ఈ వరల్డ్ కప్‌లో రెండు టీమ్‌లు ఒకదాని తర్వాత ఒకటి డబుల్ హ్యాట్రిక్‌ని నమోదు చేశాయి. వరుసగా ఆరు మ్యాచ్‌లు గెలిచిన న్యూజిలాండ్ తొలి డబుల్ హ్యాట్రిక్‌ని నమోదు చేయగా, రెండో డబుల్ హ్యాట్రిక్‌ని టీమిండియా నమోదు చేసింది. ఆడిన ఆరు మ్యాచ్‌లనూ గెలిచి పూల్-ఎలో న్యూజిలాండ్ టాప్ ప్లేస్‌లో వుంటే, పూల్-బిలో అదే ఘనత సాధించి టీమిండియా టాప్ గేర్‌లో దూసుకుపోతోంది.
జింబాబ్వేతో ఈ రోజు జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఆరు వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 287 పరుగులు చేసింది. భారత బౌలర్లను జింబాబ్వే బ్యాట్స్‌మన్ సమర్థవంతగా ఎదుర్కొన్నారు. టేలర్ సెంచరీ జింబాబ్వే ఇన్నింగ్స్‌కి హైలైట్.
288 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్‌కి దిగిన టీమిండియా ఆరంభంలోనే వికెట్లు చేజార్చుకుంది. ఓపెనర్లు నిరాశపర్చారు. ధావన్ 4 పరుగులకు ఔట్ అయితే, రోహిత్‌శర్మ 16 పరుగులకు వికెట్ పారేసుకున్నాడు. కాస్సేపు ప్రతిఘటించిన కోహ్లీ కూడా 38 పరుగులకు ఔట్ అయ్యాడు. రహానే 19 పరుగులు చేసి రనౌట్ అయ్యాడు. 92 పరుగులకు 4 కీలక వికెట్లు కోల్పోవడంతో టీమిండియా గెలుపుపై అనుమానాలు నెలకొన్నాయి భారత క్రికెట్ అభిమానుల్లో.
అయితే రైనా, ధోనీ బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడి టీమిండియాని విజయపథాన నడిపించారు. సెంచరీతో రైనా చెలరేగిపోతే, కెప్టెన్‌గా ధోనీ బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. రైనా 110 పరుగులు చేస్తే ధోనీ 85 పరుగులు చేయడంతో టీమిండియా విజయతీరాలకు చేరింది.