లార్డ్స్ టెస్టులో చిత్తుగా ఓడిన జట్టు ఇదేనా? అని బ్రిటీషర్లు అనుమానంగా చూసి ఉంటారు. తొలి రెండు టెస్టుల్లో చిత్తైన భారత టీమ్ ఇదేనా? అని ప్రపంచంలోని క్రికెట్ వీక్షకులంతా ఆశ్చర్యపోయి ఉంటారు. విరాట్ కొహ్లీ సారధ్యంలోని టీమిండియా మరో మరపురాని విజయాన్ని అందుకుంది. ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టెస్టు మ్యాచ్‌లో భారత జట్టు భారీ విజయాన్ని నమోదు చేసింది. 203 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా సీరిస్‌లో ఇంగ్లండ్ ఆధిక్యాన్ని 2-1కి తగ్గించగలిగింది. సీరిస్ పై ఆశలను సజీవంగా ఉంచుకోగలిగింది.
లార్డ్స్ టెస్టులో కొహ్లీ సేన చిత్తు అయిన తీరును చూశాకా భారతీయుల నుంచినే విమర్శలు తీవ్రం అయ్యాయి. మరీ అంత దారుణంగా ఆడారు ఆ మ్యాచ్‌లో. వీళ్ల బదులు కామెంట్రీ కోసమని ఇంగ్లండ్ వెళ్లిన గంగూలీని, లక్ష్మణ్ వంటి వాళ్లను బరిలోకి దించి ఆడిస్తే మేలేమో అని అభిమానులు కామెంట్స్ చేశారు. ఇక విదేశీయులు కూడా టీమిండియా ఆట మీద సెటైర్లు వేయడం మొదలుపెట్టారు. ఆ కసే రెచ్చగొట్టిందే ఏమో కానీ.. కొహ్లీ సేన బౌన్స్ బ్యాక్ అయ్యింది.
ఇంగ్లండ్‌ను అలవోకగా ఓడించింది. ఇక ఈ మ్యాచ్‌తో విరాట్ కొహ్లీ మరోసారి తనేంటో నిరూపించుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో 97 పరుగులకు ఔట్ అయిన కొహ్లీ రెండో ఇన్నింగ్స్ సెంచరీని పూర్తి చేశాడు. తద్వారా తను ఇంత వరకూ రాణించని ఇంగ్లండ్‌లో కూడా రాణించి చూపించాడు. తను ఎందుకు అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌నో నిరూపించుకున్నాడు.
ఇక ఈ మ్యాచ్‌లో బౌలర్ల ప్రతిభను కూడా ఎంత ప్రశంసించినా తక్కువే. తొలి ఇన్నింగ్స్‌లో హర్ధిక్ పాండ్యా ఐదు వికెట్లు తీసి ఇంగ్లండ్‌ను దెబ్బతీయగా, సెకెండ్ ఇన్నింగ్స్‌లో బుమ్రా ఆ బాధ్యత తీసుకున్నాడు. ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో కొంత మేర పోటీ ఇచ్చింది. అయితే అంతర్జాతీయ టెస్టు క్రికెట్ చరిత్రలో ఏనాడూ 520 పరుగులు ఛేదించిన దాఖలాలు లేవు. ఈ కొండలాంటి లక్ష్యం ముందు ఇంగ్లండ్ బ్యాటింగ్ ఆర్డర్ నిలబలేడకపోయింది. నాలుగో రోజే టీమిండియా విజయం ఖరారు కాగా, ఐదో రోజు తొలి అరగంటలోనే ఆ లాంఛనం పూర్తి అయ్యింది. భారత జట్టు ఇదే స్ఫూర్తిని తదుపరి మ్యాచ్‌లలో కూడా కొనసాగించి.. ఇంగ్లండ్ గడ్డ మీద టెస్టు సీరిస్‌ను నెగ్గుకు రాగలిగితే.. కొహ్లీ కెరీర్లో అదో కలికితురాయి అవుతుంది.