతుంది.
వెంకట్ ఆరికట్ల