వరల్డ్ కప్ లీగ్ దశ ముగిసింది. లీగ్ దశ వరకూ తీసుకుంటే నాలుగు సెంచరీలతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు శ్రీలంక ఆటగాడు సంగక్కర. వరల్డ్ కప్‌లో అయినా, వన్డే క్రికెట్లో అయినా.. వరుసగా నాలుగు సెంచరీలు చేసిన రికార్డుని సొంతం చేసుకున్న సంగక్కర, 496 పరుగులు చేశాడు. ఆడింది ఆరు మ్యాచ్‌లు.. అందులో నాలుగు సెంచరీలు.. అంటే చిన్న విషయమేమీ కాదు. వరల్డ్ కప్ తర్వాత రిటైర్మెంట్ ప్రకటించాలనే ఆలోచనతో వున్న సంగక్కర, వరల్డ్ కప్‌ని ఎలాగైనా సాధించాలనే కసితో వున్నాడనడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి.?
ఇక, వ్యక్తిగత స్కోర్ పరంగా చూసుకుంటే టాప్ 10లో ముగ్గురు లంక బ్యాట్స్‌మెన్ చోటు దక్కించుకున్నారు. దిల్షాన్ 2 సెంచరీలు సహా, 395 పరుగులతో నాలుగో స్థానంలో వుంటే, ఒక సెంచరీతో 291 పరుగులతో లంక బ్యాట్స్‌మన్ తిరుమన్నే 9వ స్థానంలో నిలిచాడు. తొలి మ్యాచ్‌లో పరాజయం చవిచూసిన శ్రీలంక, ఆ తర్వాత పుంజుకుంది. పుంజుకున్నట్టే పుంజుకుని ఆస్ట్రేలియా చేతిలో మాత్రం లంక పరాజయం పాలైనప్పటికీ ఈ టోర్నీలో లంక ప్రత్యర్థులకు డేంజరస్ టీమ్ కిందే లెక్క.
టీమిండియా బ్యాట్స్‌మెన్ విషయానికొస్తే, ధవన్ ఒక్కడే 333 పరుగులతో 6వ ప్లేస్‌లో వున్నాడు. ధవన్ ఖాతాలోరెండు సెంచరీ లు వున్నాయి. సౌతాఫ్రికా ఆటగాడు డివిలియర్స్ ఒకే ఒక్క సెంచరీతో, 417 పరుగులు చేసి మూడో స్థానంలో నిలిచాడు. టోర్నీ నుంచి నిష్క్రమించిన జింబాబ్వే ఆటగాడు బ్రెండన్ టేలర్ 433 పరుగులు చేసి రెండో స్థానంలో నిలిచాడు. బంగ్లా ఆటగాడు మహ్మదుల్లా వరుసగా రెండు సెంచరీలు సాధించి, నాలుగో స్థానంలో నిలిచాడు. 344 పరుగులు చేశాడు మహ్మదుల్లా.
ఈ టోర్నీలో డబుల్ సెంచరీ సాధించినా, మిగతా మ్యాచ్‌లలో విఫలమైన క్రిస్‌గేల్ 279 పరుగులతో పదో స్థానంలో నిలిచాడు.