మొన్నటి వరకూ బీసీసీఐ విరాట్ కొహ్లీని కెప్టెన్సీ నుంచి తప్పించేందుకు ప్రయత్నాలు చేసింది. టీ20 కెప్టెన్సీ నుంచి విరాట్ తప్పుకున్న అనంతరం, వన్డే కెప్టెన్సీ నుంచి బీసీసీఐ తప్పించింది. దక్షిణాఫ్రికాతో టెస్టు సీరిస్ కు విరాట్ ను కెప్టెన్ గా ఎంపిక చేసిన బోర్డు, వన్డే సీరిస్ కు మాత్రం అతడికి ఆ బాధ్యతలు ఇవ్వలేదు.
ఇంతలో టెస్టు కెప్టెన్సీకి కూడా గుడ్ బై చెప్పేశాడు కొహ్లీ. ఏడేళ్ల కిందట టెస్టు కెప్టెన్ గా బాధ్యతలు స్వీకరించిన కొహ్లీ ఇప్పుడు ఆ ఫార్మాట్ కెప్టెన్సీ నుంచి కూడా తప్పుకున్నాడు. ఇక పై కేవలం ఆటగాడిగా కొనసాగే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి.
విరాట్ కెప్టెన్సీల్లో టెస్టుల్లో భారత జట్టు మంచి ప్రదర్శన కనబరించింది. వన్డే కెప్టెన్ గా ఐసీసీ టోర్నీలేవీ సాధించలేకపోయినా.. టెస్టుల్లో మాత్రం కొహ్లీ కెప్టెన్సీలోనే మరపురాని విజయాలు సాధ్యం అయ్యాయి. కొహ్లీ సారధి అయ్యాకా ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియాపై టెస్టు సీరిస్ ను నెగ్గింది టీమిండియా. వరసగా రెండు సార్లు ఈ ఫీట్ సాధ్యం అయ్యింది. అయితే రెండోసారి సీరిస్ గెలిచినప్పుడు.. గెలిచిన రెండు మ్యాచ్ లకూ రహనే సారధిగా వ్యవహరించాడు.
ఇక ఇంగ్లండ్ లో కూడా కొహ్లీ నాయకత్వంలో టీమిండియా టెస్టు సీరిస్ లో పై చేయి సాధించింది. దక్షిణాఫ్రికాలో రెండు సార్లు పర్యటించగా, రెండు మ్యాచ్ లలో మాత్రమే విజయం సాధ్యం అయ్యింది. అయితే కొహ్లీ కెప్టెన్సీలో న్యూజిలాండ్ లో టీమిండియా సీరిస్ నెగ్గలేకపోయింది. శ్రీలంకపై శ్రీలంకలో టెస్టు సీరిస్ విజయాన్ని నమోదు చేసింది.
ఏతావాతా.. టెస్టుల్లో కొహ్లీ కెప్టెన్సీలో మరపురాని విజయాలే ఉన్నాయి. టీమిండియాకు టెస్టుల్లో అత్యంత విజయవంతమైన కెప్టెన్ కూడా కొహ్లీనే ఇప్పుడు. ఇతడి కెప్టెన్సీలో మొత్తం అరవై ఎనిమిది టెస్టులో ఆడిన టీమిండియా వాటిల్లో నలభై టెస్టులను నెగ్గింది. 17 టెస్టుల్లో ఓడింది. 11 టెస్టులు డ్రా అయ్యాయి.