ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం, టీమిండియా – న్యూజిలాండ్ జట్ల మధ్య ఐదో వన్డేకి వేదికైన విషయం విదితమే. వరుణుడి దెబ్బ తగులుతుందని అంతా అనుకున్నా, తుపాను అనూహ్యంగా బలహీనపడ్డంతో మ్యాచ్ నిర్వహణకు ఎలాంటి ఇబ్బందులూ కలగలేదు. ఇంకోపక్క ఈ మ్యాచ్‌లో అతి పెద్ద విశేషమేంటంటే, టీమిండియా ఆటగాళ్ళు తమ జెర్సీల మీద తమ తమ 'అమ్మ' పేర్లతో హల్చల్ చేస్తుండడం.
మహేంద్రసింగ్ ధోనీ జెర్సీ మీద ఆయన తల్లి దేవకి పేరుంది. రహానే జెర్సీ మీద సుజాత పేరు.. ఇలా టీమిండియా క్రికెటర్లందరి జెర్సీలపైనా వారి వారి 'అమ్మ' పేర్లున్నాయి. 'అమ్మకి ప్రేమతో..' అంటూ టీమిండియా ఆటగాళ్ళు సరికొత్త జెర్సీలతో కన్పించడంతో విశాఖ క్రికెట్ స్టేడియంలో అభిమానుల ఆనందానికి హద్దే లేకుండా పోయింది.
అన్నట్టు, రోహిత్ శర్మ తల్లి విశాఖకు చెందినవారే. అందుకేనేమో, విశాఖ స్టేడియంలో రోహిత్ రెచ్చిపోయాడు. 20 ఓవర్లు ముగిసే సమయానికి టీమిండియా 114 పరుగులు చేసింది. రహానే 20 పరుగులకు సైట్ కాగా, రోహిత్ అర్థ సెంచరీతో దూకుడుమీదున్నాడు. ఈ మైదానంలో కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీకి మంచి రికార్డుంది. భారీ సెంచరీని ఇదే వేదికపై నమోదు చేసి, ధోనీ హాట్ టాపిక్ అయ్యాడు.
ఇదిలా వుంటే, విశాఖ వన్డే ఫలితంతోనే సిరీస్ ఫలితం తేలనుంది. ఇప్పటిదాకా జరిగిన నాలుగు వన్డేల్లో టీమిండియా రెండు, కివీస్ జట్టు రెండు విజయాల్ని నమోదు చేశాయి. దాంతో ఈ మ్యాచ్ ఫైనల్‌ని తలపిస్తోంది.