‘లింగా’తో రజనీకాంత్ కు కొత్త టార్చర్!

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కు 'లింగా' ఒక పీడకల. అత్యంత భారీ బడ్జెట్ తో శరవేగంగా రూపొందించిన ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది. తమిళ , తెలుగు భాషల్లో భారీ ప్లాఫ్ గా…

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కు 'లింగా' ఒక పీడకల. అత్యంత భారీ బడ్జెట్ తో శరవేగంగా రూపొందించిన ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది. తమిళ , తెలుగు భాషల్లో భారీ ప్లాఫ్ గా నిలిచింది. అదే చేదు అనుభవం అనుకొంటే.. తమిళ డిస్ట్రిబ్యూటర్లు చేసిన గొడవ సూపర్ స్టార్ కు తలనొప్పి అయ్యింది. తమకు భారీ రేటుకు ఈ సినిమాను అంటగట్టారని.. అయితే  సినిమా ప్లాఫ్ కావడంతో దారుణమైన నష్టాలను ఎదుర్కొంటున్నామని డిస్ట్రిబ్యూటర్లు అందోళనకు దిగారు.

క్లీన్ ఇమేజ్ ఉన్న రజనీకాంత్ కు డిస్ట్రి బ్యూటర్ల గొడవ కళంకంగా మారింది. వారి ఆవేదనను సూపర్ స్టార్ పట్టించుకోకుండా ఉండటానికి మించి ఏమీ చేయలేని పరిస్థితి! అంత డబ్బును తను వెనక్కు ఇవ్వలేడు.. నిర్మాతల చేత కూడా ఇప్పించలేడు! డిస్ట్రి బ్యూటర్ల నష్టాలు కూడా నిజమే. దీంతో రజనీ మొహం చాటేయక తప్పలేదు!

మరి అదే చేదు అనుభవం అనుకొంటే.. ఇప్పుడు లింగాపై కోర్టులో కొత్త పిటిషన్ పడింది. ఈ సినిమాకు వినోద పన్ను మినహాయింపును ఇవ్వడంపై కొంతమంది కోర్టుకు ఎక్కారు. సాధారణంగా తమిళనాడులో సినిమా పేరు తమిళంలో పెడితే కొంత పన్ను మినహాయింపు వస్తుంది. అలాంటి మినహాయింపే లింగాకు దక్కిందట. కానీ.. 'లింగా' అనేది తమిళ టైటిల్ కాదని పిటిషనర్ అంటున్నాడు.

ఒక సంస్కృత టైటిల్ ను పెట్టి లింగా సినిమా వాళ్లు వినోదపు పన్ను మినహాయింపు పొందారని.. ఇది అక్రమమని అంటూ పిటిషనర్లు కోర్టుకు విన్నవించారు. ఈ అంశంపై విచారణ జరిపించి..లింగా సినిమా నిర్మాతల చేత 21 కోట్ల రూపాయల పన్నును వసూలు చేయాలని పిటిషనర్ కోర్టు కోరారు. మరి ఇప్పుడు గనుక కోర్టు ఈ వాదనతో ఏకీభవిస్తే..లింగా యూనిట్ పరిస్థితి ఏమిటో!