రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అర్థ సెంచరీలు.. కాస్సేపు హడావిడి చేసిన ధోనీ.. చివర్లో అక్షర్‌పటేల్, కేదార్ జాదవ్ కొంచెంగానే అలరించారు.. వెరసి, టీమిండియా స్కోర్ జస్ట్ 269 పరుగులు మాత్రమే. న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఐదో వన్డేలో టీమిండియా స్కోర్ ఇది. నిజానికి ఇదే ఫైనల్ మ్యాచ్. సిరీస్‌ని నిర్ణయించే మ్యాచ్ అన్నమాట. వైజాగ్‌లో జరుగుతున్న మ్యాచ్ కావడంతో, మినిమమ్ 300 స్కోర్‌ని భారత క్రికెట్ అభిమానులు ఆశించారు.
ప్చ్.. నిరాశే ఎదురయ్యింది. విశాఖలో టీమిండియా కెప్టెన్ ధోనీకి మంచి రికార్డుంది. ఒకప్పుడు ఇదే గ్రౌండ్‌లో సిక్సర్ల మోత మోగించి భారీ సెంచరీ నమోదు చేశాడు ధోనీ. అలాంటి ఇన్నింగ్స్‌తో ధోనీ అలరిస్తాడనుకుంటే, 41 పరుగులకే తుస్సుమనిపించేశాడు. కోహ్లీ సెంచరీ చేసేలా కన్పించినా, అనవసరంగా వికెట్ పారేసుకున్నాడు. రోహిత్ శర్మ కూడా అంతే. ధాటిగా ఆడాడుగానీ, సెంచరీ కొట్టలేకపోయాడు.
ఓవరాల్‌గా బ్యాటింగ్ కోణంలో చూస్తే టీమిండియా భారత క్రికెట్ అభిమానుల్ని ఉస్సూరుమనిపించింది. బంతి బీభత్సంగా టర్న్ అవుతుండడంతో, మ్యాచ్ ఫలితం భారత్ వైపే మొగ్గు చూపేలా వున్నా.. ఏమో, ఏదైనా జరగొచ్చుగాక. బ్యాటింగ్ మెరుపులు పెద్దగా లేవు.. బౌలింగ్ మెరుపులు చూపిస్తే తప్ప, టీమిండియా ఈ మ్యాచ్‌నీ, సిరీస్‌ని గెలుచుకునే అవకాశాల్లేవు.
మామూలుగా అయితే 269 పరుగులు పెద్ద స్కోరేమీ కాదు. కానీ, న్యూజిలాండ్ బ్యాటింగ్‌లోనూ నిలకడ కన్పించడంలేదు గనుక, భారత బౌలర్లు కాస్త కష్టపడితే చాలు.. ఫలితం మనదే అవుతుంది.